Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ పన్నుల చరిత్రలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా అభివర్ణించిన జీఎస్టీ ('గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్') ప్రస్థానం జూన్, 2022నాటికి అర్థ దశాబ్దానికి చేరింది. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు (101వ సవరణ చట్టం) ద్వారా 2016లో జీఎస్టీ చట్టాన్ని ఆమోదించి, అమలుకు అంకురార్పణ చేశారు. రాష్ట్రంలో ఏదైనా వస్తువుల సరఫరా లేదా సేవలు పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించేందుకు నిర్దేశించిన సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ), రాష్ట్రంలో ఏదైనా వస్తువులు సరఫరా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళే పన్నుకు సంబంధించిన రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ), అంతరాష్ట్ర వ్యాపారం లేదా వాణిజ్యంలో భాగంగా వస్తువులు, సేవల సరఫరాపై విధించే సమగ్ర వస్తు సేవల పన్ను (ఐజీఎస్టీ)గా, జీఎస్టీ విధాన ప్రక్రియను వర్గీకరించారు.
వివిధ రకాల వస్తుసేవలు 1శాతం, 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం పన్ను శ్లాబుల పరిధిలోకి వచ్చేలా రూపొందించబడింది. పన్నుల సరళీకరణ వలన ధరలు తగ్గేందుకు వీలు కలిగి పేద రాష్ట్రాలు లాభపడతాయని, సులభమైన, సమ్మిళిత పన్నురేట్లతో ఏకరూపత, మెరుగైన పోటీతత్వం, సులభ నిర్వాహణా సౌలభ్యం, అధిక రాబడి సామర్థ్యం, మొత్తం పన్ను రాబడి నుంచి ఉపశమనం వంటి ప్రయోజనాలు చేకూరతాయని, స్వాతంత్య్రానంతరం పన్నుల సంస్కరణలలో విప్లవాత్మకమైన మార్పుకు నాంది ప్రస్థావన అని అర్థరాత్రి నిర్వహించిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో ఉద్ఘాటించారు.
అర్థ దశాబ్దపు జీఎస్టీ అమలు ప్రస్థానంతో, దేశ ఆర్థిక వ్యవస్థలో అర్థభాగంపైగా పన్ను ఆదాయం జీఎస్టీ ద్వారానే సమకూరటం గమనార్హం. 2017-18లో రూ.7,19,078 కోట్లు; 2018-19లో 11,77,370కోట్లు; 2019-20లో 12,22,117 కోట్లు; 2020-21లో 11,36,803కోట్లు, 2021-22లో 17,52,679 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థ పన్ను ఆదాయాన్ని సముపార్జించింది. గత ఆర్థిక సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకుంటే రోజుకు 4800 కోట్ల మేరకు వసూళ్ళతో దేశం మొత్తం పన్ను ఆదాయంలో 57శాతం పైగా జీఎస్టీగానే నమోదయింది. గత ఏప్రియల్ నెలలో 1.68 లక్షల కోట్ల మేరకు అత్యధిక మొత్తంలో జీఎస్టీ వసూలై నూతన రికార్డును నెలకొల్పింది. సమీప భవిష్యత్తులో ఇది నెలకు రెండు లక్షల కోట్ల స్థాయిని దాటుతుందని ఆర్థికవేత్తల అంచనా.
ఇటీవల చంఢఘీర్‌లో రెండురోజుల పాటు నిర్వహించబడిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయాలు, వివిధ వస్తూత్పత్తులను హెచ్చు పన్ను శ్లాబులలోకి మార్చిన వైనం... జీఎస్టీ ఆదాయాన్ని మరింత పెంచి, సాధారణ వినియోగ దారునిపై భారాన్ని మోపనుంది. లస్సీ, మజ్జిగ, పన్నీరు, సహజ తేనె, చేపలు, మాంసం, కూరగాయలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న, మిల్లెట్, బెల్లం, ముడి కాఫీ గింజలు, గ్రీన్‌టీ, గోధుమ ఊక, రైస్ బ్రాన్ ఆయిల్, లెడ్ ల్యాంపులు, లైట్లు, ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్, సోలార్ వాటర్ హీటర్, లెదర్ వస్తుత్పత్తులు, రోడ్లు, భవనాలు, బ్రిడ్జ్‌లు, మెట్రో కాంట్రాక్టులు, ప్రీలేబుల్డ్ రీటైల్ ప్యాక్‌లపై జీఎస్టీ భారం మోపారు.
వెయ్యిరూపాయల మేరకు అద్దె ఉండే హౌటల్ రూమ్లపై, 5000 రూపాయల అద్దె ఉండే హాస్పిటల్ రూమ్లపైన, అట్లాస్, గ్లోబ్, అన్ని రకాల మ్యాప్‌లు, హైడ్రోగ్రాఫిక్ చార్టులు, పెట్రోలియం, మీథేన్‌పై జీఎస్టీ భారాన్ని వేశారు. ఆర్బిఐ, ఐఆర్డిఏ, సెబి, ఎఫ్ఎస్ఎస్ఏఐ సేవలపైనా, చెక్కుల జారీకి బ్యాంకులు వసూలుచేసే రుసుంపై జీఎస్టీ మినహాయింపును ఉపసంహరించటం, భారాన్ని మోపడం జరిగింది. 113 వస్తూత్పత్తుల హేతుబద్దీకరణపై వచ్చిన డిమాండ్‌ను తిరస్కరించి కేవలం 14 వస్తువులు, 22 సేవలమీద మాత్రమే స్పందించారు. మొత్తంగా చూసినప్పుడు మినహాయింపుల జాబితా నుండి, తక్కువ పన్ను శ్లాబు నుండి అనేక వస్తుసేవలు జీఎస్టీ ఆదాయాన్ని పెంచే జాబితాలోకి చేరాయి. హార్స్ రేసింగ్, క్యాసినో, లాటరీలు వంటి వాటిపై 28శాతం పన్ను విధించే అంశాన్ని వాయిదా వేశారు.
వివిధ వస్తూత్పత్తులు, సేవలపై పన్నురేట్లు, పన్ను శ్లాబుల మార్పులు వంటి వాటితో పాటుగా జీఎస్టీ చట్టాలు, విధి విధానాల అమలుకు సంబంధించిన అనేక అంశాలు 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలలో చర్చనీయాంశమైనాయి. కంపోజిషన్ టాక్స్ పేయర్స్ ఈ-కామర్స్ ఆపరేషన్ ద్వారా జరిపే విధివిధానాలు, విలోమ నిధి నిర్మాణం, ఇన్పుట్ ట్యాక్స్ విధానం, ఐజీఎస్టీ పెండింగ్ రిఫండ్ క్లయిముల పరిష్కారం, జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్‌లో జరుగుతున్న జాప్యం, రిటర్న్స్ ఫైలింగ్‌కు తేదీని పొడిగించడం వంటి వివిధ అంశాలపై ఈ సమావేశంలో పలు ప్రకటనలను చేశారు.
సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, అదనపు కస్టమ్స్ డ్యూటీ, రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను, అమ్మకపు పన్ను, వినోదపు పన్ను, విలాస పన్ను, ఆక్ట్రారు పన్ను, ప్రవేశ పన్ను, కొనుగోలు, ప్రకటనల పన్ను వంటి 17రకాల పెద్ద పన్నులను, 13రకాల సెస్‌లను విలీనం చేసి జీఎస్టీ అమలులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ విధాన అమలు ప్రక్రియలో వివిధ రాష్ట్రాలు అనేక పన్ను అధికారాలను వదులుకుని, ఆదాయాన్ని నష్టపోయే పరిస్థితుల నేపథ్యంలో, జీఎస్టీ అమలు నుంచి 5ఏండ్ల పాటు ప్రతియేటా 14శాతం మేరకు పన్ను ఆదాయం పెరుగుతుందనే అంచనా లెక్కలతో, సురక్షిత పరిహారాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం రాష్ట్రాలకు హామీ ఇచ్చింది.
ప్రస్తుత సంవత్సరంతో 5ఏండ్లు ముగుస్తున్న నేపథ్యంలో కరోనా, ద్రవ్యోల్బణం, ఉపాధిలేమి, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరొక ఐదేండ్లు జీఎస్టీ పరిహారాన్ని ఇచ్చే ప్రక్రియను కొనసాగించాలని అనేక రాష్ట్రాలు అభ్యర్ధించినప్పటికీ, ఏవిధమైన నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల రెవెన్యూ షేరింగ్ ఫార్ములాకు మార్పులు చేయాలని ఎన్డీఏ యేతర రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. జీఎస్టీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 7.35 లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చినట్లు కేంద్రం చెబుతుండగా 2021-22 సంవత్సరానికి గానూ డిసెంబర్ నుంచి 4 నెలల కాలానికి 72 వేల కోట్లు జీఎస్టీ పరిహారం చెల్లింపులు ఆగాయని, ఇప్పటి వరకు అంచనా వేస్తే 1.4 లక్షల కోట్ల చెల్లింపులు చేయాలని రాష్ట్రాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రాలు ప్రజల అవసరాలకు తగ్గ మౌలిక వసతులు, ప్రాజెక్టుల అమలుతో ముందుకు సాగాలంటే కేంద్రం నిధులను జాప్యంలేకుండా సత్వరం విడుదలచేయడం అనివార్యం. రాష్ట్రాల నష్ట పరిహార నిధిలో లోటును తీర్చేందుకు కేంద్రం 2021లో 1.1 లక్షల కోట్లు, 2021-22లో 1.59 లక్షల కోట్లు రుణం తీసుకోవడం జరిగిందని పేర్కొంటున్నారు. ఈ వాదనల మధ్య రాష్ట్రాల అధికారాలకు, హక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతోందనే భావనతో పాటు, రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా జీఎస్టీ పయనం కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల ఆదాయ అంతరాలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో, పన్నుల వ్యవస్థ అసమానతలకు జీఎస్టీ ప్రక్రియ పరిష్కారం చూపలేదు. 'ఒకే దేశం-ఒకే పన్ను' నినాదంతో రూపొందిన జీఎస్టీ విధానం, పెట్రోల్, డీజిల్ వంటి అధిక పన్ను భారాల వస్తూత్పత్తులను సమ్మిళితం చేసుకోకపోవడం సంక్షేమ రాజ్య భావనకి విరుద్ధం. ఉన్నత శ్రేణి వినియోగ వస్తువులపై అధిక శాతం పన్ను శ్లాబును వర్తింపచేసే చర్యలు అనివార్యం. పన్నుల వ్యవస్థ ప్రక్షాళన, ప్రభుత్వ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంలో అంతర్భాగమైనప్పటికీ, అంతిమంగా పన్ను చెల్లించే వినియోగదారులు విశాల ప్రజానీకంలో భాగమే అన్న వాస్తవాన్ని విస్మరించలేము. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను మెజారిటీవాదాన్ని పక్కనబెట్టి ఏకాభిప్రాయంతో తీసుకోవాలని సుప్రీంకోర్టు ఉటంకించింది. దీనిపై సానుకూలంగా స్పందించినప్పుడే సమాఖ్య స్ఫూర్తికి సముచిత గౌరవం.
- జి. కిషోర్‌కుమార్
సెల్: 9440905501