Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జూన్ 28, 29 తేదీలలతో జరిగిన 47వ జీఎస్టీ (పన్నుల విధింపు) సమావేశంలో పాలు, పాల ఉత్పత్తులపై భారాలు మోపారు. ఇంత వరకు పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు. వాటిపై 5శాతం నుండి 12శాతానికి జీఎస్టీ పన్ను పెంచుతూ నిర్ణయిం తీసుకున్నారు. పాల ఉత్పత్తిలో వినియోగించే యంత్రాలకు 12శాతం నుండి 18శాతానికి జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశంలో 9కోట్ల కుటుంబాలు ఆధనపు భారం భరించాల్సి ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు పెంచమని, రైతులకు లాభం చేస్తామని, వారి ఆధాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రగల్బాలు పలికిన మోడీ ప్రభుత్వం మాట మార్చి పన్నుల భారంతో కుదేలు చేసింది. చివరికి పాల దిగుమతులకు ఆవకాశాలు కల్పిస్తూ స్వదేశీ పాల ఉత్పత్తులపై భారాలు మోపింది.
ప్రపంచంలోనే అగ్రగామి భారత్
2020-21 గణాంకాలు పరిశీలిస్తే 20.10కోట్ల టన్నుల ఉత్పత్తితో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. సంవత్సరానికి 6.2శాతం కాంపౌండిగ్ వృద్ధితో పెరుగుతున్నది. అమెరికా 10కోట్ల టన్నులు, పాకిస్థాన్ 5.5 కోట్ల టన్నులు, బ్రెజిల్ 4.5కోట్ల టన్నులు, 28 యూరోపియన్ దేశాలు 16.72కోట్ల టన్నులతో ప్రపంచ ఉత్పత్తి 85కోట్ల టన్నులుగా ఉంది. ప్రథమ స్థానంలో ఉన్న భారతదేశం పాల ఉత్పత్తిని దెబ్బతీయడానికి అగ్రరాజ్యాలు పన్నిన కుట్రలో భాగంగానే జీఎస్టీ పెంచడం జరిగింది. ప్రథమ స్థానంలో ఉన్నపటికీ స్విట్జర్లాండ్, ప్రాన్స్, న్యూజిలాండ్, అమెరికా దేశాల నుండి పాలు, పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాము. భారతదేశంలో గేదెపాల ఉత్పత్తి 50శాతం ఉంటుంది. ప్రపంచ వ్యాపితంగా ఆవు పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. నేటికి తలసరి పాల వాడకం భారతదేశంలో రోజుకు సగటున 420 గ్రాములు ఉన్నది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో తలసరి రోజువారి వాడకం 1100 గ్రాములుంది. తెలంగాణలో పాల తలసరి వాడకం 320 గ్రాములకు మించదు. స్థానిక వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వాలు పాలు, పాల ఉత్పత్తుల ధరలను తగ్గించి అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ ఎదో రూపంలో ఎప్పటికికప్పుడు ధరలు పెంచడం అనవాయితీగా వస్తోంది.
పన్నుల విధింపు
2017 జూలై నాటికి పాల ఉత్పత్తులపై ఎలాంటి పన్నులూ లేవు. ఆ తరువాత పాలు, పెరుగు, మజ్జిగలను మినహయించి మిగిలిన వాటిపై 5శాతం పన్నులు వేశారు. వాటిపై 5శాతం పన్ను పెంచారు. ప్యాకింగ్ చేసిన పాలపై పన్ను వేశారు. ఆమూల్ పాల వ్యాపారంపై 12శాతం పన్ను విధించారు. ఆమూల్ వ్యాపార టర్నోవర్ రూ.46000 కోట్లు ఉంది. సంవత్సరానికి 18శాతం వృద్ధి రేటుతో పెరుగుతోంది. జీఎస్టీ పెంపుతో వృద్ధిరేటుకు ఆటంకం ఏర్పాడుతుంది. పాల నుండి వెన్న తీసే యంత్రాలు, పాలలో వెన్న శాతం చూసే యంత్రాలు, పాలను పోడిగా మార్చే యంత్రాలు, వెన్న చీజ్ తయారు చేసే యంత్రాలకు 12శాతం నుండి 18శాతానికి జీఎస్టీని పెంచారు. ఈ విధంగా పెంచడంతో అకస్మాత్తుగా పాల ఉత్పత్తి దారులపై భారంపడి వారు వినియోగదారులపై భారం వేయాలి. ఈ ధరల పెరుగుదలతో వినియోగదారులు తమ వినియోగాన్ని తగ్గించుకుంటారు. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం అర లీటర్ పాలు వినియోగించుకునే విధంగా పెంచాల్సిన ప్రభుత్వం, వారిని వినియోగం నుండి దూరం చేసే విధంగా ధరలను పెంచుతున్నది.
డబ్ల్యూటిఓ-జి7 దేశాల కుట్ర
భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం చేసిన మూడు నల్ల చట్టాల ప్రయత్నాన్ని భారత రైతులు 13నెలలు ఆందోళన చేసి ఉపసంహరించుకునేటట్లు చేశారు. కానీ ఏదో రూపంలో, పక్క దారుల ద్వారా నేటికీ మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికే పూనుకొని ఉంది. అందులో భాగంగానే 'కనీస మద్దతు ధరలు' నామమాత్రంగా పెంచారు. గత నెల 12-15 మధ్య జరిగిన డబ్ల్యూటిఓ సమావేశాలలో ఎగుమతి సబ్సిడీలు ఇవ్వరాదని నిర్ణయించారు. ధనిక దేశాలు ఏదో పేరుతో (గ్రీన్‌బాక్స్, బ్లూబాక్స్, అంబర్‌బాక్స్) రాయితీలు కొనసాగిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలపై అంక్షలు విధిస్తున్నాయి. ఈ మధ్యనే జరిగిన జి7 దేశాల సమావేశంలో భారతదేశంపై రాయితీలు ఇవ్వకుండా అంక్షలు విధించారు. ఇవన్నీ గత నెలలోనే సంభవించాయి. వాటి కొనసాగింపుగానే 47వ జీఎస్టీ సమావేశంలో అన్ని ఉత్పత్తులపై ఇబ్బడి-ముబ్బడిగా పన్నులు పెంచేశారు. ప్రజల జీవనాదాయాన్నీ, వినియోగ సామర్థ్యాన్నీ తగ్గిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఐదేండ్లలోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో 1000కి 40మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 50శాతం మహిళలు, యువకుల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాంటి స్థితిలో 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు' పన్నుల భారంతో పాల వినియోగానికి ప్రజలను దూరం చేస్తున్నారు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండి కూడా దేశంలోని పౌరులకు పాలు అందించలేకపోవడం సిగ్గుచేటు. ప్రజారోగ్యం గురించి నిరంతరం మాట్లాడే ప్రధాని 47వ జీఎస్టీ సమావేశంలో పన్నుల భారం ఎందుకు పెంచినట్లు? ప్రజలేమైనా అధిక ఆధాయంతో తూగిపోతున్నారా? నేటికీ అతిదారిద్య్రరేఖ కింద 35శాతం మంది, సాధరణ దారిద్య్రరేఖ కింద 75శాతం ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి కదా...!
- మూడ్ శోభన్
సెల్:9949725951