Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజు ఎవరైతేనేమి
దోపిడీ నేత్రపు చూపు అడవి దిక్కే చూస్తుంది
కాలం ఏదైతేనేమి
కావాల్సింది అడవి సంపదే కదా
పథకం పేరు ఏదైతేనేమి
అటవి సంరక్షణ నినాదాలన్ని
ఆదివాసీల జీవన విద్వంసానికే కదా
దోపిడీ దొరలకు అండగా
లాఠీలు, తుపాకులు వస్తున్నాయి
అక్రమ కేసులూ వస్తున్నాయి
రాజ్యోన్మాదంలో
గుడిసెలు కూలుతున్నాయి
పంట మొక్కల ప్రాణాలు పోతున్నాయి
మాతృమూర్తులు నగంగా ఈడ్చబడుతున్నారు
పసిపిల్లల ఆకలికేకలు అరణ్యాన్ని అలుముకున్నాయి
సర్వస్వం కోల్పోయిన చోట
కొత్తగా పోగొట్టుకోవడానికి ఏముంటుంది
ప్రతిఘటనలో ప్రాణాలు తప్ప!
అందుకేనేమో....
ఆఖరి శ్వాస నుండోచ్చే తెగింపు మహౌన్నతమైనది
పుట్టిన భూమి కోసం
బతుకునిచ్చిన అరణ్యం కోసం
అత్యవసరమైన ప్రతిఘటనలో
కారం పొట్లాలు అణుబాంబులై పేలును
కర్రలు, విల్లంబులే అయుధాలగును
పుట్టిన నవజాత శిశువుకు
తల్లి పాలు సహజ హక్కైనట్లు
కొండలు పురుడోసిన గిరిపుత్రులకు
అడవి సంపద సహజ హక్కవును
అది రాజ్యాంగమైనది కూడాను
పుట్టుకతో వచ్చిన హక్కుల్ని కాలరాసి
ఏ రాజనీతి ''అడవిని - బిడ్డల్ని'' విడదీయగలదు!
మాతృత్వ ప్రేమను ద్వంసం చేసే రాజ్యం తప్ప!!
రచన: విను