Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం ఈనాడు రాజ్యాంగ సంక్షోభంలో ఉంది. దేశంలోని ప్రధాన పాలకవర్గాలు నిరంతరం రాజ్యాంగ ఉల్లంఘనకై ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగం ఒక సామాజిక సాంస్కృతిక విప్లవమార్గం. రాజ్యాంగం భారతదేశ నిర్మాణ సౌధం. భారతదేశానికి ఒక నిర్మాణాత్మక పరిపాలనా క్రమాన్ని ఇవ్వడానికి అంబేద్కర్ 1949 నవంబర్ 20న దేశాన్ని సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా ప్రకటించారు. రాజ్యాంగంలో ప్రధాన సూత్రం ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. నిజానికి రాజ్యాంగ అంతర్గత శక్తి ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ. భారత రాజ్యాంగాన్ని మనం లోతుగా చూస్తే అంబేద్కర్ అంతకు ముందటి వర్ణ సూత్రాల్ని కూల్చి నూతన ధర్మాల్ని ప్రతి పాదించిన జ్ఞానదృష్టి కనిపిస్తుంది. ప్రధానంగా ఆదర్శ సూత్రాలను మనం ఒకసారి పరిశీలిస్తే మంచి మాట, మంచి సంబోధన మానవతా సౌరుతో హృదయ దీపాలు వెలిగిస్తుంది. అంబేద్కర్ నిజానికి కులేతరమైన సంబోధనకు పాదులు వేశాడు.
అంబేద్కర్ సమ్యక్ వాక్కుని భారతదేశంలో బహుముఖంగా ప్రవేశపెట్టారు. కులేతరమైన రాత, మతాతీమైన లౌకిక దృష్టి మతోన్మాదేతరమైన జ్ఞానబోధకు అవకాశం కల్పించారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్‌ది శాస్త్రీయ దృష్టి. ఆయనది హేతువాద దృక్పథం. ఆయన లౌకికవాద తాత్వికుడు. నిరావేశ జ్ఞానోత్పత్తికి ఆయన రాజ్యాంగంలో మార్గం చూపించారు. భారతదేశం ఆవేశపూరితంగా మత ఘర్షణలలో ఎంతో రక్తాన్ని నేలలో ఇంకింపజేసింది. ఈ రోజు 136కోట్ల మంది జీవించి ఉన్నారంటే అది భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే జరిగింది. భారతదేశంలో ఈనాడు హిందూ పునరుద్ధరణ వాదం నడుస్తుంది. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ సన్యాసులు, యోగులు, రాజకీయ నాయకులు హిందూవాదాన్ని బహు ముఖంగా తీసుకెళుతున్నారు. శాస్త్రీయ జ్ఞాన ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞానం విశ్వజనీనమైనది. ఒకరిలో పుట్టి ప్రపంచ వ్యాప్తం ప్రవహించే గుణం దానికి ఉంటుంది. జ్ఞానం మానవునిలో విస్తరించినప్పుడే మానవ స్వభావం అనే భావనలో మానవులందరు కొన్ని ఉమ్మడి లక్షణాలు కలిగివుంటారు. నమ్మకం ఇమిడి ఉంటుంది. మానవులందరూ నవ్వుతారు. ఏడుస్తారు. అనేక భావోద్రే కాలు ఉంటాయి. మానవు లందరూ సమానమనే భావన రావాలంటే దానికి తప్పక రాజ్యాంగ జ్ఞానం అవసరం. మానవుడు మతాని కో, కులానికో కట్టు బడి ఉన్నప్పుడు విస్తృతమైన జ్ఞానాన్ని సంపాదించు కోలేరు. ఈనాడు మన సామాజిక వ్యవస్థ కుల, మత, అస్పృశ్యతతో ఉండటానికి కారణం మత వ్యవస్థే.
సాంప్రదాయకంగా హిందూ ధర్మశాస్త్ర విధాయకులు మానవ జీవితానికి ధర్మార్థ కామ మోక్షాలు నిర్ణయించారు. బౌద్ధం అయితే జ్ఞానము, తర్కము, నైతికత, మానవతా, ఆత్మీయత, అధ్యయనము, ఆదర్శాలను రూపొందించింది. వీటి ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛను అంబేద్కర్ రాజ్యాంగంలో 19వ అధికరణను రూపొం దించారు. ఇది దేశీయతకు మూలమైనది. ముఖ్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛలో ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం జరుపుకునే స్వేచ్ఛను ఇచ్చారు. అయితే మతోన్మాద భావజాలం ఉన్నవారు ఆయుధాలతో ఇప్పుడు ప్రదర్శనలు చేస్తున్నారు. అది రాజ్యాంగ వ్యతిరేకమైన అంశం. రాజ్యాంగంలో గొప్ప విషయం స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తించడం. 19వ అధికరణలోనే ఏ కులం వారైనా, ఏ వర్ణం వారైనా ఏ వృత్తినైనా, ఏ వ్యాపారాన్నైనా చేసుకోవచ్చునని 'జి' క్లాజులో చెప్పారు. అయితే భారతదేశంలో ఇప్పటికీ వ్యాపారం మొత్తం పది కులాల చేతుల్లోనే ఉండిపోయింది. వ్యాపారాన్ని కుల నిబద్ధం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. అయితే బ్యాంకులు కింది కులాల వారికి డబ్బు ఇచ్చి వ్యాపారాన్ని వృద్ధి చేయాలి. అయితే వాళ్ళు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టే వారిని చూసి మరీ డబ్బులిస్తున్నారు. చైనాలో వస్తు ఉత్పత్తికి, వస్తువు అమ్మడానికి వర్ణ, కుల బేధాలు లేకపోవడం వల్ల నూటికి తొంబై మంది వస్తు ఉత్పత్తిలో గానీ, ప్రపంచ వస్తు వ్యాపారంలో గానీ ఉన్నారు.
నిజానికి భారత రాజ్యాంగ అధికరణ 15 ఏమిచెబుతుందంటే కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశం కారణంగా వివక్షతకు తావులేదు. ఇది అంబేద్కర్ మహోన్నతమైన సిద్ధాంత ఆచరణ నుంచి రూపొందించిన సూత్రం. సమాజంలోనే కాక కుల, మత వివక్ష అన్ని విశ్వవిద్యాలయాల్లో జరుగుతుంది. విశ్వ విద్యాలయాల్లో దళిత విద్య మీద రోహిత్ వేముల ఆత్మహత్య తరువాత పెద్ద యెత్తున దాడులు, అణచివేతలు జరుగుతున్నాయి. మొత్తం శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక, చరిత్ర, రాజకీయ శాస్త్రాలన్నింటిలో దళితులకు సీట్లు తగ్గించారు. నరేంద్ర మోడీ పుట్టిన బీసీలకు, శూద్రులకు కూడా పరిశోధనా రంగంలో కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో సీట్లు తగ్గాయి. ఉన్నత విద్యలో దళితులను పూర్తిగా దెబ్బ తీయడానికి ''హిందుత్వను అంగికరిస్తేనే మీరు విశ్వవిద్యాలయాల్లో ఉండండి, లేకుంటే లేదనే'' వరకు ఆరెస్సెస్ శ్రేణులు ముందుకు వెళుతున్నాయి. ఈ ఎనిమిదేండ్ల పాలనలో దళితులకు భూములు పంచలేదు. దళితులపై జరిగే అత్యాచారాల విషయంలో ఎటువంటి విచారణ లేదు. అస్పృశ్యతా నివారణ చట్టాన్ని కాక, 1989 ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే సకల ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశంలోని విశ్వవిద్యాలయా లన్నింటిలో దళిత వివక్ష కొనసాగుతుంది. అంబేద్కర్ దళిత విద్యకే ప్రధానమైన ప్రాధాన్యతను రాజ్యాంగంలో ఇచ్చారు. ఫస్ట్ కేబినెట్లోనే దళితులకు భూమి కొనుగోలు కోసం 20కోట్లు కేటాయింపజేశారు. దేశంలో, వివిధ రాష్ట్రాలలో బహుళ జాతి సంస్థలకు భూమిని ధారాదత్తం చేస్తున్నారు గానీ దళితులకు, గిరిజనులకు భూమిని పంచడం లేదు. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ రాజ్యాంగ నిర్లక్ష్యం, దళితుల పట్ల వివక్ష వల్ల భారతదేశంలో ఉత్పత్తి పెరగడం లేదు. శ్రమ జీవిని నిర్లక్ష్యం చేసిన దేశంలో తప్పక ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దళితులు, బహుజనులు, శ్రమజీవులు వారి పిల్లలను విద్యావంతులను చేసుకునే భవిష్యత్ దర్శనంలో వాళ్ళున్నారు. అటు భూమిని ఇవ్వకుండా, ఇటు విద్యను ప్రోత్సహించకుండా, ఉద్యోగాలను పూర్తిగా రద్దుచేసి దళితుల పట్ల పూర్తిగా రాజ్యాంగ కుల వివక్ష చూపుతున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భావ దారిద్య్రంలో ఉన్నాయి.
- డాక్టర్ కత్తి పద్మారావు