Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీ జాతీయ సమావేశాల్లో సిద్ధాంతాలు, సమీక్షలు, విధాన పరమైన లోపాలు, విజయాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ జరగడం సహజం. కానీ, హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ సమావేశాలు ఇందుకు భిన్నంగా ఓట్లు, సీట్లు, అధికారమే లక్ష్యంగా జరిగినట్లు సమావేశాల తీరు ద్వారా తెలుస్తున్నది. పెరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం పరిశీలిస్తే... వారికి కేవలం అధికారమే లక్ష్యంగా ఉన్నట్లు స్ఫష్టమవుతున్నది. డబుల్ ఇంజన్ సర్కారు కోసం ఆరాటమే తప్ప, 8ఏండ్ల కాలంలో కేంద్ర ప్రభత్వం ద్వారా తెలంగాణలో చేసిన అభివృద్ధిపై ఎక్కడా ప్రస్తావనే లేకపోవడం గమనార్హం! అలాంటప్పుడు ఇక్కడి ప్రజలు ఎలా విశ్వసిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
జాతీయ సమావేశాలకు ముందు నియోజక వర్గానికో ఎంపీ, మంత్రిని ఇంఛార్జీగా నియమించిన బీజేపీవారు, ఆయా ప్రాంతాల నుండి సభకు జనాన్ని తరలించడానికి నానా తంటాలు పడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా తెలంగాణలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు పొందిన లబ్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఆ పార్టీ నేతలు ప్రస్తావించడానికి అవకాశమే లేకుండా పోయింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజరు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు లోనైనా ఓ పెద్ద ప్రాజెక్టు తీసుకురాలేక పోయారనే విమర్శను మూటగట్టుకున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం గురించి పదే పదే చెబుతున్నా, ఇందులో స్థానికులెందరికి ఉద్యోగాలు కల్పించారనేది మాత్రం చెప్పలేని పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలున్నారు. పైగా గ్యాస్ లీకేజీ, కలుషిత, విషపూరితమైన వాతావరణంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పరిసర ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. వీటిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన దాఖలాలు ఎక్కడా లేవు.
రాష్ట్ర పునఃర్విభజన హామీలు ఏవీ కూడా అమలు కావడం లేదు. ఐఐటీ, గిరిజన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి పలు అంశాలపై కేంద్ర సర్కారు ఊసే ఎత్తడం లేదు. అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులూ రావడం లేదు. నవోదయ, సైనిక్ స్కూల్, త్రిపుల్ ఐటీ.. ఇలా పలు అంశాల్లో రాష్ట్ర వాటా దక్కడం లేదు. 73రకాల పథకాలను అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. రెండు, మూడు మినహా మిగతా స్కీమ్‌ల ఉనికే లేకుండా పోయింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఫసల్ బీమా యోజన లాంటి ప్రధానమైన పథకాలకు ఇక్కడ మోక్షం లేదు. వ్యవసాయ అనుబంధంతో పాటు ఎక్కువగా ఆధారపడే చేనేత, పవర్ లూమ్ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపే చూస్తోంది. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ డిజైన్, మెగా పవర్లూమ్ క్లస్టర్, హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ఏర్పాటులో నిర్లక్ష్యం చూపుతోంది. ఇండిస్టీయల్ కారిడార్ ఏర్పాటుపైనా ఇప్పటి వరకూ చర్యలు శూన్యం.
వ్యవసాయ విధానాన్ని ప్రకటించలేదు. ఉత్పత్తులు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, ప్రోత్సహకాలు, పంటల పరిహారం.. ఇలా అనేక అంశాలపై రైతాంగానికి భరోసా కల్పించడంలేదు. ప్లాస్టిక్ సంపూర్ణ నిషేదాన్ని ప్రకటించినా, ప్రత్యామ్నామ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించడం లేదు. ప్లాస్టిక్ వస్తువుల తయారీ కర్మాగారాలను మూసి వేయడం వల్ల అందులో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడుతారు. కాబట్టి ప్రత్యామ్నాయ పరిశ్రమల ఏర్పాటుకు కనీసం ప్రోత్సహకాలైనా ప్రకటించాలన్న ధ్యాసే కేంద్రానికి లేదు. ప్రజల నుండి వివిధ రూపాల్లో పన్నులు భారీగా వసూలు చేస్తున్న కేంద్ర సర్కారు, ఆ స్థాయి సేవలందించడంలో మాత్రం విఫలమవుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణలో చేయాల్సిన అభివృద్ధి చేయకుండా... ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్‌పై ఎలా ఆశలు పెట్టుకుంటారనేది ఆ పార్టీ అదిష్టానానికే తెలియాలి!
- చిలగాని జనార్థన్
8121938106