Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధరలు ఎంత పెంచినా జనం ఆమోదిస్తున్నారు, ఎక్కడా నిరసన తెలపటం లేదు. విశ్లేషకులు, జర్నలిస్టులకు మాత్రం ఎందుకు? ఇవీ ఇటీవల బీజేపీ నేతలు వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న ఎదురుదాడి. శ్రీలంక పరిణామాలు ఇక్కడా పునరావృతం అయ్యేంతవరకు అలానే మాట్లాడతారు అది వేరే అనుకోండి. 2022 జూలై మొదటి వారంలో సాధారణ వంటగాస్ ధరను మరో రూ.50 పెంచారు. దీంతో హైదరాబాదులో రూ.1,105కు చేరింది. అంతకు ముందు ఎంత పెంచినా జనాలు కిక్కురు మన లేదు, ఇప్పుడూ అంతే. పార్టీల పిలుపుల్లో కారకర్తలు తప్ప ఇతర జనాలు కనిపించరు. మంచం ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకొని నిద్రించటం అలవాటైన వారం కదా! సర్దుకు పోవటంలో మన తరువాతే ఎవరైనా!
జూలైలోనే ప్రభుత్వం విండ్ ఫాల్ టాక్సు పేరుతో చమురు సంస్థల మీద పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మామూలుగా విధించే పన్నుకు అదనం, తాత్కాలికం. దాని వలన కేంద్ర ప్రభుత్వానికి లక్ష నుంచి లక్షా 30వేల కోట్ల వరకు వస్తుందని కొందరు చెబుతుండగా ఇంకా ఎక్కువ ఉండవచ్చని కొన్ని అంచనాలు. సరే ఎంతైనా అది సెస్ గనుక వాటిలో రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అమ్మకపు పన్ను, జీఎస్టీ మరొక పన్ను గురించో విన్నాం గానీ విండ్ ఫాల్ టాక్సు గురించి పెద్దగా తెలియదు. దీనికి తెలుగులో సరైన పదాన్ని నిఘంటువులేవీ చూపటం లేదు. గాలి వాటు (ఆదాయంపై) పన్ను అందాం. ఒక కంపెనీకి దాని ప్రమేయం లేకుండా ఆర్థికంగా పెద్ద మొత్తంలో లాభాలు, లబ్ది పొందటాన్ని విండ్ ఫాల్ అంటున్నారు. నదులకు భారీగా వరదలు వచ్చినప్పుడు లంకల్లో ఉన్న పొలాలకు సారవంతమైన ఒండ్రు మట్టి చేరి పంటలు బాగా పండుతాయి. కొత్తగా కొన్ని లంకలు ఏర్పడి భూమిగా అందుబాటులోకి కూడా రావచ్చు. దీనికి రైతుల ప్రమేయం లేదా ప్రయత్నాలుగానీ ఉండవు. అలాగే పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు అలాంటి లాభాలు వస్తాయి. ఉక్రెయిన్ వివాద ఫలితంగా మన దేశంలోని చమురు కంపెనీలకు అలాంటి అపరిమిత లాభాలు వస్తున్నందున వాటి మీద కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది.
ఆ వచ్చిన రాబడితో వంటగాస్, పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించాల్సి ఉండగా గాస్ ధరను రూ.50 ఎందుకు పెంచినట్లు? ఎవరి కోసం ఈ పన్ను ఆదాయాన్ని ఖర్చు చేస్తారు? ప్రశ్నించకుండా నోరు మూసుకున్నవారు దేశభక్తులు, అడిగినవారు దేశద్రోహులు! దేశంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో వంటగాస్‌ను ప్రోత్సహించారు. ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉన్నందున దానికి గాను సబ్సిడీలు కూడా ఇచ్చారు. దీంతో వినియోగదారులు గణనీయంగా పెరిగారు. ఇప్పుడేమో మోడీ గారు వచ్చాక సబ్సిడీలు ఎత్తివేస్తూ, ధరలు పెంచుతున్నారు. సబ్సిడీలను ఎత్తివేసేందుకు గాను వేసిన ఎత్తుగడ ఏమంటే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల ఖాతాలో వేస్తామంటూ గాస్ ధర మొత్తాన్ని ముందుగా చెల్లించే అలవాటు చేశారు. తరువాత స్వచ్చందంగా సబ్సిడీ వదులు కోవాలన్న తతంగం నడిపారు. క్రమంగా సబ్సిడీ ఎత్తివేశారు. ఇక 2014లో గాస్ ధర రూ.414 కాగా తాజా పెంపుదలతో అది రూ.1,105 (హైదరాబాదు)కు పెరిగింది. నిజానికి 2014 తరువాత అంతర్జాతీయ మార్కెట్లో గాస్ ధర ముడిచమురుతో పాటు గణనీయంగా తగ్గింది.
అబ్జర్వర్ రిసర్చ్ ఫౌండేషన్ (ఒఆర్‌ఎఫ్) 2021 డిసెంబరు 4న ప్రచురించిన ఒక విశ్లేషణలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది... 2013-14 నుంచి 2019-20 కాలంలో అంతర్జాతీయ ఎల్పిజి(వంటగాస్) ధర 48శాతం తగ్గింది. అదే 2020-21తో పోల్చితే తగ్గుదల 31శాతం ఉంది. కానీ 2014 ఏప్రిల్ నుంచి 2021 అక్టోబరు వరకు మన దేశంలో ధరను 110శాతం పెంచారు. కరోనా లాక్డౌన్ల ఎత్తివేత తరువాత మాత్రమే అంతర్జాతీయ ధర పెరిగింది. అంతకు ముందు ఆరు సంవత్సరాలు తగ్గింది. ఈ కారణంగానే ప్రభుత్వం మీద సబ్సిడీ భారం తగ్గింది. వినియోగదారులకు నేరుగా చెల్లించిన సబ్సిడీ మొత్తం 2015-16 నుంచి 2020-21 కాలంలో రూ.27,570 కోట్ల నుంచి రూ.3,658 కోట్లకు తగ్గింది. ధనికులకు సబ్సిడీని తగ్గించి పేదలకు పెంచామంటూ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పిఎంయువై) పథకం పేరుతో చేసిన గాస్ కనెక్షన్ల ప్రచారాన్ని అనేక మంది ప్రశ్నించారు. సబ్సిడీల గురించి అనుసరించిన లెక్కల పద్ధతిని కాగ్ కూడా ప్రశ్నించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఓటర్ల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. 2015-16లో ఈ పథకం కింద ఇచ్చినట్లు చెప్పిన సబ్సిడీ రూ.2,990 కోట్లు కాగా 2019-20కి అది రూ.1,293 కోట్లకు తగ్గింది. కానీ ఈ పథకం కింద గాస్ కనెక్షన్లు పొందిన వారి ఆదాయం పెరగని కారణంగా, సబ్సిడీ కోత వలన సిలిండరును తీసుకోలేకపోయారు.
పిఎంయువై పథకం కింద గాస్ కనెక్షను ఉన్నవారికి సిలిండర్‌కు రూ.200 సబ్సిడీ ఇస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. 2022 మే 12న హిందూ పత్రిక వార్తలో వెల్లడించిన సమాచారం ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 90లక్షల మంది ఉజ్వల లబ్దిదార్లు గాస్‌ను తీసుకోలేదు. కోటి మంది ఒక సిలిండరు మాత్రమే తీసుకున్నారు. 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధాని నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. 2020 మార్చి నాటికి ఎనిమిది కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు, తరువాత మరొక కోటి పెంచారు. సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత ఆర్థిక సంవత్సరంలో (2021 మార్చి నాటికి) ఇచ్చిన కనెక్షన్లలో ఐఓసిలో ఒకసారి మాత్రమే సిలిండర్లు తీసుకున్నవారు 65, హెచ్‌పిసిలో 9.1, బిపిసిలో 15.96లక్షల మంది ఉన్నారు. 2019 సెప్టెంబరు వరకు తాము ఇచ్చిన కనెక్షన్ల గురించి బిపిసి ప్రత్యేకంగా పేర్కొన్నది. ఐఓసిలో ఒకసారి మాత్రమే తీసుకున్నవారు 52,హెచ్‌పిసిలో 27.58, బిపిసిలో 28.56లక్షల మంది ఉన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఏటా ఈ పధకం కింద కనెక్షన్ పొందిన వారు సగటున ఒక్కొక్కరు 3.6 సిలిండర్లు మాత్రమే తీసుకున్నారు. 2020 ఏప్రిల్ ఒకటి నుంచి డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వం మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఈ పథకం తీసుకున్న సిలిండర్ల సంఖ 14.17కోట్లని మరొక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం తెలిపిందని హిందూ పత్రిక పేర్కొన్నది. తొమ్మిది కోట్ల మంది మూడు చొప్పున తీసుకుంటే 27కోట్లు కావాలి, అంటే కరోనాలో కూడా ఉచితంగా ఇచ్చినా తీసుకొనే స్థితి లేదన్నది స్పష్టం. అలాంటపుడు కేవలం రెండువందల సబ్సిడీ ఇచ్చి తాజాగా పెంచిన రేటు ప్రకారం రూ.900 పెట్టి కొనుగోలు చేసేందుకు ఎందరు ముందుకు వస్తారన్నది ప్రశ్న. వంటగాస్ ధరలకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సగటున ఒక లీటరు ధర జూలై నాలుగవ తేదీ నాటికి 80 సెంట్లు ఉంది. మన కరెన్సీలో రూ.63.39 కాగా, మన దేశంలో 87 సెంట్లు, రూ.68.94గా ఉంది. మన కంటే ఆస్ట్రేలియాతో సహా 28 దేశాలలో ధర తక్కువగా 22 చోట్ల ఎక్కువగా ఉంది. విశ్వగురువుగా అభిమానుల నుంచి అభినందనలు అందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశాలను ఆదర్శంగా తీసుకుంటారూ?
గాలి వాటు లాభాలు ఎలా ఉన్నాయంటే, ప్రభుత్వ రంగ ఓఎన్జిసి 2020-21లో సంపాదించిన మొత్తం రూ.1,10,345 కోట్లకు గాను దానికి వచ్చిన లాభం రూ.40,306 కోట్లు. మన దేశంలో ఓఎన్‌జిసితో పాటు చమురును వెలికి తీసే వేదాంత ప్రైవేటు కంపెనీకి సైతం పెద్ద మొత్తంలో లబ్ది కలిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన గాలివాటు పన్నుతో ఈ రెండు కంపెనీల నుంచే కేంద్రానికి 69వేల కోట్ల మేరకు రాబడి ఉంటుందని పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. రిలయన్స్ కంపెనీ జామ్‌నగర్‌లోని చమురుశుద్ధి కర్మాగారం నుంచి ఎగుమతి చేస్తున్న చమురు ఉత్పత్తులపై ఆ కంపెనీ అపరిమిత లాభాలు ఆర్జిస్తున్నది. గాలివాటు పన్ను విధించిన తరువాత కూడా దానికి గణనీయ లాభాలు ఉంటాయని చెబుతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు తగ్గినప్పుడు ఆ మేరకు జనాలకు తగ్గించకుండా సెస్‌లను విపరీతంగా పెంచి లక్షల కోట్లు తన ఖజనాకు మళ్లించిందే తప్ప, ప్రజలకు ధరలను తగ్గించలేదు. ఇప్పుడు చమురు కంపెనీలకు వస్తున్న అపరిమిత లాభాల నుంచి కొంత వసూలు చేయటం సమర్థనీయమే. కానీ తద్వారా వచ్చే అదనపు రాబడిని ఎవరికోసం ఖర్చు చేస్తారు. కార్పొరేట్లకా? సామాన్య జనాలకా? గాస్, చమురు ధరల పెంపుదల ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారి తీస్తున్నది. పరిశ్రమల వృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహం పేరుతో కంపెనీలకు ఇస్తున్న పలు రాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి సామాన్యులకు మాత్రం సబ్సిడీల కోత - ధరల మోత ఎందుకు?
- ఎం. కోటేశ్వరరావు