Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాకలుతీరిన కమ్యూనిస్టు యోధులు, సీపీఐ(ఎం) ఆవిర్భావనాయకులు, పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతిబసు 108వ జయంతి నేడు. ఆయనకు దేశమంతా ఘన నివాళులు అర్పిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతిబసు ఆధ్వర్యంలో సాగించిన లెఫ్ట్ ఫ్రంట్ పాలన ఆ రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చివేసింది. కరువు రాష్ట్రంగా కునారిల్లిన పశ్చిమ బెంగాల్‌ను అన్నపూర్ణగా మార్చింది. అణగారిన వర్గాలకు 25లక్షల ఎకరాలను పంచి(భూసంస్కరణలు చేపట్టి) దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచింది. కష్టజీవులకు, కార్మిక వర్గానికి అండదండలు ఇచ్చింది. అంతర్జాతీయ సౌహార్థతకు దిక్సూచిగా నిలిచింది.
జ్యోతిబసు ఆధ్వర్యంలోని లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం ఎల్ఐసీ సంస్థ పరిరక్షణకు పూర్తి బాసటగా నిలిచింది. అఖిల భారత బీమా ఉద్యోగుల పోరాటాలకు (ఎఐఐఇఎ) అండదండలు ఇవ్వడం వల్ల, బీమా ఉద్యోగుల అనేక పోరాటాలు విజయవంతం అయ్యాయి. ''ఇలాకో విజిల్'' పేరుతో ఆటోమేషన్ (కంప్యూటరీకరణ)కి వ్యతిరేకంగా ఎఐఐఇఎ జరిపిన పోరాటంలో జ్యోతిబసు, లెఫ్ట్ ఫ్రంట్ శ్రేణులు నిర్వర్తించిన మహత్తరమైన పాత్రను ఎల్ఐసీ ఉద్యోగులు ఎవరూ మర్చిపోలేరు.
ఎల్ఐసీ ఆఫీసుల్లో క్లరికల్ పనిలో ఎలక్ట్రానిక్ కంప్యూటర్లను ప్రవేశపెట్టడాన్ని ఎఐఐఇఎ నిర్ద్వందంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం, ఎల్ఐసీ యాజమాన్యం కంప్యూట రీకరణ వలన ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు కలగదని చెబుతూ, న్యాయపరంగా అమలు చేయగలిగిన ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. కేవలం ఉద్యోగ భద్రతే కాదు, భవిష్యత్ ఉపాధి రక్షణ కూడా తమ బాధ్యతే అని ''ఎఐఐఇఎ'' ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. కలకత్తాలో ఇలాఖో భవనంలో కంప్యూటర్ ప్రవేశాన్ని భౌతికంగా కూడా అడ్డుకోవాలని పిలుపు నిచ్చింది. దీనినే ఇలాఖో విజిల్ పోరాటంగా పిలుస్తారు. అంతకు ముందు 1966 అక్టోబర్‌లో కలకత్తాలో అమెరికన్ కాల్ టెక్క్స్ కంపెనీలో కంప్యూటరీకరణ కారణంగా దేవీ పూజా సెలవుల నుండి వచ్చిన ఉద్యోగుల, ఉద్యోగాలు పోయిన ఘోర ఘట్టం, ఉద్యోగులందరినీ ఆలోచించేలా చేసింది. ఉద్యోగ భద్రతపై ఉద్యోగులలో భయకంపనలు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బీమా ఉద్యోగులతో భుజం భుజం కలిపి ఈ ఉద్యమాన్ని మరింత పదునెక్కించాయి. 1968 దసరా సెలవుల్లో కంప్యూటర్ను ఇలాకో భవనంలో పెట్టాలని ప్రయత్నాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. దీనితో పెద్దఎత్తున ఇలాకో విజిల్ కొనసాగింపు జరిగింది. ఇలాకో భవనం దగ్గర కాళీ మాత విగ్రహం పెట్టి దసరా పండగ నిర్వహించారు. జ్యోతిబసు, ఇతర కమ్యూనిస్టు యోధులు, ఇతర రాజకీయ నాయకులు, జాతిన్ చక్రవర్తి, జ్యోతిర్మయి బసుతో బాటు అనేక మంది ఈ విజిల్లో పాల్గొన్నారు. 24 పరగణా జిల్లాలోని గిరిజనులు (వీరికి గతంలో కరువు సందర్భంగా అంబలి ఇచ్చి ఎఐఐఇఎ యూనిట్లు వారిని ఆదుకున్నాయి) తమ విల్లంబులతో వచ్చి ఈ విజిల్లో పాల్గొన్నారు. 24 గంటలూ, 365 రోజుల పాటు ఈ ఉద్యమం కొనసాగింది.
ఈ ఉద్యమంతో ప్రభుత్వ అంచనాలు తలక్రిందులయ్యి. రాష్ట్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. అప్పటి హౌం మంత్రి జ్యోతిబసు ఇలాఖో భవనంలో కంప్యూటర్ పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం అన్నారు. చివరకు ఫోర్ట్ విలియమ్స్‌లో మిలిటరీ రక్షణలో ఉన్న కంప్యూటర్ను పశ్చిమ బెంగాల్ నుండి వెనక్కు తరలించారు. ఆ విధంగా ఆ కంప్యూటరీకరణ వ్యతిరేక ఉద్యమం చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ పోరాటం దేశ కార్మిక చరిత్రలోనే ఒక ప్రముఖమైన ఘట్టం. ఇది కేవలం ఉద్యోగ భద్రత కోసం చేసిన పోరాటం కాదు, ఉపాధి రక్షణకు జరిగిన పోరాటం కూడా. దీర్ఘకాలం పాటు చైతన్యవంతంగా సాగిన ఉద్యమమిది. ఆటోమేషన్ వ్యతిరేక ఉద్యమంలో భారత కార్మికవర్గానికి దశను, దిశను నిర్దేశిస్తూ ఎఐఐఇఎ సాగించిన ఈ ఉద్యమంలో జ్యోతిబసు ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, అనేక మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను, మేధావులను ఇందులో భాగస్వాములను చేయడం జరిగింది. చివరకు అంతర్జాతీయ తత్వవేత్త, సాహిత్యవేత్త అయిన బెట్రాండ్ రస్సెల్ కూడా ఎఐఐఇఎ ఎంచుకున్న పంథాను కొనియాడారు.
కంప్యూటర్ పరిజ్ఞానం మన దేశంలో ప్రాధమిక దశలో ఉన్న నేపథ్యంలో బీమా ఉద్యోగులు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కంపెనీలో కంప్యూటరీకరణ విజయవంతంగా చేయగలిగిన ప్రభుత్వం ఎల్ఐసీలో ఓటమి చూడవలసి వచ్చింది. కేవలం ఎల్ఐసీ పరిధిలోనే ఉద్యమాన్ని పరిమితం చేయకుండా కంప్యూటరీకరణ పర్యవసానాలను సైద్ధాంతిక పరమైన, లాజికల్ వాదనలతో దేశంలోని ప్రముఖులను, మేధావులను, ప్రజలను చైతన్య పరిచి, వారిని ఉద్యమంలో భాగస్వాములుగా చేయడం వల్ల ఉద్యమం మరింత పెరిగి, బలమైన శక్తిగా రూపుదిద్దు కుంది.పెట్టుబడిదారీ సమాజంలో కంప్యూటరీకరణ తీరుతెన్నులపై స్పష్టమైన సైద్ధాంతిక చర్చకు ఈ ఉద్యమం ఊతమిచ్చింది
ఒక కంప్యూటర్ వస్తే దాదాపు 24,000 ఉద్యోగాలు ఎలా పోతాయో ఉద్యోగులు అర్థం చేసుకోగలిగారు. వారిని ఈ పోరాటం జాగృతం చేసింది. పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిస్థితులు, కార్మికవర్గ రాజకీయాలు ఈ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చాయి. ఆనాడే కంప్యూటర్లు ఎల్ఐసీలో ప్రవేశించి ఉంటే వేలాది మంది ఉద్యోగాలు పోవడమే గాక, సంస్థలో తర్వాత తరాలకు ఉద్యోగ అవకాశాలే ఉండేవి కావు. అందుకే ఈ మహత్తర పోరాటంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రాధాన్యతను, జ్యోతిబసు చిరస్మరణీయమైన పాత్రను ఎల్ఐసీ ఉద్యోగులు నిరంతరం జ్ఞాపకం ఉంచుకుంటారు
1978లో కలకత్తాలో జరిగిన ఎఐఐఇఎ సిల్వర్ జూబ్లీ సమావేశాలకు జ్యోతిబసు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బీమారంగాన్ని ప్రయివేటు పరం చేయడంతో పాటు, ఎల్ఐసీ, జీఐసీలలో 50శాతం వాటాలు విక్రయించాలన్న మల్హోత్రా కమిటీ (1994) కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా ఆనాడు వామపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. జ్యోతిబసు ఆధ్వర్యంలోని పశ్చిమ బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం, మల్హోత్రా కమిటీ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసింది. అలాగే అప్పటి వామపక్షాల నాయకత్వంలోని కేరళ, త్రిపుర ప్రభుత్వాలు సైతం ఇదే తీర్మానాలు చేసాయి. ప్రభుత్వ బీమా రంగ పరిరక్షణ కోసం ఎల్ఐసీ ఉద్యోగులు చేసిన ప్రతి పోరాటానికి సంపూర్ణ సహకారం అందించి, జ్యోతిబసు మొత్తము కార్మిక వర్గంతో పాటు, ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా ప్రీతి పాత్రులయ్యారు.
ఎల్ఐసీ సంస్థపై, ఉద్యోగులపై, కార్మిక వర్గంపై నిరంతరం దాడులు జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో జ్యోతిబసు జీవితం కార్మిక వర్గానికి, ప్రత్యేకించి బీమా ఉద్యోగులకు ప్రేరణ ఇవ్వాలి. మొక్కవోని దీక్షతో ఎల్ఐసీ సంస్థను, ప్రభుత్వ రంగాన్ని, కార్మిక హక్కులను కాపాడు కోవాలి. దేశ సమ్మిళిత సంస్కృతిని పరిరక్షించు కోవాలి. ఇదే జ్యోతిబసుకు ఇచ్చే నిజమైన నివాళి.
- పి. సతీష్