Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ మహిళా దినోత్సవం లాంటి కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నా, మహిళలకు మన ప్రభుత్వాలు చేస్తుంది మాత్రం శూన్యం. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు, విరివిగా నిధులు ఇచ్చే వారికే టిక్కెట్లు ఇచ్చే సంప్రదాయం అన్ని రాజకీయ పార్టీల ప్రాధాన్యమైంది. ఓటర్ల ప్రత్యక్ష ప్రమేయంలేని రాజ్యసభ, శాసనమండలి అభ్యర్థుల ఎంపికలో కూడా రాజకీయ పార్టీలు డబ్బున్న అభ్యర్థికే జైకొడుతున్నాయి. చివరికి ఉన్నత న్యాయస్థానాల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం ఆశాజనకంగా లేదు. ఒక నివేదిక ప్రకారం దేశంలోని 25హైకోర్టుల్లో 713మంది జడ్జి పోస్టులకు గాను ఏప్రిల్, 2021 నాటికి కేవలం 13.18శాతంతో 94మంది మహిళా జడ్జిలు మాత్రమే పనిచేస్తున్నారు. మద్రాస్ హైకోర్టు 13మంది, ఢిల్లీ హైకోర్టు 12మంది మహిళా జడ్జిలతో దేశంలోని హైకోర్టుల్లో మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా తెలంగాణ హైకోర్టు 10మందితో మూడవ స్థానంలో ఉంది. తెలంగాణ హైకోర్టులోని 10మంది మహిళా న్యాయమూర్తుల్లో 9మందిని ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కొలీజియం నియామకం చేయటం విశేషం. ఇక్కడి పదిమంది మహిళా న్యాయమూర్తుల్లో ముగ్గురు న్యాయవాదుల కోటా నుండి నియామకం కాగా, మిగతా ఏడుమంది జిల్లా జడ్జి స్థాయినుండి పదోన్నతిపై నియమించబడ్డవారు. తెలంగాణ హైకోర్టు చీఫ్‌జస్టిస్ పదవి నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లిన మొట్టమొదటి మహిళ జస్టిస్ హిమా కోహ్లీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే నియామకానికి నోచుకున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినంత వరకు మొట్ట మొదటి మహిళా జడ్జి జస్టిస్ అమరేశ్వరి. వీరి నియామకం 1977లో జరిగింది. జస్టిస్ లీలా సేథ్ దేశంలోనే మొట్ట మొదటి హైకోర్టు చీఫ్ జస్టిస్. వీరు 1991లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో నియమితులయ్యారు. ఇదిలా ఉండగా దేశంలోని ఐదు హైకోర్టుల్లో మహిళా జడ్జిలే లేకపోవటం శోచనీయం.
న్యాయవాద వృత్తి అనే సరికి మహిళలు అంతగా మొగ్గు చూపటం లేదనేది వాస్తవం. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో వారిసంఖ్య అధికంగానే ఉన్నా, చిన్న చిన్న పట్టణాల్లో మహిళా న్యాయవాదులు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు. బార్కౌన్సిల్లో నమోదు చేయించుకొని కూడా వృత్తి చేపట్టని వారు, వృత్తిని మధ్యలో మానుకున్న వారు చాలామంది ఉన్నారు. వృత్తిలో చేరిన వెంటనే ఆదాయం లేకపోవటంతో పేదవారు, తక్కువ సమయంలో డబ్బు సంపాదించుకోవాలనుకునే వారు ఇతర వ్యాపకం వైపు అడుగులు వేస్తున్నారు.
సుప్రీంకోర్టులో స్వాతంత్య్రం వచ్చిన 42ఏండ్ల తరువాత మొట్ట మొదటి మహిళా జడ్జిగా జస్టిస్ ఫాతిమా బీవీ నియామకం జరిగింది. వీరు కేరళ హైకోర్టు జడ్జిగా ఉండి పదోన్నతిపై1989లో సుప్రీం న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఆ నాటి నుండి ఇప్పటి దాకా కేవలం 11మంది మహిళా జడ్జిలు మాత్రమే సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో నలుగురు మహిళా న్యాయమూర్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంత కాలం క్రితం కర్నాటక హైకోర్టు నుండి పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డ జస్టిస్ బి.వి. నాగరత్న (విశ్రాంత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకట్రామయ్య కుమార్తె) సీనియారిటీ ప్రకారం అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి అలంకరించే మొట్టమొదటి మహిళా జాబితాలో చేరే అవకాశం ఉంది. మనం ఇప్పటి దాకా మహిళా రాష్ట్రపతిని, మహిళా ప్రధానిని, మహిళా గవర్నర్‌ను, మహిళా ముఖ్యమంత్రిని చూడటం జరిగింది. కానీ భారత ప్రధాన న్యాయమూర్తిగా మహిళను చూడలేదు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సీనియర్ న్యాయమూర్తులతో ఏర్పడ్డ కొలీజియం ద్వారా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. ఈ నియామక ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి అధికారిక ఆమోదముద్ర వేస్తారు. కొలీజియం పద్ధతి ద్వారా జరిగే నియామకాలకు స్వస్తి చెప్పి, జాతీయ జ్యుడిషియల్ నియామకాల కమిషన్ చట్టం-2014 నిర్దేశించిన విధంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని, 99వ రాజ్యాంగ సవరణను సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో 2015లో కొట్టివేసింది. కాబట్టి కొలీజియం విధానం అమల్లో ఉంది.
తడకమళ్ళ మురళీధర్
సెల్: 9848545970