Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కైలాసమంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రమధగణాలు, గణేషుడూ, కుమారస్వామితో సహా పార్వతీదేవి అంతా వెదుకుతున్నారు. ఐనా లాభం లేదు. ఇంతలో ''నారాయణ'', అనుకుంటూ నారదుడు వచ్చాడు. కైలాసంలోని పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాడు.
''ఏం జరిగింది తల్లీ!'' మెల్లగా పార్వతీదేవిని అడిగాడు.
''ఇంకా ఏంజరగాలి నారదా! నా నాధుడు పరమశివుడు గత 15 రోజుల నుండి కనిపించుట లేదు!'' అన్నది పార్వతి దుఃఖంతో
''ఇంత మాత్రానికే అంత వ్యాకులత ఎందుకు తల్లీ! ఏ భక్తుడు పిలిస్తే వెళ్ళాడో ఏమిటో! ఆయనప భోళాశంకరుడు కదా! అన్నాడు తేలిగ్గా.
''అట్లాంటిదేమీ లేదు! ఈ మధ్య అంత పెద్ద, పెద్ద తపస్సులు ఎవరూ చేయటం లేదు కదా!'' అన్నది పార్వతి ఇంకా దుఃఖంతోనే.
''భక్తులు కూడా పిలవలేదా! మరింకెక్కడికి వెళ్ళి ఉంటారబ్బా! ఆఁ గంగాదేవితో సరదాగా అలా అలా వెళ్ళిపోయాడేమో అసలే ఆయన గంగాధరుడు కదా!'' అన్నాడు నారదుడు మరింత తేలిగ్గా!
''ఆపు! నారదా ఆపు! నేను ఇక్కడే ఉన్నాను! స్వామివారితో పాటు నేను వెళ్ళలేదు! ఆయనెక్కడికి వెళ్ళారో నాక్కుడా తెలియదు'' అంటూ విసురుగా మాట్లాడింది ముందుకొచ్చిన గంగాదేవి.
దాంతో నారదుడు వెనక్కి తగ్గాడు. ఈలోగా బ్రహ్మ, విష్ణువులు కూడా వారి కుటుంబాలతో సహా వచ్చారు. పార్వతి విషయం వివరించింది. అంతా విని విష్ణుమూర్తి సావధానంగా ఆలోచించాడు. అటూ ఇటూ చూశాడు. ''నందీ'' అని పిలిచాడు. ఎక్కడో వెనక ఉన్న నందీశ్వరుడు మెల్లిగా ముందుకు వచ్చాడు.
''ఏం జరిగింది నందీశా?'' ప్రశ్నించాడు మహావిష్ణువు.
మహావిష్ణువు ముఖం చూసి వెంటనే తలదించుకున్నాడు నంది.
''మహాశివుడు ఎందుకు కనబడటం లేదో నీకు తెలుసు నందీశా! ఏం జరిగిందో చెప్పు!'' గద్దించాడు మహావిష్ణువు.
''ప్రభూ! భూమిమీద ఎవరో గరళకంఠడు ఉన్నాడంట! నందిలా నేను చూశాను! అని ఎవరో అన్నారంట! ఈ మాట నేను స్వామివారి ముందు అన్నాను! స్వామివారు నన్ను ఏదోలా చూసి వెంటనే మాయమైపోయారు! ఇక అప్పటి నుండి స్వామివారి దర్శనం కరువైంది స్వామీ!'' అంటూ నందీశుడు రోదించాడు.
''భూమి మీద గరళకంఠుడా? అదెలా సాధ్యం! ఆ మాట వినగానే మహాశివుడు ఏల మాయమైపోయెను! ఎందుకిలా జరిగింది!'' అంటూ అంతా మల్లగుల్లాలు పడుతున్నారు.
అంతా గమనించిన మహావిష్ణువు.. పార్వతివంక చూశాడు. ఆమె కూడా రోదిస్తూనే ఉన్నది! మహాశివుడిని స్మరించాడు. కొంతసేపటికి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎంతో బాధతో ఉన్నట్లు కనిపించాడు.
''ఏం జరిగింది! ఎందుకు ఉన్నట్లుండి మాయమైపోయావు? నందీశుడు చెప్పేది నిజమేనా! ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు?'' ప్రశ్నల వర్షం కురిపించాడు మహావిష్ణువు.
''నందీశుడు చెప్పింది నిజమే! భూమి మీద మరో గరళకంఠుడు ఉన్నాడని తెలియగానే నాకు ఎంతో బాధకలిగింది. అందుకే మాయమైపోయాను. ఎక్కడికెళ్ళాలో నాకే తెలియదు!'' అన్నాడు శివుడు ఇంకా బాధగానే.
''ఇదేమి చిత్రము స్వామి? నీవుండగానే మరో గరళకంఠుడు
ఎలా ఉంటాడు. అదెలా సాధ్యము?'' ఆశ్చర్యంగా అడిగాడు బ్రహ్మ.
''బ్రహ్మదేవా! నీకు, ఈ సకల చరాచర విశ్వానికంతా తెలుసును కదా! సాగర మధన సమయాన ఉద్భవించిన హాలాహలమనే మహాగ్ర విషము. విశ్వాన్నే దహించబోతుంటే, విశ్వమానవ కళ్యాణం కోసం నేనా హాలాహలాన్ని దోసిటపట్టి నా గొంతులో పెట్టుకున్నాను! అందుకే నన్ను మీరంతా గరళకంఠుడని పిలుస్తున్నారు కదా! మరిప్పుడు ఈ కొత్త గరళకంఠుడు ఏ హాలాహలాన్ని మింగాడు?'' అని ప్రశ్నించాడు మహాదేవుడు ఆవేదనగా.
మహావిష్ణువు తన దివ్యదృష్టితో పరికించాడు!
''ఆవేదన చెందకు మహాదేవా! ఒకవ్యక్తి చెప్పిన మాటకు నీవింత ఆవేదన చెందుట సమంజసం కాదు!'' అన్నాడు విష్ణువు.
''సమంసజం కాదా! అన్నవాడు మామూలు మనిషికాదు! 130కోట్లమంది ప్రజలను కాపాడే పెద్దదిక్కు. అన్నది మామూలు మాట కాదు! ''గరళకంఠుడు'' అన్న మహౌన్నత పదం! మరిదాన్ని పట్టించు కోనవసరం లేదా? అన్నాడు మహాశివుడు మరింత ఆవేదనగా.
''ఏదైనా ఒక వ్యక్తి అన్నమాటను పట్టుకుని ఇంత ఆందోళన పడటం ఏమీ బాగాలేదు మహాదేవా?'' అన్నాడు బ్రహ్మ విసుగ్గా. ఆయన్న సృష్టికార్యక్రమాలన్నీ పక్కనపెట్టి వచ్చాడు మరి!
''నాకెందుకో మహాదేవుడి ఆవేదనలో అర్థముందని అనిపిస్తోంది! ఒక మామూలు మానవుడు మహాదేవుడి స్థాయిలో గరళకంఠుడని అనిపించుకోవటం అన్యాయం! భవిష్యత్తులో గరళకంఠుడెవరని అడిగితే ఆ వ్యక్తి పేరే చెబుతారేమో! ఇప్పటికే అల్లూరి సీతారామరాజు అంటే రాంచరణ్ అనీ, కొమరం భీం అంటే జూనియర్ ఎన్టిఆర్ అనీ చెబుతున్నారు కదా!'' అన్నాడు నారదుడు మెల్లగా.
''నిజమే! నారదుడు చెప్పినట్లే జరగవచ్చు. అధికారంలో ఉన్నవారు తాము చెప్పినది అమలు చేయించుకోగలిగే స్థితిలో ఉంటారు. ''గరళకంఠుడు'' అని పిలిపించుకున్న మానవుడు, అతడి వద్ద నందిలా ఉన్నానన్న భృక్యుడూ అధికారంలో ఉన్నారు. ఆ అధికారం అమలు చేయగలిగే సమస్త వ్యవస్థలూ వారి అధీనంలోనే ఉన్నాయి! అందువల్ల మహాదేవుడి బిరుదును, విశ్వమానవాళి కోసం ఆయన చేసిన త్యాగాన్ని ప్రజలు మర్చిపోయే ప్రమాదాన్ని కాదనలేము!'' అన్నాడు మహావిష్ణువు సాలోచనగా.
ఈ చర్చ ఏమిటో! గంగాదేవికి ఏమీ అర్థం కాలేదు!
''అయ్యో... ఏమిటిది? ఎవరో ఏదో అనటం, నా నాధుడు కనిపించకుండా పోవడం, ఆయన తిరిగి వచ్చినా, ఆయన బిరుదుకి ప్రమాదం పొంచి ఉందని మీరు చెప్పటం? ఇదంతా ఏమిటీ?'' అన్నది గంగాదేవి.
శ్రీహరి చిన్నగా నవ్వాడు.
''మన భరత ఖండంలోని ఒక రాజ్యాన్ని ఒకరాజు పరిపాలిస్తుండగా, తన అధికారాన్ని నిలబెట్టుకొనుటలో భాగంగా, ఆ రాజు మతకల్లోలాకు పాల్పడ్డాడనీ, ఒక మతస్థుల కొమ్ము గాపాడని ఆరోపణలు వచ్చాయి. దానిపై న్యాయస్థానం 20ఏండ్ల తరువాత తీర్పు నిచ్చింది!' అందులో విచారణ సక్రమంగా జరగలేదని చెబుతూనే ఆ రాజుదేమీ తప్పులేదన్న భావన వచ్చే విధంగా తీర్పునిచ్చింది! దాంతో ఆరోపణల నుండి ఆ రాజు విముక్తి పొందాడని, మతకల్లోలాలకు పాల్పడ్డాడన్న నిందను భరించి గరళకంఠుడయ్యాడని, ఇదంతా నందిలా తాను దగ్గరుండి చూశానని, నాటికీ, నేటికీ ఆ రాజు వద్ద మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రకటించాడు! ఇదీ జరిగిన కథ! అని వివరించాడు శ్రీహరి.
ఆ మాటలు విని ఆగ్రహం చెందింది పార్వతీదేవి.
''ఇంకా పూర్తికాలేదు! ఆ మతకల్లోలాల్లో బాధితుల కోసం నిలిచిన వారిని వేధించటం ప్రారంభించారు. కారాగారంలో వేసి శిక్షలు విధించుకున్నారు! ప్రజలను కులాల వారీ, మతాల వారీ, ప్రాంతాల వారీ విభజించి పాలిస్తున్నారు! నిత్యావసర సరుకులు కొనలేక, ఉపాధి కోల్పోయి, భవిష్యత్ ఏమిటో తెలియక, కష్టాలను భరించలేక, భరించకుండా ఉండలేక, భరత ఖండ ప్రజలు పడుతున్న బాధలు, వేదనలు వర్ణనాతీతం!'' అన్నాడు శ్రీహరి.
''అయితే భరత ఖండ ప్రజలే నాకన్నా గొప్ప గరళకంఠులు'' అని నిట్టూర్చాడు మహాశివుడు.
- ఉషాకిరణ్, సెల్:9490403545.