Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాలీవుడ్ హర్రర్చిత్రాల్లో దెయ్యాలు, ఆత్మలు పుష్కలంగా ఉంటాయి. చిత్రం చివర్లో మళ్లీ అదే దెయ్యం హఠాత్తుగా వచ్చి మీదపడి భయం గొల్పే విధంగా ముగింపునిస్తారు. ప్రేక్షకులు అలా జడుసుకుని భయం గుప్పెట్లో ఉండాలనేది దర్శక నిర్మాతల లక్ష్యం. అప్పుడే కాసుల వర్షం కురుస్తుందనేది ఆ సినీ వ్యాపార సూత్రం కూడా.
సరిగ్గా అదే రీతిలో సదరు బీజేపీ పాలకులు కొందరు న్యాయవాదులు వ్యవహరించడం కద్దు. ఎన్నికల్లో ఓట్లవర్షం కురిపించుకోవాలనుకునే దుష్టతలంపే ఇందుకు కారణం అని వేరుగా చెప్పక్కర్లేదు కదా..!
ప్రస్తుతం దేశంలో చెలరేగుతున్న మతవిద్వేష పరిణామాలకు బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్శర్మయే ప్రధాన కారణమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆమె వెంటనే దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది కూడా. చీప్ పబ్లిసిటీ కోసం నీచమైన ఎత్తుగడలతో మాట్లాడటం వలన ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయని ఉటంకించింది. మైనారిటీల మత ప్రవక్తపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే దేశదేశాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికిన విషయం తెలిసిందే. ముంబై, హైదరాబాద్, శ్రీనగర్ తదితర నగరాల్లో ఆమెపై ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ ఒక్కటిగా చేర్చి ఢిల్లీ కోర్టుకు బదలాయించాలన్న నుపుర్‌శర్మ పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జాతీయపార్టీకి అధికార ప్రతినిధి అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం ఎవ్వరికీ ఉండదని స్పష్టం చేసింది. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు మతాలను గౌరవించరని, కేవలం రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మాత్రమే వారికి చేతనవునని ఆక్షేపించింది. మొత్తం ఈ విద్వేష విషమస్థితికి ఆమెయే బాధ్యత వహించాలని పేర్కొన్నది. అసలు ఆమెకు ప్రాణహానా? లేక దేశ భద్రతకే ఆమె హానిగా మారారా? గమనించుకోవాలని హెచ్చరించింది.
'టీవీలో ఆమె జరిపిన చర్చను స్వయంగా వీక్షించాం. అసలు ఆమె ఓ న్యాయవాదిగా చెప్పుకోవడమే సిగ్గుచేటు' అని వ్యాఖ్యానించింది. పైగా ఇలాంటి అవకాశం కల్పించిన టీవీ చానల్‌పై కూడా సుప్రీంకోర్టు మండిపడింది. టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నలకే నుపుర్‌శర్మ అలా సమాధానమిచ్చారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు చెప్పగా, 'మరి అలాంటప్పుడు యాంకర్‌పై నుపుర్‌శర్మ ఎందుకు ఫిర్యాదు చేయలేదని' సుప్రీం ఘాటుగానే ప్రశ్నించింది. దాంతో సదరు న్యాయవాదికి నోట్లో వెలక్కాయపడ్డట్టు అయింది.
కాగా, దేశంలో కావాలని భావోద్వేగాలు రగిలించి విద్వేషాలు పెంచే కుటిల రాజకీయ చర్చలతో సమానంగా సాధారణ జనహితం కోరే పాత్రికేయ చర్చల సరళిని పోల్చలేమని కూడా సుప్రీం తెలిపింది. అసలు ఆమెలోని అహంకారం ఆమె పిటీషన్లోనే దర్శనమవుతున్నదని తెలిపింది. క్షమాపణ చెబుతూ నుపుర్‌శర్మ రాసిన లేఖను ఆమె తరపు న్యాయవాది చూపించగా, ఆమె టీవీ చానల్స్‌కు వెళ్ళి క్షమాపణ చెప్పి ఉండాల్సిందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఆమె అనుచిత వ్యాఖ్యలతో దేశభద్రతకు జాతీయ సామరస్యానికి తీరని నష్టం వాటిల్లిందని పేర్కొంటూ... ఆమె ఆ వ్యాఖ్యలు ఉపసంహరించు కోవడానికి సైతం కాలహరణం జరిగిందని ఆక్షేపించింది. ప్రజల మనోభావాలు గాయపడిన నేపథ్యంలో చాలా జాగురుకతతో క్షమాపణలు చెప్పవలసి ఉంటుందని కూడా సుప్రీం అభిప్రాయపడింది.
'నుపుర్ కేసులు పెట్టిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేశారు. కాని నుపుర్‌పై నమోదైన కేసులననుసరించి ఆమెను మాత్రం అరెస్టు చేయలేదు.' దీనిని బట్టి ఆమెకు అధికార వర్గాల్లో గల పలుకుబడి కూడా అర్థమవుతుందని కోర్టు కుండబద్దలు కొట్టింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైనా అరెస్టు చేయకపోవడం వల్లనే మరింత బాధ్యతారహిత ప్రకటనలు ఆమె నోటి నుండి వెలువడినట్టు కోర్టు తెలిపింది.
నుపుర్ శర్మ కేసు విషయమై సుప్రీం ధర్మాసనం ఇలా స్పందించి మాట్లాడిన మాటలు మీడియావారికి, న్యాయవాది వృత్తిలో ఉన్నవారికి శిరోధార్యమే అని చెప్పక తప్పదు. అందుకే సుప్రీం వ్యాఖ్యలను విపక్షాలతో పాటు ప్రజాస్వామ్య శక్తులు స్వాగతించాయి. సుప్రీం వ్యాఖ్యలకు బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ అన్నారు. ఇప్పటికైనా బీజేపీ సరైన చర్యలు గైకొనకపోతే ఆ పార్టీ నుండి మరింతమంది ప్రమాదకారులు పుట్టుకొస్తారని సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి హెచ్చరించారు. దేశంలో నెలకొనివున్న ఈ భయానక పరిస్థితిని గమనించిన నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ''ఏ విషయం గురించైనా మీరుభయపడు తున్నారా..? అని ప్రశ్నిస్తే అవుననే నేను సమాధానం చెపుతాను. ఇప్పుడు దేశ ప్రజలకు సమైక్యత అత్యవసరం'' అని ఆయన నొక్కి చెప్పారు. తస్మదీయుల పట్ల పెట్రేగిపోవడం, అస్మదీయులపట్ల మౌనం వహించడం బీజేపీ వైఖరిగా మారింది. ఇంత జరిగినా ఈ వ్యవహారానికి చరమవాక్యం కనుచూపుమేరలో కానరావడం లేదు.
అందుకు తార్కాణం నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది అజరు గౌతమ్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు లేఖతో కూడిన పిటిషన్ సమర్పించారు. అప్పుడే ఆమెపై పారదర్శకంగా విచారణ జరిపే అవకాశం ఉంటుందని అందులో 'తెలివిగా' పేర్కొన్నారు.
హాలీవుడ్ హర్రర్ చిత్రాలకు తీసిపోని రీతిలో బీజేపీ టెర్రర్ ఇకముందు కూడా ఇలానే కొనసాగు తుందని వేరే చెప్పాలా...?
- కె శాంతారావు
సెల్:9959745723