Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయుధం చేసే శబ్దం కన్నా, అక్షరం పేల్చే శబ్దమే ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించగలదు. నాటికీ, నేటికీ ఏనాటికైనా అభ్యుదయం లేని అక్షరం, కలం పోరు చేయని కవి రాజ్యానికి బానిసలే!
ప్రతి రోజు ప్రతి ఒక్కరి మెదడులో రెండు ఆలోచనలు పోట్లాడుతుంటాయి. ఒకటి పాజిటివ్ థింకింగ్, రెండు నెగటివ్ థింకింగ్. వాటిలో ఏది గెలుస్తుందో మీకు మీరే తేల్చుకోవచ్చు. మీరు దేనికి బలమైన ఊతమిచ్చి బలిష్టంగా ఉంచుకుంటారో అదే గెలుస్తుంది! అయితే, ప్రస్థుతం దేశం నెగటివ్ థింకర్స్తో విచ్చలవిడిగా పేట్రేగిపోతోంది. దానికి విరుగుడు పాజిటివ్ థాట్‌ను - పాజిటివ్ థింకర్స్‌ను బలిష్టంగా తయారు చేసుకోవడమే! మరో మార్గం లేదు. అబద్ధాలతో అధికారంలో కొనసాగాలనుకునే వారి ఆట కట్టించాలను కుంటే అది కేవలం ప్రజలకే సాధ్యం! వివేకవంతులైన ప్రజలే దేశాన్ని ముందుకు తీసుకుపోగలరు.
ప్రపంచ జ్ఞానమంతా భారతీయులదే అని చెప్పుకోకపోతే ఏమిటి నష్టం? అన్నీ మా వేదాల్లో ఉన్నాయని అనకపోతే ఎవరైనా ఏమైనా అంటారా? ఏమీ అనరంటే అనరు - పైగా ప్రపంచ దేశాలలో గౌరవం పెరుగుతుంది. అబద్ధాలతో ఎవరూ గౌరవ మర్యాదలు పొందలేరు. గత వందేండ్లలో భారతీయులు కనిపెట్టిన కొత్త వస్తువులెన్ని? వాటిమీద వచ్చిన పేటెంట్లు ఎన్ని? నోబెల్ సాధించిన భారతీయులెందరు? స్వదేశీ ఫార్ములాలతో తయారైన వస్తువుల్ని మనం నిత్యజీవితంలో ఎన్ని వాడుతున్నాం? ఆ లెక్కలన్నీ తీసిన తర్వాతే నోర్లు విప్పండి. అప్పటిదాకా అవాకులూ చవాకులూ మాట్లాడకుండా నోటికి విశ్రాంతినివ్వండి. సత్యాన్ని ఆవిష్కరించే క్రమంలో దానికి మద్దతు తెలిపేవారికన్నా, వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉంటారు. కారణం ఏమిటంటే మన సంస్కృతుల పునాదులన్నీ సత్యం మీద ఆధారపడి లేవు. స్వర్గం, నరకం, పునర్జన్మ, దేవుడు, దయ్యం వంటి కల్పిత విశ్వాసాల మీద నిర్మించబడ్డాయి కాబట్టి!
నెగటివ్ థింకర్స్ - వాదనలు ఎలా ఉంటాయో చూద్దాం. దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని ఎవరు ప్రారంభించారు? భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడూ? 1956లో - ఆ ప్రారంభానికి పెట్టిన పెట్టుబడి ఎంత? ఐదుకోట్లు! ఇప్పుడు దాని విలువ 31లక్షల కోట్లు! గత సంవత్సరం (2021) ఎల్ఐసీ తన లాభంలో ప్రభుత్వానికి ఇచ్చిన వాటా 2611కోట్లు! మరి ఇంతటి గొప్ప సంస్థని, లాభాలు తెచ్చే సంస్థని అమ్మకానికి పెట్టిందెవరూ? మహారాజశ్రీశ్రీ చౌకీదార్ మోడీ సర్కార్! ఈ విషయాలన్నీ అలా ఉంచి, ఇంతకీ దేశాన్ని నాశనం చేసిందెవరో చెప్పండి! నెహ్రూ! నెహ్రూ!! నెహ్రూ!!! ఇదీ ప్రస్థుత నెగటివ్ థింకర్స్ వాదన! జవహర్లాల్ నెహ్రూ పేరు ఉచ్ఛరించడానికి కూడా అర్హతలేని వారు... ఆయన వల్లే దేశం ఎన్నో అనర్థాలకు గురైందని మాట్లాడుతున్నారు. దేశం నెగటివ్ థింకర్స్ చేతిలో చిక్కి విలవిలాడుతోంది. ఇక్కడ ఒకే ఒక్కడైన సావర్కర్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్థుత ఈ దేశభక్తులకు ఆదర్శపాయుడు ఆయనే కాబట్టి!
బీజేపీ వారికి సావర్కర్ ఎందుకు మహనీయుడయ్యాడు. అంటే ఆయన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం నెంబర్‌వన్ దేశద్రోహిగా ప్రకటించింది కాబట్టి! ఒక బ్రిటిష్ అధికారి హత్యకోసం తన సహచరుడికి తుపాకి ఇచ్చినందుకు లండన్‌లో వినాయక్ సావర్కర్‌ను అరెస్ట్ చేసి, ఇండియాకు తీసుకుని వస్తూ ఉంటే, ఆయన ఫ్రాన్స్ తీరం వద్ద తప్పించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇండియాలో విచారణ తర్వాత జీవిత ఖైదు విధించబడి అండమాన్‌లోని సెల్యులార్ జైలుకు పంపబడ్డాడు (1911). అక్కడ ఒక ఏడాది గడిపేసరికి జవసత్వాలు ఉడిగి, బ్రిటిష్ అధికారులకు క్షమాపత్రం సమర్పించాడు. తన తప్పును ఒప్పుకుంటూ, ఇక ముందు బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటానని, తనను దయతో విడుదల చేస్తే - భారతీయ యువతీయువకుల్ని భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా అడ్డుకుంటాననీ... వారిని తనలాగే బ్రిటిష్ భక్తులుగా మార్చుతాననీ విన్నవించుకున్నాడు. చివరకు రెండేండ్ల తర్వాత విడుదలై పూనె చేరుకున్నాడు. ఐదేండ్లపాటు ఏ రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనకుండా, కేవలం బ్రిటిష్ అధికారికి వార్తలు మోస్తుండేవాడు. 1860-1940 వరకు ఎనభైవేల మంది స్వాతంత్య్ర పోరాట వీరులు అండమాన్ కాలాపాని సెల్యులార్ జైలుకి పంపబడ్డారు. అక్కడ వేలమందిని కాల్చి, ఉరివేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. మరికొందరు అనారోగ్యంతో మరణించారు. కానీ, వీరందరిలో ఒకే ఒక్క 'మహాపురుషుడు' బ్రిటిషు వారి కాళ్ళు మొక్కి, క్షమాపణలు అడుక్కుని, ఆ జైలు నుంచి బయటపడ్డాడు. ఆ ఘనుడే 'వీర్' సావర్కర్! ఆయన అనుచరులే ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నా మనుకుని, అధోగతిపాలు చేస్తున్నవారు. వీరు చేస్తున్న దుష్ప్రచారాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది!
ప్రస్థుత దేశభక్తి పరిపాలకులు చేసే అబద్దపు ప్రచారాలు ఎలా ఉంటున్నాయో ఉదాహరణకు కొన్ని చూద్దాం!... ''ఆక్సీజన్ అనే పదం నిజానికి ఆక్స్ (ఉశ) అనే ఇంగ్లీషు పదం నుండి వచ్చింది. ఉశ +జుచీజు=Aుజుణ అని మనం అంటుంటే - పాశ్చాత్యులు దాన్నే ఉశ్+జుచీ అని ముద్దుగా పిలుస్తున్నారు. అసలైతే వారి కన్నా ముందుగా మనమే ఉశ నుండి ఉశ్+జుచీ వచ్చిందని కనిపెట్టాం!'' అని అన్నాడో కాషా యీయుడు. ఇందుకు విరుద్ధమైన భావజాలం గల యువకులు కొందరు, ప్రధాని మోడి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.. ''అబద్దానికి వయసు ఉండదని ఎవరన్నారూ? చూడండి. ఈ రోజు దానికి 71ఏండ్లు'' అని! పైగా ఆ రోజును 'రాష్ట్రీయ నిరుద్యోగ దినం'గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో పతంజలి ఉత్పత్పుల్ని నిషేధిస్తే, ఈ దేశంలో మాత్రం ప్రస్థుత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. స్వయాన ఆ రామ్‌దేవ్ బాబానే ఏమని ప్రకటించాడో చూడండి.. ''భారత్ మాతాకి జై - అని అనం - అని కొందరు ప్రముఖులు చెపుతున్నారు. ఈ దేశానికి చట్టాలు, రాజ్యాంగం ఉన్నాయని, వాటిమీద గౌరవంతో ఊరుకుంటున్నాం... లేదంటే... ఆ నినాదం చేయని వాళ్ళని ఎవరినీ వదిలిపెట్టే వాళ్ళం కాదు. ఈ పాటికి లక్షల తలలు నరికేసేవాళ్ళం!!'' అని పతంజలి రామ్‌దేవ్ బహిరంగంగానే ప్రకటిస్తే అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నట్టూ? అదే మాట వేరే వాళ్ళంటే ఈ పాటికి వారి మీద ఈడి సోదాలు జరిగేవి. లేదా జైల్లో పెట్టేవారు. కానీ, అలాంటిదేం జరగలేదంటే... అది ప్రభుత్వ పెద్దల 'మన్ కి బాతే..'నేమో?
5 ఏప్రిల్ 2022న జగ్జీవన్‌రామ్ జయంతికి ప్రధాని మోడీ నివాళులు అర్పించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ తిరిగింది. అందులో ఆశ్చర్యమేముంది? అని ఆశ్చర్యపోవద్దు... ఎందుకంటే ఆ ఫొటోలో 24 ఆగస్టు 2019న మరణించిన మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఉన్నారు. అందుకే జనం 'ఇంత ఫేకా?' అని హాశ్చర్యపోయారు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మైనర్ బాలకులు పాకిస్థానీ పాటలు విన్నందుకు అరెస్టు చేశారు. దేశ ప్రధాని మాత్రం పాకిస్థాన్ వెళ్ళి అక్కడ బిర్యానీ తినిరావచ్చు. అది యాంటీ నేషనల్ కాదు. అది కూడా దేశభక్తే! ఏడు కోట్ల జనాభా గల ఫ్రాన్స్ - రాఫెల్ లాంటి యుద్ధ విమానాల్ని తయారుచేసి, ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటూ ఉంటే-నూటా ముప్పయి అయిదు కోట్ల జనాభా గల మన దేశంలో మాత్రం, నేటికీ మసీదుల పునాదుల కింద మట్టిలో దూరి, అందులో శివలింగాలు, విగ్రహాలు ఉన్నాయోమోనని తవ్వకాలు ప్రారంభించారు. వారెవా! న్యూ ఇండియా అంటే ఇదేనన్న మాట?
హిందువుల జీవన విధానంలో ''ఆహారమే ఔషధం!'' అని పెరుగు గురించి విరివిగా ప్రచారం జరుగుతూ ఉంది. ఒక అభిమాని పంపిన పోస్టర్లో విషయం ఇలా ఉంది... ''మెదడులో ట్రిప్టోఫాన్ అనే రసాయనాన్ని విడుదల చేయగల ఏకైక ఆహారం భారతీయుల పెరుగన్నం! ట్రిప్టోఫాన్ - అనే పదం సంస్కృత పదం 'తృప్తి' నుండి వచ్చింది. పాశ్చాత్యులు పెరుగులో చక్కెర కలిపి 'యోగర్ట్'గా తీసుకుంటారు. ఇది నాడీ కార్యకలాపాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. హైపర్ ఏక్టివిటీని ప్రేరేపిస్తుంది'' - అని ఉన్న పోస్టర్‌పైన ఆరెస్సెస్ జెండా, కింద జైశ్రీరాం నినాదం, ధర్మధ్వజం - శీర్షికతో వచ్చిదంటే, అది అబద్దాల ప్రచార కేంద్రం నుండి వచ్చిందని అర్థమవుతూ ఉంది కదా? సరే, ఏదో ఒక విషయం వండి వార్చారుగానీ, ఆ అర్థజ్ఞాన ప్రవీణులకు అర్థంకాని విషయాలు అందులో ఇంకా ఉన్నాయి. పెరుగు, చక్కెరలు కలిపి తీసుకుంటే మానసిక ఆరోగ్యానికి మంచిదని మన ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. ఆయుర్వేదం మన దేశానిది. ఆ వైద్య విధానం ఏం చెపుతుందో కూడా తెలుసుకోవాలి కదా? చాలామంది ఉదయాన్నే పెరుగు పంచదార కలిపితింటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా వేసవిలో అల్పాహారంలో పెరుగు పంచదార తీసుకుంటే కడుపులో ఎసిడిటి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. పైగా ఒత్తిడిని అలసటను తగ్గిస్తుంది. ఈ మిశ్రమం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావు. గుండె సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. ట్రిప్టొఫాన్ అనేది ఒక అమైనో ఆసిడ్. అది పసిపిల్లల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. ట్రిప్టోఫాన్ పాలు, పెరుగులతో చేసిన ఉత్పత్తులలో, అరటిపండు, చీజ్, చికెన్‌లలో, గుడ్డు తెల్లసొనలో, నట్స్, సీడ్స్‌లలో కూడా ఉంటుంది. యోగర్ట్ విలువ తగ్గించి, పెరుగన్నం గూర్చి గొప్పగా చెప్పుకోవడం బుద్ధితక్కువ పని! ట్రిప్టోఫాన్‌కు 'తృప్తి' అనే పదానికి సంబంధం లేదు. హిందువుల జీవన విధానానికి పెరుగన్నానికి మాత్రమే సంబంధమా? ఇతర మతస్థులు ఎవరూ పెరుగు తినడం లేదా? తలతిక్క అన్వయింపులు మానుకోవడం మంచిది. ఆహారానికి మతానికి సంబంధం లేదు. అది గ్రహించుకోవాలి!
ఒక మనిషి చనిపోయినప్పుడు అది అందరికీ తెలుస్తుంది. కానీ, ఆ చనిపోయిన వ్యక్తికే తెలియదు. ఒక మనిషి మూర్ఖత్వంలో ఉన్నప్పుడు కూడా జరిగేది అదే - అతని మూర్ఖత్వం అందరికీ తెలుస్తుంది. అతనికి తప్ప - ఇతర దేశాలవారిలో, ఇతర జాతుల వారిలో ఇతర మతాల వారిలో మంచిని చూడకపోవడం ఒక లోపమే. అందుకే థామస్ అల్వా ఎడిసన్ అంటాడు... ''ఇతరులలో మంచిని చూడకపోవడం... మనలో మంచి లేకపోవడాన్ని సూచిస్తుంది!'' - అని! అదే మరి! మంచిని చూడలేక పోవడమనే నెగటివ్ థింకింగ్!!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.