Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాహుబలి చిత్రంలో హీరోకు ఎంత ఇమేజ్ ఉందో, విలన్కూ అంతే క్రేజ్ వచ్చింది. ఇద్దరూ సరిసమానమైన రీతిలో నటించారు. కానీ బాహుబలి తర్వాత హీరో, విలన్ల కంటే కట్టప్పకే ఎక్కువగా పేరొచ్చింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే ప్రశ్న రెండవ పార్టు చూసేలా చేసింది. తప్పని పరిస్థితుల్లోనే కట్టప్ప బాహుబలిని చంపేయాల్సి వచ్చింది. కానీ తాజా రాజకీయాల్లోని కట్టప్పలు తప్పని పరిస్థితులు లేకున్నా, వెన్నుపోట్లు పొడుస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ కట్టప్పల జోరు మరింత వేగవంతమైంది. ప్రజలు ఏమనుకుంటారోననే ఆలోచన లేకుండా వెన్నుపోట్లకు సిద్ధమవుతున్నారు! రాజకీయాల్లో ఎంతో సీనియర్ నాయకులుగా ఉన్నావారు కూడా పదవిపై వ్యామోహంతో కట్టప్పను మరిపిస్తున్నారు. చెప్పుకుంటూ పోతే ఇది పెద్ద జాబితానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి కట్టప్పలు మరింత ఎక్కువ ఉండొచ్చు అనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పార్టీలో ఏ కట్టప్ప ఉన్నారు. ఆయన అవసరాలేంటి? ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు? ఎవరిపై ఆయనకు కోపం ఉంది? అప్పులేమైనా ఉన్నాయా? వ్యాపారాల్లో నష్టాలున్నాయా? ఇత్యాది విషయాలను పసిగట్టి? అటువంటి వారందరినీ కట్టప్పలుగా తయారు చేస్తున్నారు. ఈ కట్టప్పలను తయారు చేయడంలో కమలనాథులను మించిన వారేవ్వరూ లేరనేది స్పష్టం. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కట్టప్పలకు వలేసి ప్రభుత్వాలను కూల్చడంలో రికార్డులు తిరగరాస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వ కూల్చివేతను మరువకముందే, తెలంగాణలోనూ కట్టప్పలను తయారుచేస్తున్నామని బహి రంగంగానే సెలవిస్తున్నారు. ఏం చేస్తాం... కట్టప్పల కాలమిది!
- గుడిగ రఘు