Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ వైపు ఆకలి కేకలు.. పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలు కనిపించే మన దేశంలో.. మరోవైపు అధిక బరువుతో ఇబ్బందులు పడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే దర్శనమిస్తోంది. శతాబ్దాల నుంచి మనల్ని పోషకాహార సమస్య వెంటాడుతుండగా.. దశాబ్ద కాలంగా ఊబకాయ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. పూర్తి వ్యతిరేక, విభిన్న సమస్యలను మనదేశం ఒకే సారి ఎదుర్కొంటుండడం గమనార్హం. దీనికి అనేక చారిత్రక, శాస్త్రీయ, జీవన విధానంలో వచ్చిన మార్పులే కారణం. కొన్ని వర్గాల వారికి తినడానికి సరైన ఆహారం దొరకడం గగనమైపోతుంటే.. మరికొందరు పాశ్చాత్య వంటకాలు, ప్యాకేజ్డ్ ఫుడ్ వైపు ఆకర్షితులవుతున్నారు. కొందరికి సరైన పోషకాలు దొరక అలటిస్తుంటే, మరికొందరు చక్కెర, కొవ్వు, మాంసం అధికంగా తీసుకుంటున్నారు. .
పట్టి పీడిస్తున్న పోషకాహార లోపం..
భారతదేశాన్ని అనేక ఏండ్లుగా పోషకాహార లోపం పట్టి పీడిస్తోంది. ఇండియాలో దాదాపు 10.2 కోట్ల మంది పురుషులు, 10.1 కోట్ల మంది మహిళలు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు కలిగి ఉన్నారని, పోషకాహర లోపంతో బాధపడుతున్నారని 2016లో ది లాన్సెట్ జర్నల్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. ఐదేండ్ల క్రితం కంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ పోషకాహార లోపంతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) తాజా గణాంకాలు కూడా చెబుతున్నాయి. 2019-20లో సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను తయారుచేశారు. 2015-16 సర్వేతో పోలిస్తే చాలా చోట్ల పిల్లల్లో పోషకాహార సమస్య బాగా పెరిగింది. ఐదేండ్లకన్నా చిన్న పిల్లల్లో పోషకాహార లోపం 44శాతం నుండి 55 శాతానికి పెరిగింది. బరువు తక్కువ పిల్లల శాతం 7.8 నుంచి 13.4కు పెరిగింది. చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పేదవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. పోషకాహార లోపంతో ఉన్న మహిళలకు పుట్టే పిల్లలు కూడా బలహీనంగానే ఉంటున్నారు. దీనికి కారణం మహిళలకు సరైన పోషకాహారం అందకపోవడమే. దశాబ్దంన్నర క్రితంతో పోల్చుకుంటే దేశంలో పోషకాహార లోపం బాధితుల సంఖ్య తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి వెల్లడించింది. 2004-06 మధ్య దేశ జనాభాలో 21.6శాతం పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 2019-21 నాటికి 16.3శాతానికి దిగి వచ్చిందని తెలిపింది. అయితే గతంతో పోలిస్తే భారతావనిలో ఊబకాయ వయోజనులు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగినట్లు పేర్కొంది. ఆదాయ మార్గాలను పెంచడం, ఉపాధి కల్పించడం, సరైన పథకాలను రూపొందించడం, వాటిని ప్రజల దరికి చేర్చడం, అవినీతికి ఆస్కారం లేకుండా చూడడం ద్వారా పోషకాహార లోపం సమస్య నుంచి బయటపడే అవకాశముంది.
పెరుగుతున్న ఊబకాయ సమస్య
2019-21 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. భారదేశంలోని 23శాతం జనాభా స్థూలకాయంతో బాధపడుతున్న వారే. అయితే నాలుగేండ్ల క్రితం అంటే 2015-16లో ఇది కేవలం 17శాతం మాత్రమే. అంటే నాలుగేళ్లలో ఊబకాయుల సంఖ్య ఆరు శాతం పెరిగింది. అంతేకాకుండా చిన్నారుల్లో సైతం ఊబకాయ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే 2030నాటికి భారతదేశ చిన్నారుల్లో 50శాతం మంది ఊబకాయ సమస్యతో బాధపడుతారని ''వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్'' అంచనా వేసింది.
అధిక బరువుకు అనేక కారణాలు ..
అధిక బరువుకు అనేక కారణాలు మనకు కనిపిస్తాయి. మొదటిది జన్యుపరమైన సమస్యలు. శతాబ్దాల చరిత్రను గమనిస్తే ఇండియా ప్రజలు అనేక కరువు కాటకాలను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇక్కడి ప్రజల శరీరం కొవ్వును ఎక్కువ నిల్వ ఉంచుకునేలా తయారైంది. మరొకటి సాంస్కృతిక కారణాలు.. లావుగా ఉండడాన్ని చాలా మంది సంపద, శ్రేయస్సుకు, ఆరోగ్యానికి చిహ్నంగా భావించడం. ఇవే కాకుండా మరి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. దేశంలో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం పెరగడం. ఇలాంటి వాటిలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనిషి బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ప్రజల స్క్రీన్ టైమ్ పెరగడం. అంటే టీవీ, ఫోన్లు చూసే సమయం ఎక్కువ కావడం. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో పెద్దలు ప్రతి రోజు ఐదు గంటల సమయాన్ని టీవీలు, ఫోన్లు చూడడానికే వెచ్చిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో నిర్వహించిన ఓ సర్వేలో రెండు నుంచి ఐదేండ్ల చిన్నారుల స్క్రీన్ టైమ్ రెండు గంటలుగా తేలింది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజు టీవీ చూసే వారిలో ఊబకాయం వచ్చే ప్రమాదం 21శాతం ఎక్కువని తేల్చింది. ఇంకా పట్టణీకరణ పెరగడం, గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలు పెరగడం, రవాణా సౌకర్యాలు మెరుగవ్వడం, శ్రమను తగ్గించేస్తున్న గృహౌపకరణాలు కూడా అందుకు కారణాలుగానే చెప్పుకోవచ్చు. పట్టణాల్లోనే కాకుండా ఇటీవల గ్రామాల్లో సైతం ఊబకాయ సమస్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం గ్రామాలు, పట్టణాల మధ్య దూరం తగ్గుతున్నా కొద్దీ గ్రామాల్లో ఊబకాయుల సంఖ్య పెరిగిపోతుండడం గమనార్హం.
పరిష్కార మార్గాలు ఇవీ..
కొన్ని మార్గాలను అనుసరించి మనం ఊబకాయ సమస్యను కాస్తంతైనా తగ్గించే అవకాశముంది. అందులో ఒకటి మోతాదుకు మించి చక్కెర ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్పై అత్యధిక పన్ను విధించడం. దీని గురించి నిటి అయోగ్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. అంతేకాకుండా హెల్తీ ప్రొడక్ట్ అంటూ ఆహార పదార్థాల కంపెనీలు ఇచ్చే ప్రకటనలపై మార్గదర్శకాలు విడుదల చేయాలి. దీని వల్ల వాటి వినియోగం తగ్గే అవకాశముంటుంది. ప్రభుత్వం ఊబకాయాన్ని కూడా ఒక వ్యాధిగా గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడం. అయితే వీటన్నింటికి తోడు ప్రతి ఒక్కరు ఆహారం, శారీరక శ్రమ విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటే ఊబకాయ సమస్యను దూరం చేయడం పెద్ద సమస్యేం కాదు.
- ఫిరోజ్ ఖాన్
సెల్:9640466464