Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడం లక్షలాదిగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు శాపంగా మారింది. 2018 ఆగస్టు నుండి తెలంగాణ రాష్ట్రంలో కొత్తపింఛన్ లను మంజూరు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నాలుగు సంవత్సరాల నుండి పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని మండలాల్లో పింఛన్ దారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నేటికీ పింఛన్లు మంజూరు చేయని దుస్థితి. దీంతో పూట గడవక వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తి దారులు ఆకలితో కాలం వెళ్లదీస్తున్నారు. కూలి పనులకు పోలేని పరిస్థితి. పూట గడవక చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులు ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వృద్ధాప్యంలో వచ్చిన బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ప్రతి రోజూ మెడిసిన్ వేసుకోవాలి. వాటిని కొనుగోలు చేయాలంటే డబ్బులేక తీవ్ర అనారోగ్యానికి గురై అనేక మంది మృత్యువాత పడుతున్నారు. మరోపక్క నిత్యవసర వస్తువులు కొనుక్కోవా లన్నా డబ్బులు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పెన్షన్ డబ్బులు గురించి స్థానిక ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు విన్నవించుకున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. దీనితో చేసేదేమీలేక కృష్ణ రామ అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తిరిగి రెండవసారి అధికారం చేపట్టాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 57సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇస్తామని ప్రకటించింది. కాని ఆ పింఛన్ కూడా ఆచరణలో అమలుకు నోచుకున్న పాపాన పోలేదు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రజలపై దాడి చేస్తుంటే పనిచేసి వారే పని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే, ఎలాంటి ఆదాయ వనరులు లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తిదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పాలకులు అర్థం చేసుకోవాలి. ఎన్నికల ముందు గొప్ప గొప్ప మాటలు చెబుతూ ప్రజల ఓట్ల కోసం ఎన్నో పాట్లు పడే నేతలు ఇలాంటి ఇబ్బందులు పడుతున్న పింఛన్ దారుల సమస్యలను మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వికలాంగులకు సదరన్ క్యాంపు నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉన్నా నేటికి అధికారులు జిల్లాల్లో సదరన్ క్యాంపులు నిర్వహిం చిన దాఖలాలు లేవు. కరోనా పేరుతో సదరన్ క్యాంపులు నిర్వహించకపోవడం మూలంగా సర్టిఫికెట్లు రాక అర్హత ఉన్నప్పటికీ పింఛన్‌కు నోచుకోని పరిస్థితి దాపురిచింది. గతంలో కొన్ని జిల్లాలలో సదరన్ క్యాంపులు నిర్వహించినా సర్టిఫికెట్లు అందేలోపు వాటి కాలపరిమితి ముగిసిపోవడంతో అనేకమంది అర్హులైన లబ్ధిదారులు పింఛన్లను నోచుకోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఏప్రిల్ నెల నుండి రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని ప్రకటించి నాలుగు నెలలు పూర్తయినా అమలుకు నోచుకోవటం లేదు. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని ఆశిద్దాం.
- ఎం సైదులు
సెల్:8106778287