Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీస్తా, జుబేర్, శ్రీకుమార్‌లను విడుదల చేయాలి
ఉదయ్‌పూర్‌లో దర్జీ దారుణ హత్యను సర్వత్రా ఖండించడం జరిగింది. ఈ హత్యతో ప్రమేయమున్న వారిని అధికారులు వెంటాడి అరెస్టు చేశారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలి. దేశంలో ద్వేషం, హింస, ఘర్షణలు పెచ్చరిల్లే వాతావరణం పెరిగిపోతోంది, ఇది మన సమాజాన్ని అమానవీయంగా మారు స్తున్నది. పెరిగిపోతున్న ఈ ద్వేషానికి ముగింపు పలకాలి. ఈ కేసుపై దర్యాప్తును చేపట్టాల్సిందిగా ఎన్ఐఎను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం విద్వేష, హింసాగ్నులు చల్లారకుండా అలాగే కొనసాగిం చేందుకు దారితీయరాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా తప్పుడు, అబద్ధపు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విషపూరిత మైన ద్వేషం, హింస మరింత పెరిగిపోవడానికి దారి తీస్తుంది. ఇటువంటి తప్పుడు వార్తలను ఎండగట్టి, వాస్తవాలను ప్రజల ముందుంచితే మత విద్వేషాలు తగ్గడానికి దోహదపడుతుంది. ఆల్ట్ న్యూస్ పోర్టల్ ఈ దిశగా సమర్ధవంతమైన, ప్రయోజనకరమైన సేవలందించింది. దీనిని సహించలేని ప్రభుత్వం ఆ పోర్టల్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్‌ను 2018లో చేసిన ట్వీట్‌కు గానూ ఐపిసిలోని 153ఎ సెక్షన్ కింద (వివిధ గ్రూపుల మధ్య శతృత్వాన్ని పెంచి పోషించడం) అరెస్టు చేయడం విషాదకరం. అబద్ధపు సమాచారాన్ని ప్రచారంలో పెట్టే నకిలీ వార్తల యంత్రాన్ని బయటపెట్టేందుకు ఎవరు యత్నించినా ప్రభుత్వం అభద్రతతో బెదిరింపు లకు దిగుతోంది. ఈ అరెస్టుకు ఎలాంటి ప్రాతిపదిక లేదు, జుబేర్‌ను తక్షణమే విడుదల చేయాలి.
జుబేర్‌ను అరెస్టు చేసిన రోజునే ప్రధాని మోడీ జి-7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. భావ ప్రకటనా స్వేచ్ఛను, ఆన్లైన్, ఆఫ్‌లైన్ వేదికగా అభిప్రాయాల వెల్లడిని పరిరక్షిస్తామని, స్వేచ్ఛా, స్వతంత్ర మీడియాకు హామీ కల్పిస్తామని తీర్మానిస్తూ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు. ఇది మోడీ ప్రభుత్వ కపట వైఖరికి నిదర్శనం. దీనిని ఎంత మాత్రమూ అనుమతించరాదు. తీస్తా సెత్వలాద్, శ్రీకుమార్, సంజీవ్ భట్ (మరో కేసులో ఇప్పటికే జైల్లో ఉన్నారు)లను అరెస్టు చేసిన తర్వాత జుబేర్ అరెస్టు జరిగింది. 2002 గుజరాత్ నరమేథం లోని బాధితులకు న్యాయం జరిగేలా చూడడం కోసం తీస్తా అవిశ్రాంత ంగా పోరాడుతున్నారు. పట్టుదలతో పోరాడడం వల్ల 68 కేసుల్లో 120 మంది దోషులకు శిక్ష పడింది. భారత్‌లోని ఏ మతోన్మాద ఘటనలోనూ ఇంతమంది దోషులుగా పట్టుబడిన దాఖలాలు లేవు. నిజానికి ఈ ఘనత ఆమెదే.
తీస్తా అరెస్టు, ప్రజలకు రాజ్యాంగపరంగా హామీ కల్పించబడిన ప్రజాస్వామ్య హక్కులపై దారుణమైన దాడి. ప్రమాదకరమైన రీతిలో మతోన్మాద హింస చోటు చేసుకోవడం లోని ప్రభుత్వ పాత్రను ప్రజలు ప్రశ్నించే సాహసం చేయరాదని ఈ అరెస్టు స్పష్టమైన సంకేతాలు పంపుతోంది. ఇక్కడ తీస్తాను అరెస్టు చేయడానికి గుజరాత్ పోలీసులకు వెసులుబాటు కల్పించింది దేశ అత్యున్నత న్యాయస్థానం కావడం విచారకరం. గుజరాత్ నరమేధంలో దారుణంగా హత్యకు గురైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి తరపున తీస్తా చేపట్టిన కేసును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోడీ పాత్రను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేయడంలో ఎలాంటి తప్పు లేదని కోర్టు పేర్కొంది. మోడీని నిర్దోషిగా పేర్కొన్న ఆ తీర్పు, ''రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వంతో వ్యవహరించినా లేదా విఫలమైనా అది, కుట్ర పన్నడానికి ప్రాతిపదిక కాదు'' అని వ్యాఖ్యా నించింది. అంతకన్నా అధ్వాన్నమేమంటే, న్యాయం కోరిన పిటిషనర్నే నిందితురాలిగా మారుస్తూ, ''నీచపుటెత్తుగడలతో వ్యవహరించే వారు ఈ పరిస్థితులను ఇలాగే కొనసాగించాలని చూస్తారు'' అని వ్యాఖ్యానించింది. పైగా, ఇటువంటి క్రమాన్ని దుర్వినియోగం చేయడంలో ప్రమేయమున్న వారందరినీ అరెస్టు చేసి చట్ట ప్రకారం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆ తీర్పు పేర్కొంది. కోర్టే ఏర్పాటు చేసినప్పటికీ సిట్ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడం న్యాయ క్రమాన్ని దుర్వినియోగం చేయడమని ఎలా అంటారు? ఇకపై సిట్ నివేదికలు జ్యుడీషియల్ అప్పీల్ పరిధికి వెలుపల వుంటాయా? గుజరాత్ సిట్ ఇచ్చిన ఈ క్లీన్ చిట్ 2002 మేలో మానవ హక్కుల కమిషన్ పేర్కొన్న దాంతో విభేదిస్తోంది. 2004 ఏప్రిల్‌లో బెస్ట్ బేకరీ కేసులో సుప్రీం కోర్టు, నరోదా పాటియాపై గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులతో కూడా ఇది విభేదిస్తోంది. మోడీని సిట్ ఇంటరాగేట్ చేసిన తీరు సరిగా లేదని ఇదే కోర్టు గతంలో తెలిపింది.
''దర్యాప్తు క్రమం నిజాయితీ, సమగ్రతపై, దర్యాప్తులు నిర్వహించే వారి సమర్ధతపై స్థూలంగానే విశ్వాసం లోపించింది'' అని ఎన్హెచ్ఆర్సి వ్యాఖ్యానించింది. ''అందువల్ల నేరాలను దర్యాప్తు చేసే, ప్రాసిక్యూట్ చేసే ప్రయత్నాలు అత్యంత నైపుణ్యంతో, కృత నిశ్చయంతో జరగకపోతే... తీవ్రమైన రాజకీయ, ఇతర ప్రభావాలకు దూరంగా అత్యున్నత సమగ్రతతో పని చేయకపోతే... పెద్దయెత్తున ప్రమాదం ముంచుకొస్తుందని, న్యాయం సరిగా అందకుండా పోతుందని'' కమిషన్ హెచ్చరించింది.
2004 నాటి తీర్పులో సుప్రీం కోర్టు మరింత దారుణంగా వ్యాఖ్యానించింది. ''కేసు రికార్డులను ఏ ఒక్కరైనా కూలంకషంగా పరిశీలించినట్లైతే, న్యాయం అందే వ్యవస్థను దుర్వినియోగ పరిచేందుకు, కుయుక్తులతో దెబ్బ తీసేందుకు అనుమతిస్తున్నారనే భావన ఎవరికైనా కలుగుతుంది.'' ''బెస్ట్ బేకరీ దగ్ధమవుతున్నపుడు, అమాయకులైన పిల్లలు, నిస్సహాయులైన మహిళలు తగలబడిపోతున్నపుడు 'ఆధునిక నీరో'లు చూస్తూ కూర్చున్నారు. బహుశా ఈ నేరానికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని ఎలా కాపాడాలా లేక రక్షించాలా అనేది వారు ఆలోచిస్తూ ఉండవచ్చు.'' నరోదా పాటియా కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే, నేరుగానే సిట్ దర్యాప్తును ప్రశ్నించింది. ''ఏది ఏమైనా, పోలీసులు, సిట్ దర్యాప్తు నిర్వహించిన తీరు సరిగా లేదు. అలాగే ప్రాసిక్యూషన్ జరిగిన తీరు కూడా సరిగా లేదు. ఇందుకు సంబంధించిన వారి ఉద్దేశాల గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడింది.''
గుల్బర్గా సొసైటీపై సాయుధ ముఠాల దాడి జరుగుతోందనే సమాచారం తనకు అందలేదని మోడీ సిట్ ముందు చెప్పారు. ఆ రాత్రి నిర్వహించిన శాంతి భద్రతల సమీక్షా సమావేశంలోనే తనకు విషయం తెలిసిందని చెప్పారు. ఈ దాడిలోనే కాంగ్రెస్ నేత ఇషాన్ జాఫ్రి హత్యకు గురైంది. కాగా సాయం కోసం జాఫ్రి, ముఖ్యమంత్రికి ఫోన్ చేశారని, కానీ, మోడీ ఆయన మాట వినలేదని సిట్ ముందు సాక్షులు తెలిపారు. వాస్తవానికి, మోడీ, జాఫ్రిని దూషించారు. అయినా సిట్ ఈ విషయంలో ఈ సాక్ష్యాధారాల ఆధారంగా మోడీతో ఘర్షణ పడరాదని భావించింది.
ప్రస్తుత వెకేషన్ బెంచ్ ఇచ్చిన తీర్పు గతంలో ఇచ్చిన జ్యుడీషియల్ తీర్పులన్నింటినీ తిరస్కరించింది. తద్వారా న్యాయాన్ని దారుణంగా తిరస్కరించింది. తీస్తా, శ్రీకుమార్ లను తక్షణమే విడుదల చేయాలి. రాజ్యాంగం ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థల, అధికారుల పవిత్రతను పరిరక్షించాలి. బలోపేతం చేయాలి. న్యాయాన్ని అందించే క్రమంలో ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు ఉండరాదు.
- పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం