Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టుపైనా, న్యాయవ్యవస్థపైనా విమర్శలు పెరుగుతుండటం ఒకటైతే... స్వయానా అత్యున్నత న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. న్యాయ సంబంధమైన పత్రికలలోనైతే మాజీ, ప్రస్తుత న్యాయమూర్తులు వరుసగా పరస్పరం భిన్నంగా కూడా మాట్లాడుతున్నారు. మామూలుగా న్యాయమూర్తులు స్వతంత్రత గురించి, ప్రభుత్వాల జోక్యం గురించి మాట్లాడటం ఎక్కువగా జరిగేది. ఇప్పుడు వారి విమర్శలు పార్టీలపైనా, వ్యవస్థపైనా, మీడియాపైనా, మేధావులపైనా వింటున్నాం. పిటిషనర్లపై తరచూ ఆగ్రహించడం, ఉద్దేశాలు ఆపాదించడం కూడా జరుగుతున్నది. జడ్జిలకు బెదిరింపులు, వక్రీకరణలపై హైకోర్టుల సిజెలు, జడ్జిలు ఆగ్రహించిన సందర్భాలు అనేకం. సీనియర్ న్యాయవాదుల భరించలేని ఆగ్రహం, మాజీ జడ్జిలతో సహా వందల సంఖ్యలో లేఖలు రాయడం సర్వసాధారణమైంది. న్యాయవ్యవస్థలోంచి వచ్చే విమర్శలు ఎక్కువ భాగం జడ్జిలపై దాడులు, సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారాల గురించి ఉంటే... బయిట నుంచి వచ్చే విమర్శలు ఎక్కువగా సుప్రీంకోర్టు తీరుతెన్నులపై ఉంటున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టులు ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చుననే మీమాంసలు ఒకవైపు, కోర్టుల జోక్యం ఏమిటనే రాజకీయ విమర్శలు మరోవైపు చూస్తున్నాం. గతంలో కేసుల పెండింగు, ఖాళీల భర్తీ వంటివే ఎక్కువగా ప్రస్తావనకు వచ్చేవి. సిజెఐ జస్టిస్ ఎన్.వి.రమణ హయాంలో నియామకాల వేగం పెరిగింది. కేంద్రానికి ఇష్టంలేని వారిని, గతంలో తిరస్కరించిన ప్రతిపాదనలను పక్కన పెట్టడం అందుకో కారణం. ఆయన ఈ ఆగస్టులో పదవీ విరమణ చేశాక రిటైర్మెంట్ వయస్సును రెండేండ్లు పెంచుతారనే కథనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
గుజరాత్ మారణకాండపై మోడీ ప్రభుత్వానికి అప్పట్లో సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందనీ, తీస్తా సెతల్వాద్ వంటి హక్కుల కార్యకర్తలే దురుద్దేశంతో దాన్ని కొనసాగించారనీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర విమర్శలకు గురైంది. ఈ తీర్పును ఆక్షేపిస్తూ ఏడుగురు మాజీ జడ్జిలతో సహా 300మంది సిజెఐకి లేఖ రాశారు. ఆమె అరెస్టు తమ తీర్పు ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూ పై వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ విషయంలో వివరణ ఏమీ రాలేదు గానీ, ఈ లోగా నుపుర్ శర్మకు సంబంధించిన వ్యాఖ్యలు వెలువడ్డాయి. జస్టిస్ సూర్యకాంత్ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అయిన నుపుర్ శర్మ ప్రవక్తను దూషించడం, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపడం తెలిసిందే. చివరకు ఆ పార్టీ ఆమెను సస్పెండ్ చేయవలసి వచ్చింది. ఆమె వ్యాఖ్యలపై నిరసనగా ముస్లిం మతోన్మాదులు ఇద్దరిని హత్య చేశారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా ఆమె పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం మీవల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి గనక మీరే క్షమాపణ చెప్పాలని తీవ్రంగా అభిశంసించింది. మీ వల్లనే దేశభద్రతకు ముప్పయితే మీకు భద్రత ఏంటని నిలదీసింది. మీపైన ఎఫ్ఐఆర్ దాఖలైనా మీరు అరెస్టు కాలేదంటే సర్కారులో మీ వంటి వారికి ఎంత పట్టు ఉన్నదీ తెలుస్తుందని జస్టిస్ పార్దీవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను లౌకిక వాదులు సమర్థించారు. ఆమె చర్యలతో ఆ పార్టీయే విడగొట్టుకుంది. కాని సుప్రీంకోర్టు నుంచి ఈ వ్యాఖ్యలు రాగానే ఒక వర్గం విరుచుకుపడింది. న్యాయ శాఖామంత్రి కిరెణ్ రిజిజు స్వయంగా హైదరాబాదులో తమ సమావేశాల సందర్భంలో పరోక్షంగా తమ అసమ్మతి వ్యక్తం చేశారు. ఏం చేయాలో ఆలోచిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం లక్ష్మణరేఖ దాటిందని, అన్ని హద్దులు అతిక్రమించిందని ఆరోపిస్తూ 15మంది మాజీ జడ్జిలు, 75మంది మాజీ బ్యూరోకాట్లు, 25మంది మాజీ సైనికాధికారులు ఉమ్మడిగా సిజెఐ రమణకు లేఖ రాశారు. జస్టిస్ సూర్యకాంత్‌ను ధర్మానసనం నుంచి తప్పించాలని కూడా వారు కోరారు. అందులో భాష, భావం కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. సాంకేతికంగా ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన అరెస్టు చేయకపోవడం తప్పని మీరెలా చెబుతారని మండిపడ్డారు. ఈ పెద్దలెవరికీ గుజరాత్ కేసులో తీర్పు, తీస్తా వంటి వారి అరెస్టులో తప్పు కనిపించకపోవడం ఉన్నతస్థాయిలో మితవాద మతవాద భావజాలం ఎంత వేగంగా వ్యాపిస్తున్నదీ చెబుతుంది. వాస్తవానికి తీస్తా అరెస్టు రోజునే బెంగుళూరుకు చెందిన ఆల్ట్ మీడియా సహ వ్యవస్థాపకుడు జుబేర్ అరెస్టు కూడా జరిగింది.
ఇంచుమించు అదే రోజు అమెరికాలోని శాన్ఫ్రాన్కిస్కోలో భారతీయుల సమావేశంలో మాట్లాడుతూ సిజెఐ జస్టిస్ రమణ మన న్యాయ వ్యవస్థ అత్యంత స్వతంత్రమైనదని చెప్పారు. తాము చేసిన చట్టాలు, నిర్ణయాలు కోర్టులు ధృవీకరించాలని పాలకులు ఆశిస్తారు. వాటిని కోర్టులు వ్యతిరేకించాలని అధికారంలో లేనివారు కోరుకుంటారు. అలా జరగనప్పుడల్లా వారు ఆగ్రహిస్తుంటారు. అవగాహనలేని ప్రజలు వాటిని బట్టి కోర్టులపై అపోహలు పెంచుకుంటారు అన్న అర్థంలో ఆయన మాట్లాడారు. రాజకీయ నేతల, ప్రజల పొరబాటు అవగాహన వల్ల కోర్టులపై, జడ్జిలపై దాడులు చేస్తుంటారు. అయితే న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి తప్ప ఎవరికీ జవాబుదారీ కాదు అని ప్రకటించారు. అమెరికాలో ఈ అవగాహన ఎక్కువగా ఉన్నట్టు, అది సమ్మిళిత సమాజంగా అందరినీ ఆహ్వానిస్తున్నట్టు ప్రశంసించారు. ఇందులో అమెరికా గురించిన ఆయన అభిప్రాయాలు అటుంచి, కోర్టులు రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అయితే... తీర్పులను, న్యాయమూర్తులను విమర్శించడానికే లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పైగా రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని నిర్వచించే అధికారం సుప్రీంకోర్టుకే ఉంటుంది. అంటే తమ తీర్పులపైన కూడా వారే అంతిమ తీర్పులు తప్ప, సమాజం నుంచి ప్రజల నుంచి విమర్శలకు స్పందించాల్సిన అవసరమే ఉండదన్నమాట.
సిజెఐ జస్టిస్ రమణ కోర్టులు జడ్జిల పాత్ర, వారికి భద్రత, వారిపై దాడి చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించడం వంటి విషయాలు చాలా సార్లు చెప్పారు. అయితే జడ్జిలకూ ఆత్మ విమర్శ అవసరం గురించి, తీర్పుల లోపాల గురించి దాదాపు మాట్లాడలేదు. ప్రస్తుత కాలంలో సుప్రీం కోర్టు ప్రాథమ్యాలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయనీ, రాజ్యాంగపరంగా తక్షణం తేల్చాల్సిన చూడాల్సిన అనేక కేసులు ఆలస్యమవుతుంటే... కేంద్రానికి, సంఘ పరివార్‌కు ఆసక్తిగల కేసులు మాత్రం వేగంగా, వారికి సంతోషం కలిగించే విధంగా తీర్పులు పొందుతున్నాయని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో న్యాయమూర్తులు వి.ఆర్.కష్ణయ్యర్, ఓ. చిన్నపరెడ్డి వంటివారు అనుసరించిన ఒరవడి వెనకపట్టు పట్టిందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తులెందరో జడ్జిలకు ఆత్మ విమర్శ అవసరమని పలుసార్లు వివిధ రూపాల్లో చెప్పారు. జస్టిస్ వర్మ అయితే అందరిపై తీర్పు చెప్పే మన తీరుపై ఎవరు తీర్పు చెబుతారు? అని కూడా ప్రశ్నించారు. చిన్నపరెడ్డి వంటివారు వర్గ కోణంలో సుప్రీం ఎటువున్నదీ ఒక పుస్తకమే రాశారు. మతతత్వం ప్రబలిన తర్వాత ఉన్నత న్యాయస్థానాలలో వారే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదంతాలెన్నో. సరళీకరణ యుగంలో న్యాయస్థానాలు కార్మిక హక్కుల పరిరక్షణ కన్నా, యాజమాన్యాల కోణం ఎక్కువగా ప్రతిబింబిస్తున్నాయనీ, ప్రజాస్వామిక హక్కులను ప్రశ్నిస్తున్నాయనీ, ఈ పత్రికలోనూ చాలాసార్లు రాశాం. ఆ విమర్శలు వ్యక్తిగతమైన దాడులు కాదు. జడ్జిల భద్రత చాలా ప్రధానం. అయితే ఈ విధానపరమైన అంశాలను చక్కదిద్దే బదులు జడ్జిల వ్యక్తిగత రక్షణ గురించే మాట్లాడటం, వారిని బాధితులుగా చూపడం పాక్షికమే అవుతుంది. వయోవృద్ధుడైన వరవరరావు ఇప్పుడు బెయిలు రాక పడుతున్న పాట్లు... శారీరక లోపాలు, అనారోగ్యంతో బాధపడే సాయిబాబా వంటివారిని విడుదల చేయకపోవడం చూస్తూనే ఉన్నాం. ఆర్ణబ్ గోస్వామి విషయంలో మరోలా జరగడం కూడా చూశాం. మీడియా, సోషల్ మీడియాలపై తరచూ కోర్టులు అభిశంసన చేయడం, ఉత్తర్వులివ్వడం చూస్తున్నాం గానీ, నిజంగా ప్రజాస్వామ్య విలువలను పాటించినందుకు కూడా నిర్బంధం ఎదుర్కొంటున్నవారి సంగతేమిటి? రాష్ట్రాలలో భిన్న ప్రమాణాలు పాటిస్తున్న కోర్టులు, జడ్జిల మాటేమిటి?
జస్టిస్ పార్దీవాలా కూడా సగం సగం అవగాహనతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారి పట్ల తీవ్రంగా ఉండాలనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. కొద్దికాలం తర్వాత సిజెఐ కాబోయే జస్టిస్ చంద్రచూడ్ కూడా కోర్టులు ప్రజల హక్కులను, ఉపాధిని కాపాడ్డంలో చేయాల్సింది చాలా ఉందని అన్నారు. పోలీసు కేసులు, ఎఫ్ఐఆర్లు, బెయిలు, ముందస్తు బెయిలు వంటి వ్యక్తిగత విషయాల్లో కూడా పరిపరివిధాల తీర్పులు ఉత్తర్వులు చూస్తున్నాం. ఇవన్నీ సాంకేతికంగా ఏమి జరిగిందనేది ఒకటైతే సహజ న్యాయ సూత్రాలేమిటనేది మరో ప్రశ్న. బహుశా వీటన్నిటి ఫలితంగానే సీనియర్ న్యాయవాది, మాజీ మంత్రి కపిల్ సిబాల్ యాభై ఏండ్లుగా తాను భాగస్వామిగా ఉన్న న్యాయ వ్యవస్థ ప్రస్తుత తీరు పట్ల సిగ్గుతో తల వంచుకుంటున్నానని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో మిగిలిన వ్యవస్థల లాగే న్యాయ వ్యవస్థ కూడా ఒత్తిళ్లకు గురైందని, మితవాద ధోరణి పెరిగిపోతున్నదని చాలామంది భావిస్తున్నారు. అమెరికా హైకోర్టు ఇటీవలనే మహిళల గర్భస్రావ హక్కుపై ఇచ్చిన తిరోగామి తీర్పు ప్రపంచమంతటా ఆలోచనాపరులను విచారానికి గురిచేసింది. ఇలాంటప్పుడే మార్క్స్ చెప్పిన ప్రసిద్ధ సూక్తి గుర్తుకు వస్తుంది. 'చట్టం వ్యవస్థపై ఆధారపడి ఉంది తప్ప వ్యవస్థ చట్టంపై ఆధారపడి ఉండదు'. ఇప్పటి వరకూ మనం చెప్పుకున్నవి పైపై ఉదాహరణలే. మన న్యాయ వ్యవస్థపై ముందు ముందు మరింత లోతుగా మధనం జరగాల్సే ఉంది. కోర్టుల స్వతంత్రత, జడ్జిల భద్రత, ప్రజలకు రాజ్యాంగ సూత్రాల ప్రకారం రక్షణ... ఇవే కీలకం కావాలి.
- పీపీ