Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి నిరాకరిస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. జనవరి 2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీలు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలపై దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పిటిషన్లు దాఖలు చేసిన వారిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)కు చెందిన మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్, ఆ పార్టీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. ఇంతకు ముందే వారి పిటిషన్‌ను ఆగస్టు 26, 2020లో అడీషనల్ ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం) కొట్టివేయడం వల్ల వారు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుండి మార్గదర్శకాలను కోరుతూ దాఖలైన ఇతర పిటిషన్లు కూడా ఉన్నాయి. కానీ పిటిషన్లతో విభేదించకుండానే న్యాయమూర్తి ఏసీఎంఎం ఉత్తర్వులను సమర్థించాడు. ఎఫ్ఐఆర్ నమోదు కావాలంటే అధికారుల నుంచి ముందస్తు అనుమతి అవసరమని న్యాయమూర్తి నిర్దేశించాడు.
ఇక్కడ ఉదహరించబడిన ప్రసంగాలు సామాజిక, ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో పాటు ప్రింట్ మీడియాలో కూడా విసృతంగా ప్రసారమయ్యాయి. ''దేశంలోని కుట్రదారులను(దేశ్ కీ గద్దరోంకో) కుక్కలను కాల్చినట్లుగా కాల్చి సమాధానం చెప్పండని'' కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భారీ బహిరంగ సభలో నినదించాడు. ఇది ఫిబ్రవరి 2020లో జరుగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగింది. పశ్చిమ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆ మరుసటి రోజు ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, షాహీన్ బాగ్ నిరసనకారులను పోలీస్ ఫోర్స్‌తో వెళ్ళగొట్టిస్తామని ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెదిరించాడని పిటిషనర్లు ఆరోపించారు. జాతీయ సమగ్రతకు భంగం కలిగించే ప్రకటనలు, బెదిరింపులు, మతపరమైన శత్రుత్వాన్ని ప్రేరేపిస్తున్న ఇద్దరు నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరారు. ఆ ఇద్దరు నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాల తరువాత జరిగిన ఓ సంఘటనలో హిందూసేనకు చెందిన సభ్యునిగా భావించబడిన ఒక వ్యక్తి నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కాల్పులు జరిపాడు. ఈ విషయంలో కూడా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జనవరి 31, 2020న పిటిషనర్లు ఢిల్లీ పోలీసులను కలిశారు.
ఫిబ్రవరి 2న, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను పిటిషనర్లు కలిశారు. పలుమార్లు కలిసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినప్పటికీ, ఢిల్లీ పోలీస్ ఎటువంటి చర్యలు తీసుకోని సందర్భంలోనే పిటిషనర్లు ఫిబ్రవరి 5న ఏసీఎంఎంను కలిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 156(3) కింద, భారత శిక్షా స్మృతిలోని 153ఏ, 153బీ, 295ఏ, 298, 504, 505, 506 సెక్షన్ల కింద నేరాలు మోపుతూ ఒక దరఖాస్తును అందజేశారు. న్యూఢిల్లీ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ నుండి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్)ను అందజేయాలని పిటిషనర్లు కోరారు.
ఫిబ్రవరి 11,2020న క్రైం బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ వారు ఒక ఏటీఆర్‌ను అందజేశారు. దాని తరువాత ఫిబ్రవరి 26న ఒక నివేదిక 'ప్రాథమికంగా ఏర్పడిన అభిప్రాయం ఆధారంగా' (ప్రైమాఫేసీ) గుర్తించదగిన ఎటువంటి నేరం జరగలేదని' తెలియ జేసింది. 'గద్దర్' అనే పదం ఒక ప్రత్యేకమైన మతాన్ని ఉద్దేశించి ఉపయోగిందలేదు కాబట్టి అది నేరం కాదనీ, ఆ ప్రసంగాలకు, ఆ తరువాత జరిగిన హింసకు ఎటువంటి సంబంధం లేదని ఆ నివేదిక తెలిపింది. ఫిర్యాదుదారులు సంబంధిత అధికారుల నుంచి ఆమోదం పొందలేదన్న కారణంతో ఆగస్ట్ 26న, ఏసీఎంఎం కార్యాలయం వారి అప్లికేషన్‌ను కొట్టివేసింది.
ముందస్తు తీర్పు
డిసెంబర్ 2020లో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో, ''ప్రభావవంతమైన వ్యక్తి, ప్రభుత్వ అధికారి, అనుచరులను కలిగి ఉన్న రాజకీయ నాయకుడు చేసే ద్వేషపూరిత ప్రసంగం సాధారణ వ్యక్తి చేసే ద్వేషపూరిత ప్రసంగం కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని'' (అమీష్ దేవగన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్లు ఉదాహరించారు. ద్వేషపూరిత ఉద్దేశ్యం అనేది ప్రసంగం చేస్తున్న సందర్భాన్ని బట్టి, ఉపన్యాసకుని గుర్తింపు, ప్రసంగం చేస్తున్న పరిస్థితులను బట్టి ఉంటుంది.
ప్రస్తుత సందర్భంలో కూడా, ఎన్నికల సమయంలో ఒక మతానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక మతానికి చెందిన వ్యక్తులను ఉద్దేశించే ఆ ద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. దానితోపాటు ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు కూడా ద్వేషపూరితంగా ఉన్నాయి. కాబట్టి, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాల్సిందని పిటిషనర్ల వాదన. దీనికి ఏ విధమైన ముందస్తు అనుమతి అవసరం లేదని పిటిషనర్ల వాదన. ఎఫ్ఐఆర్ను నమోదు చేయకపోతే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 156(3) సెక్షన్ కింద విచారణ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించే అధికారం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 156(3) సెక్షన్ కింద దరఖాస్తు సమర్పించేందుకు అదే కోడ్‌లోని సెక్షన్ 196 ప్రకారం అధికారుల నుంచి ఎటువంటి అనుమతి అవసరం లేదని పిటిషనర్ల వాదన. కేవలం ప్రివెన్షన్ ఆఫ్ క్రిమినల్ ఆక్ట్ చేర్చిన కేసుల విషయంలో మాత్రమే ముందస్తు అనుమతి అవసరమని తెలిపే సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఇక్కడ పిటిషనర్లు ఉదహరించారు.
ద్వేషపూరిత ప్రసంగాలతో పాటు, కొన్ని నేరాలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. లేకుంటే చట్టాలను తయారు చేసే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు చట్టాల్లో చిక్కుకొని పోతారు! ప్రస్తుత వ్యాజ్యంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరారోపణలు చేయడానికి ముందస్తు అనుమతి అవసరమని చెప్పే క్రమంలో, చార్జ్ షీట్ దాఖలైన తరువాత, కోర్టు దానిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అనుమతి అవసరమని పిటిషనర్లు చేసిన విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. పిటిషనర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను కాక పోలీసు కమిషనర్‌ను కలవడాన్ని బెంచ్ తప్పు పట్టింది. వారి పిటిషన్‌ను అడిషనల్ ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డిస్మిస్ చేసిన తరువాత వారు రివిజనల్ కోర్టును ఆశ్రయించాల్సిందని బెంచ్ అభిప్రాయపడింది.
పరిగణలో లేని హేతుబద్ధత
పేరు చెప్పేందుకు ఇష్టంలేని ఒక క్రిమినల్ న్యాయవాది ''ఫ్రంట్ లైన్''తో మాట్లాడుతూ, పిటిషనర్లు వారి ఆలోచన ప్రకారం సరియైన విధంగానే ఉన్నారని ఆయన అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైన తరువాతనే పోలీసులు ఛార్జిషీట్ తయారు చేస్తారని ఆయన అన్నారు. అనుమతి ఈ దశలో మాత్రమే అవసరం. నేరం జరిగిందని కోర్టు చెప్పడాన్ని ఎవరూ అడ్డుకోలేరని, ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సిన అవసరం ఉంటుందని ఆయన చెప్పారు. ఇది గుర్తించబడిన నేరాన్ని పరిగణలోకి తీసుకునే విధానం.
అల్లర్లు జరగడానికి ముందు ప్రముఖ బీజేపీ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్లను నమోదు చేయాలని కోరుతూ చేసిన విన్నపాలను పరిష్కరించాలని డిసెంబర్ 2021లో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. ఆ కేసులో పిటిషన్ దారులంతా ఆ హింసలో బాధితులే. జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ తల్వంత్ సింగ్‌ల నాయకత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ ప్రసంగాల వీడియోలు వీక్షించిన తరువాత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మలకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. కానీ ఆ పని జరగలేదు. ఆ మరుసటి రోజే జస్టిస్ మురళీధర్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేశారు.
- టీకే రాజ్యలక్ష్మి
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451