Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుప్రీం కోర్టు నిజంగానే తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ తీర్పు ఇచ్చిందా? లేక అరెస్టు చేయాలని సూచించిందా? ఈ రెండు ప్రశ్నలకీ మీ సమాధానం ఏదైనా కావచ్చు... కానీ దాని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉండనున్నాయి. ఒక వేళ ఈ ప్రశ్నకు అవును అన్నదే మీ సమాధానం అయితే స్వయంగా ఎవరిని అరెస్టు చేయాలి, ఎందుకు అరెసస్టు చేయాలని నిర్ణయించే అధికారాన్ని సుప్రీంకోర్టే తన చేతుల్లోకి తీసుకోవటం కాదా? ఈ పని సుప్రీం కోర్టు పరిధిలోది కాదన్నది నిస్సందేహం. కేవలం కోర్టు ధిక్కారానికి సంబంధించిన కేసుల్లోనే ధిక్కారానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించవచ్చు. అది కూడా ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి వాదన విన్న తర్వాతనే అరెస్టుకు ఆదేశాలిస్తుంది. జకియా జాఫ్రి ఫిర్యాదు విషయంలో తీస్తా సెతల్వాడ్ పాత్ర ఎలా ఉన్నా, ఆమెను అరెస్టు చేయాలన్నది మాత్రం సుప్రీం కోర్టు ఉద్దేశం కాదని నాకనిపిస్తోంది. ఒకవేళ ఆమెను అరెస్టు చేయాలన్నది సుప్రీం కోర్టు ఉద్దేశ్యమో సూచనో కాదు అన్న నా అభిప్రాయం తప్పైతే ఇక ఆమెను ఆ భగవంతుడే కాపాడాలి.
ఒక వేళ నా అభిప్రాయం సరైనదే అయితే తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేయాలన్నది మా ఉద్దేశ్యమో లేక సూచనో కాదని తక్షణమే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వివరణ జారీ చేయగలరా? అంతేకాదు. గౌరవ న్యాయమూర్తులు బేషరతుగా తీస్తాను విడుదల చేయాలని కూడా ఆదేశించాలి. ఆమె అరెస్టుకు, ఖైదులో ఉంచటానికి కారణమైన ఎఫ్ఐఆర్ను తక్షణమే రద్దు చేయాలి. ఒకవేళ న్యాయమూర్తులు మౌనవ్రతం దాలిస్తే ఆమెను భగవంతుడే కాపాడాలన్న నా వ్యాఖ్య తప్పు కాబోదు.
ఒకవేళ నా ప్రశ్నకు 'కాదు' అన్నదే మీ సమాధానం అయితే మీ తీర్పు అనంతరం గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక బందం ఆఘమేఘాల మీద ఆమెను అరెస్టు చేయటం పట్ల మీరు కానీ, మీ మార్గదర్శకత్వంలో మరొకరు కానీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అహ్మదాబాద్‌లోని డిటెక్షన్ ఆఫ్ క్రైం బ్రాంచిలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ దర్శన్సిన్మ్ బారాద్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ఆధారం చేసుకుని ''యాంటీ టెర్రరిజం స్క్వాడ్'' రంగంలోకి దిగిందన్నది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
ఎఫ్ఐఆర్కు ప్రాతిపదిక ఏమిటి?
ప్రాథమిక దర్యాప్తు నివేదిక దాఖలు చేయటానికి ఆధారమైన సమాచారం ఏమిటి? ప్రధానంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని పేరాగ్రాఫులను ఉటంకిస్తూ, ఆయా పేరాలపై ఆధారపడే ఈ ప్రాథమిక దర్యాప్తు నివేదిక దాఖలు అయ్యిందని అందుబాటులో ఉన్న సమాచారం, వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. సుప్రీం కోర్టు చేసిన కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు కూడా ఈ ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
తీస్తా చేసిన నేరం ఏమిటి? దీనికి సంబంధించి కూడా వార్తా కథనాల సమాచారమే నాకు ఆధారం. నిర్దోషులను ముద్దాయిలుగా మార్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిం దన్నది ఆమెపై ఉన్న ఆరోపణ. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు నిర్దోషులుగా భావించబడుతున్న వారిని కేసుల్లో ఖైదు చేయటం, మరికొన్ని సందర్భాల్లో తప్పుడు ఎన్కౌంటర్లలో చంపేయటం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి ఘోరాలతో పోల్చినప్పుడు (తీస్తా నిజంగానే ఆ పని చేసిందని అనుకున్నా) అందులో పెద్దగా గొంతు చించు కోవాల్సిందేముంది?
ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ప్రస్తావించిన భారత నేర శిక్షాస్మృతి సెక్షన్లు ప్రధానంగా ఫోర్జరీ, పోర్జరీ చేసిన పత్రాన్ని వాస్తవమైనదిగా చూపించటం, తప్పుడు సాక్ష్యం ఇవ్వటం, ప్రత్యేకించి కొందరికి సాధ్యమైనంత పెద్ద శిక్షలు పడేలా తప్పుడు సాక్ష్యాలు ఇవ్వటం, నేరపూరితమైన కుట్రతో సహా మరికొన్ని అటువంటి నేరాలకు సంబంధించినవే. అయితే ఇందులో ఏ ఒక్కటీ ఉగ్రవాద చర్య కాదు. మరి అలాంటప్పుడు ఉగ్రవాద వ్యతిరేక బృందాల ద్వారా ఆమెను ఎందుకు అరెస్టు చేయించాల్సి వచ్చింది? నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మీకు నూటికి నూరు మార్కులు. ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం ఆమెను అరెస్టు చేసి 14 రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఆదేశించటానికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చాలన్నమాట. సాధారణంగానే 14 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలన్నది ఆసాధారణమైన కోరిక. ప్రత్యేకించి ఈ కేసులో అటువంటి కోరిక మరింత ఆసాధారణమైనది.
ఈ పరిణామాలు మనకేమి చెపుతున్నాయి? అరెస్టుకు ప్రేరేపించిన సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, పరిశీలన లేదా విమర్శ ఏమిటి? ఆశ్చర్యకరమైనదేమిటంటే సుప్రీం కోర్టు తీర్పులో నేరుగా అటువంటి ప్రస్తావనలు లేవు. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం తరఫున వాదించిన న్యాయవాదులు, గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాదులు అటువంటి వ్యాఖ్యలు, అన్యాపదేశపు కోరికలను వెల్లడిరచారు.
సుప్రీం కోర్టు తీర్పు
సుప్రీం కోర్టు తీర్పు ఆరు భాగాలుగా ఉంది. మొదటి భాగం పరిచయం లాంటిది. ఈ భాగంలో పిటిషన్ దాఖలు చేయటానికి జరిగిన ఆలస్యాన్ని మన్నించమని కోరటానికి సంబంధించిన సుప్రీం కోర్టు స్పందన. ''కక్షిదారులు (ప్రత్యేక దర్యాప్తు బందం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం) పిటిషన్‌లోని సానుకూల అంశాలపై ఆధారపడి పిటిషన్‌ను విచారణకు చేపట్టరాదనీ, పిటిషన్ దాఖలు చేయటంలో జరిగిన ఆలస్యాన్ని అర్థవంతంగా వివరించే కారణాలేవీ పిటిషన్లో పేర్కొనలేదనీ, అందువలన ఈ పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాల''నీ సుప్రీం కోర్టు తెలిపింది. ఈ అభ్యంతరాలు పక్కన పెట్టి మెరిట్స్ ఆధారంగానే విచారణకు చేపట్టినట్లు సుప్రీం కోర్టు తెలిపింది. అదేసమయంలో తీస్తా సెతల్వాడ్‌ను ఫిర్యాదుదారుగా చేర్చటం పట్ల కక్షిదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2013లో అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన ప్రొటెస్టు పిటిషన్ కేవలం జాకియా జాఫ్రీ మాత్రమే దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తీస్తా సంతకం చేయలేదు. ఈ పిటిషన్‌ను డిశంబరు 26, 2013న మేజిస్ట్రేట్ డిస్మిస్ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టులో ఈ ప్రొటెస్ట్ పిటిషన్‌ను డిస్మిస్ చేయటాన్ని సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసినప్పుడు జకియా జాఫ్రీతో పాటు తీస్తా కూడా పిటిషన్‌పై సంతకం చేసింది. (అప్పటి వరకూ జకియాకు తీస్తా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది). అక్టోబరు 2017లో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ పిటిషన్ దాఖలు చేయటానికి తీస్తాకు అర్హత లేదనీ అందువలన మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును ఖరారు చేస్తున్నామని ప్రకటించింది. ఆ మాటకొస్తే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కూడా సంతకం చేసే అధికారం తీస్తాకు లేదు, అన్నది ఇది వారి అభ్యంతరం. ''ఈ విషయమై ప్రస్తుత విచారణలో ఫిర్యాదుదారుగా ఉండే హక్కు తీస్తాకు ఉందా లేదా అన్న అంశంపై మేము చర్చను మళ్లించదల్చుకోలేదు. ఈ వెలుగులో పిటిషన్‌లోని బలాబలాల ఆధారంగా పిటిషన్‌దారు అయిన జకియా జాఫ్రీ కోరిక మేరకు ఈ ఫిర్యాదు విచారణకు చేపడుతున్నాము.'' అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ప్రత్యేక దర్యాప్తు బృందం, గుజరాత్ ప్రభుత్వం లేవనెత్తిన తొలి రెండు అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. గౌరవ న్యాయమూర్తులు ఫిర్యాదులోని అంశాల బలాబలాలపై ఆధారపడి విచారణ చేపట్టారే తప్ప, ఈ విచారణలో తీస్తాను కక్షిదారుగా గుర్తించలేదు. మొత్తం తీర్పులో పదేపదే ఫిర్యాదుదారు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు జకియా జాఫ్రి గురించే ప్రస్తావించారు. తీస్తా పేరును పూర్తిగా పక్కకు నెట్టేశారు.
అసలు పిటిషన్లో తీస్తా భాగస్వామే కానప్పుడు ఆమె గురించి కక్షిదారులు చేసిన వాదనలను సుప్రీం కోర్టు పరిగణిస్తుందా? తీస్తాకు వ్యతిరేకంగా ఆమె కక్షిదారు కాని కేసులో వాదనలు వినిపించిన ప్రత్యేక దర్యాప్తు బృందం, గుజరాత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైనదేనా? అటువంటి పరిస్థితుల్లో ఆయా కక్షిదారుల తరఫున న్యాయవాదులను వారించటమో లేక తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకునేందుకు తీస్తాకు అవకాశం ఇవ్వటమో సుప్రీం కోర్టు చేసి ఉండాల్సింది కదా?
ప్రత్యేక దర్యాప్తు బృందం వాదనలు
తన వాదనలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం జకియా జాఫ్రీ ఫిర్యాదు నుండి 30 ఆరోపణలు, అమికస్ క్యురి వ్యాఖ్యలు లేదా పరిశీలనల నుండి మరో రెండు ఆరోపణలు జోడిరచి వాదించింది. ఇందులో ఒకే ఒక్క సారి మాత్రమే తీస్తా ప్రస్తావన వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం తీస్తాపై మోపిన ఆరోపణల సారాంశం ఏమిటంటే జకియా జాఫ్రి తీస్తా ప్రభావంలో ఉండి ఆమె చెప్పినట్టు ''నిరంతరం వెంటబడటం, వాంగ్మూలం ఇవ్వటం, పట్టు బట్టి ఫిర్యాదులు చేయటం చేసింది'' అని. సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరికి ఒకటికన్నా ఎక్కువసార్లు తీస్తా సహాయం చేసిందని చెప్పటం ప్రత్యేక దర్యాప్తు బందం నివేదనలో మరో ఆసక్తికరమైన అంశం. గౌరవ అమికస్ క్యూరికి తీస్తా మీద ఎటుటవంటి అభ్యంతరాలు, ఆరోపణలు లేవు. నిజానికి తీస్తా మీద పూర్తి స్థాయిలో ధ్వజమెత్తింది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. సారాంశంగా చూస్తే జకియా జాఫ్రి లేవనెత్తిన విషయాలు నిరాధారాలు. నిరూపించలేనివి. తీస్తా కోరిక మేరకు జకియా ఈ కేసులు పట్టుబట్టి నడిపిస్తోంది. ''ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్న కారణం ఒక్కటే. సమస్యను రగులుస్తూ ఉండటమే. ఇదే విషయాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం తరఫు న్యాయవాది కూడా ప్రస్తావించారు'' అన్నది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ వాదన.
నివేదనల మధింపు
తీర్పులో ఐదో భాగం వివిధ పక్షాలు చేసిన వాదనల మధింపు, ముగింపు. ఇదంతా 10 నుండి 92 పేరాల్లో ఉంది (171 నుండి 307 పేజీలు). దాదాపు 130 పేజీల్లో తీస్తా గురించిన ప్రస్తావన కేవలం రెండు సార్లే వచ్చింది. తీస్తాను అసలు ఫిర్యాదుదారుగానే సుప్రీం కోర్టు గుర్తించలేదు కాబట్టి తుది తీర్పులో ఆమె పేరు ప్రస్తావన లేకపోవటం పెద్ద ఆశ్చర్యం కలిగించే అంశమేమీ కాదు. కేసులో కక్షిదారు కాని వారి గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయటం మర్యాద కాదన్న సాంప్రదాయం పట్ల సుప్రీం కోర్టు అప్రమత్తంగానే ఉంది. అయితే కొన్ని ప్రస్తావనలు గమనించినప్పుడు అవి తీస్తా గురించి చేసిన వ్యాఖ్యలే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు ''ఫిర్యాదుదారు (జకియా) తన ఫిర్యాదులో కొద్దిమంది ముద్దాయిల పేర్లు ప్రస్తావించినా ఈ జాబితా పూర్తి జాబితా కాదనీ, ఇంకా చేర్చాల్సిన పేర్లు చాలా ఉన్నాయని చెప్పేందుకు సాహసించింది. ఈ నిరసన పిటిషన్లో (514 పేజీల నిడివిగల) అనేక కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా పరోక్షంగా సవాలు చేస్తున్నారు ఫిర్యాదుదారు. దానికి గల కారణాలు ఏమిటన్నది వారే వెల్లడిరచాలి. ఆమె ( ఫిర్యాదుదారు) మరెవరి ప్రోద్భలంతోనో ఈ పని చేసిందన్నది వాస్తవం. నిజానికి ఈ నిరసన పిటిషన్‌లోని గణనీయమైన అంశాలు వేర్వేరు వ్యక్తులు దాఖలు చేసిన అఫిడవిట్లలో ఉన్నాయి. ఇవన్నీ సత్య దూరమైనవని న్యాయస్థానాలు భావించాయి.'' ఇక్కడ ఆ మరెవరో అన్న ప్రస్తావన తీస్తా గురించే అని మనం నిశ్చింతగా నిర్ధారణకు రావచ్చు.
ఒకవేళ తీస్తాకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శ, వ్యాఖ్యలు లేదా మందలింపు చేయాలని సుప్రీం కోర్టు భావిస్తే నేరుగానే ఆ పని చేయవచ్చు కదా! ఇటువంటి అనుచిత పరోక్ష వ్యాఖ్యలు దేనికి? తీస్తా కూడా అప్పీలు దాఖలు చేసినందున ఆమె వాదన కూడా విని ఉండాల్సింది కదా! అలా కాకుండా పూర్తిగా ఆమె ఫిర్యాదును నిర్లక్ష్యం చేసి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎందుకు? బహుశా తీస్తా పట్ల అసమంజసంగా వ్యవహరించకూడదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు భావించి ఉండొచ్చు. కానీ ఇటువంటి నివారించగలిగిన అనుచిత వ్యాఖ్యల ద్వారా సుప్రీం కోర్టు ఆమె పట్ల అన్యాయంగానే వ్యవహరించింది. రాష్ట్ర పోలీసులు వచ్చి ముంబయిలో ఉన్న తీస్తాను అరెస్టు చేసి ఖైదు చేయటం దాని పర్యవవసానమే.
(జస్టిస్ మదన్ బి లోకుర్ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి. ''ది వైర్''లో రాసిన వ్యాసానికి సంక్షిప్త అనువాదం).
- అనువాదం: కొండూరి వీరయ్య