Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెబ్భైఅయిదేండ్ల స్వతంత్ర భారతం అమృతోత్సవాల వేళ కూడా పేదరికం దేశాన్ని వెక్కిరిస్తూనే ఉన్నది. ఆదాయ మార్గాలు మూతపడటం, నిరుద్యోగం పెరగడం, అసమానతల అగాధాలు ఏర్పడడంతో, అసంఖ్యాకులైన ప్రజలు రోజు రోజుకూ పేదరికం ఊబిలోకి జారిపోతున్నారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో కూడా ప్రజలు ఆకలి చావుల అంచున, నిస్సహాయంగా నిలబడి ఉండటం అత్యంత విషాదకరమే కాదు, దేశానికి అవమానకరం కూడా.
పేదరిక దుష్ప్రభావం
ఏ దేశ ప్రగతికైనా పేదరికం అవరోధంగా నిలుస్తుంది. పేదరికం ఓ ఆర్థిక సమస్య మాత్రమే కాదు. పేదరికంతో ప్రజల ఆయుర్థాయం, విద్య, జీవన ప్రమాణాలు, లింగ సమానత్వం, అసమానతలు, ఆరోగ్యం లాంటి పలు ముఖ్య అంశాలు నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలుసుకోవాలి. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా భారత రాజ్యాంగంలో 'చట్టం ముందు అందరూ సమానం, జీవన భద్రత, వెట్టిచాకిరీ నిషేధం, ప్రజాసంక్షేమం, కనీస అవసరాలు పొందే హక్కు' లాంటి పలు అంశాలను పొందుపరిచినా గత 75ఏండ్లలో ఆశించిన ఫలితాలను పొందలేకపోయాం.
పేదరిక నిర్మూలన మార్గాలు
దారిద్య్ర రేఖకు దిగువన నరకం అనుభవిస్తున్న పేదలను పైకి లాగడానికి ప్రభుత్వాలు నిర్దిష్ట ప్రణాళికలు రచించడం, నిబద్ధతతో అమలు పరచడం సత్వరమే జరగాలి. ఆర్థిక ప్రగతి పథకాలు, మౌలిక వనరుల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, పటిష్ట ప్రజాపంపిణీ వ్యవస్థల కల్పన, వ్యవసాయ రంగ ఉపాధులు, వ్యవసాయేతర ఉపాధులు, పని కల్పన, ఉద్యోగాల కల్పన మొదలగు పలు రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రామిక వర్గాలకు ఉపాధి కల్పించగల ప్రాజెక్టులను చేపట్టడం, దేశ పెట్టుబడులతో పేదల చేతులకు పని కల్పించడం విధిగా జరగాలి. పేదరిక నిర్మూలనకు ఆహార భద్రతతో పాటు పటిష్ట ప్రజాపంపిణీ వ్యవస్థలు నిరంతరం చురుకుగా, క్రియాశీలంగా పని చేయాలి. సుస్థిర జీవనోపాధులు, మౌలిక సామాజిక సేవల కల్పన, సామాజిక ఆర్థిక భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్వల్పకాలిక పథకాలతో పాటు దీర్ఘకాలిక చర్యలు తీసుకున్నపుడే పేదరికం లేని భారతం సిద్ధిస్తుం రరదని మరువ రాదు. పేదరిక నిర్మూలనలో జనాభా నియంత్రణ, ప్రాంతీయ అసమానతల తొలగింపు, కనీస అవసరాల కల్పన, ఉన్నత విద్యావ్యాప్తి, నైపుణ్య వికాస కార్యక్రమాలు లాంటివి నిరంతరం కొనసాగాలి.
పేదరిక నిర్మూలనలో వ్యవసాయరంగం
పేదరికానికీ దేశ వ్యవసాయాభివృద్ధికీ విలోమ సంబంధం ఉంటుంది. వ్యవసాయరంగంలో అభివృద్ధి పెరిగితే పేదరికం నేరుగా తగ్గుతుంది. 1960లో పంజాబ్, హర్యానాల్లో జరిగిన హరిత విప్లవంతో అక్కడ పేదరికం చాలా తగ్గడం చూసాం. దేశ ఆర్థికాభివృద్ధికి 'లైఫ్‌లైన్'గా వ్యవసాయరంగం నిలుస్తున్నది. చిన్న సన్నకారు రైతులకు ఉపశమనం కలించేలా వ్యవసాయానికి ప్రభుత్వాలు చేయూత ఇవ్వాల్సిన కనీస బాధ్యత ఉన్నది. మౌలిక వనరుల కల్పన రంగాలు పేదరికాన్ని తగ్గించేవిగా ఉండాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలుగా పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఫౌల్ట్రీ, గొర్లు మేకల పోషణ వృత్తి, రవాణా, చిరు వ్యాపారాలు, హస్తకళలు, వ్యవసాయ ఆధార ఉపాధులకు పెద్ద పీట వేయాలి.
సంక్షేమ, సుస్థిర సమగ్రాభివృద్ధి సమ్మిళిత సేవలు
ఉచిత పథకాలు స్వల్పకాలిక ఫలితాలను ఇస్తాయని గమనిస్తూ, దీర్ఘకాలిక ఉద్యోగ ఉపాధులపై అధిక దృష్టిని కేంద్రీకరించాలి. ఓటు బ్యాంకు పథకాలను క్రమంగా తగ్గించుకుంటూ, దీర్ఘకాలిక సుస్థిరాభివృద్ధి దిశగా తమ కాళ్ల మీద తామే నిలబడేలా పేదలకు గౌరవప్రదమైన ఉద్యోగ ఉపాధులను కల్పించడమే కర్తవ్యంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రజలు కేవలం ఓటు వేసే యంత్రాలు కాదని, గౌరవంగా సమాజంలో తల ఎత్తుకొని సగర్వంగా జీవించే పౌరులని గుర్తించాలి.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్:9949700037