Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువు వేరు, జ్ఞానం వేరు. చదువు ద్వారా అక్షర జ్ఞానం వస్తుంది. అక్షరాలు తెలియడం వలన పుస్తకాలు, పత్రికలు మొదలైనవి చదువుతాం. తద్వారా మనకు మనదైన సొంత ప్రాంపంచిక జ్ఞానం అలవడుతుంది. ఇది ఒకరకంగా పరోక్ష జ్ఞానం మాత్రమే. 'లడ్డూ తియ్యగా ఉండును' అని చదివినవారికి, నిజంగా లడ్డు తిన్నవారికి కలిగిన జ్ఞానం రెండూ ఒకటి కావు. ఆ అనుభూతులు వేరు. ఆస్వాదనలు వేరు. ప్రతి విద్యార్థికి చక్కటి జ్ఞానం అలవడాలంటే అనుభవ సహిత విజ్ఞానం (ప్రాక్టికల్ నాలెడ్జ్) తప్పనిసరి. అందుకు చదువు (అక్షరం, పుస్తకం, పత్రిక) ఒక వాహకం అవుతుంది తప్ప, కేవలం ఆ 'చదువు' మాత్రమే జ్ఞాన వంతునిగా చేయలేదు. మరి జ్ఞానం ఎలా వస్తుంది? ఇంద్రియాల నుండి లభిస్తుంది. చూడటం, వినడం, మాట్లాడటం, తినడం, వాసన చూడటం, సృర్శించడం - ఈ చర్యల ద్వారా ప్రత్యక్ష జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. మెదడు సమన్వయ పరుస్తుంది. ధృవీకరిస్తుంది. నమోదు చేస్తుంది. తిరిగి వ్యక్తీకరించేందుకు సహకరిస్తుంది.
అయితే ఇంద్రియాల ద్వారా లభించే జ్ఞానాన్ని, తనకు తానుగా పరీక్ష పెట్టుకునేటట్లు విద్యార్థిని సన్నద్ధం చేసేలా బోధనాపద్ధతి ఉండాలి. అప్పుడే అనుభవ సహిత జ్ఞానం అలవడుతుంది. కానీ ప్రస్తుతం ఎక్కువగా బట్టీయం పద్ధతే కొనసాగుతున్నది.
పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు మాస్టారు చెప్పినట్టు బట్టీపట్టడం, పరీక్షల్లో ముక్కు ఛీదినట్టు రాయడం, లేదంటే కాపీలు కొట్టడం, ర్యాంకులు సాధించడం, తద్వారా అర్జంటుగా ఏదో ఒక ఉద్యోగం (తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వచ్చేలా) పొందడం జీవితలక్ష్యంగా మారింది. ఒకరకమైన భద్రమైన జీవితం గడిపేంతవరకే చదువు పరమార్దాన్ని కుదించడం ఎవరికైనా బాధాకరమే. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే... కేంద్రం, జాతీయ విద్యావిధానం - 2020 లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ పాఠ్య (విద్యా) ప్రణాళిక చట్టం రూపకల్పనకు సిద్దమవు తున్నది. దేశ్యాప్తంగా దాదాపు 15లక్షల పాఠశాలలకు సంబంధించి పాతిక కోట్ల మందికి పైగా విద్యార్థులపై ఇది ప్రభావితం చూపనున్నది.
స్వాతంత్య్రానంతరం ఇప్పటి వరకు నాలుగు జాతీయ పాఠ్య ప్రణాళికల ఫ్రేమ్ వర్క్లు రూపొందాయి. ఇది ఐదవది. ఈ రూపకల్పన కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగరాజన్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ ఇప్పుడు నాలుగు భాగాలుగా విద్యను వర్గీకరించింది. 1. శిశువిద్య, 2. పాఠశాల విద్య 3. ఉపాధ్యాయ విద్య 4. వయోజన విద్య.
దేశం నలుమూలల నుండి విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయుల నుండి అభిప్రాయా లను స్వీకరిస్తున్నామని ఈ కమిటీ చెపుతున్నప్పటికీ, కరోనా ఉపద్రవ కాలంలో ఆదరా బాదరగా తీసుకు వచ్చిన ఈ జాతీయ విద్యావిధానం, కేంద్రీకరణ, కాషాయి కరణ, కార్పొరేటీకరణ విధానాలను బలపరిచే విధంగా ఉన్నదనే విమర్శలు అప్పటి నుండి ఇప్పటి వరకు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
ఏ దేశ విద్యా ప్రణాళికైనా ఆదేశ ప్రజల పిల్లలకు (విద్యార్థులకు) సంబంధించిన తక్షణ విద్యావసరాలే కాదు, భావితరాల విద్యా, ఉపాధి అవసరాలు కూడా తీర్చాలి. అంటే దార్శనికతతో కూడిన దిశానిర్దేశం చేయవలసి ఉంటుంది. తదనుగుణమైన విద్యా ప్రమాణాలు పెంచేలా విద్యా ప్రణాళిక ఉండాలి.
కానీ, మన పాఠ్య ప్రణాళికల్లో ఆ విధమైన సహేతుకమైన విద్యాలక్ష్యం ఉండదు. విద్యార్థిని సమగ్ర సమ్మిళిత విద్యావికాసం వైపు నడిపించే దిశగా బోధనా పద్ధతులు ఉండవు. ఎందుకంటే విద్యార్థి కేంద్రంగా అవి సాగవు. కేవలం పాలకుల విధానాలకు ఊడిగం చేసే పద్ధతుల్లోనో, లేదా స్వీయ ఆర్థిక ప్రయోజనాలకో పరిమితం అయిపోతాయి. కారణం బ్రిటిష్ వలస పాలకులకు విద్యా కూలీలను ఉత్పత్తి చేసే లార్డ్ మెఖాలే విద్యా కర్మాగారపు చెప్పుల్లోనే మనం నేటికీ కాళ్ళుపెట్టి నడుస్తున్నాం. అందుకే విద్య ద్వారా నిజమైన సాధికారిత పొంద వచ్చు అనే మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి.
'విలువలతో కూడిన విద్యే నిజమైన విద్య' అని అంబేద్కర్ మహాశయుడు ఏనాడో చెప్పాడు. మరి విద్యార్థుల్లో ఏ విలువలు పాదుకొల్పేందుకు ఈ విద్యా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారో అర్థం కాదు. 'విద్యా సరస్య భూషణమ్' - విద్య సమస్తమునకు అలంకారము. విద్యవలన సహన శీలత సౌకమార్యము చేకూరును' అనే అందమైన పదబంధాలతో విద్యా ప్రణాళిక రూపొందు తున్నట్టు కొందరు చెబుతున్నారు. నిజమే. ఏ అన్యాయాన్నీ, అక్రమాన్నీ ప్రశ్నించ కుండా, ఏ దౌర్జన్యాన్నీ, దుర్మార్గాన్నీ ప్రతి ఘటించ కుండా చూసీ చూడనట్టు మౌనంగా ఉండటమే సహనశీలతా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అర్థవంతమైన, అనుభవ సహిత విద్య ఒనకూరే విధంగా పాఠ్యవిద్యాబోధన ప్రణాళికలు లేనంతవరకు ఎన్ని డిగ్రీలు పిహెచ్డీలు ఉన్నా ఏం ప్రయోజనం? వాస్తవిక ప్రాపంచిక దృక్పథం, సామాజిక మార్పు, జరుగుతున్న పరిణామాలతో సంబంధంలేని పరిమితమైన శుద్ద అశాస్త్రీయ విద్య తిరిగి అజ్ఞానానికి దారితీయదా..?
అసలు ప్రాథమిక విద్య అంటేనే దృఢమైన పునాది. ప్రతి విద్యార్థి శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యంతో ఎదగాలని, అందుకు విద్యా ప్రణాళికలు దోహదపడాలని యునెసెఫ్ వంటి సంస్థలు ఎనాటి నుంచో మొత్తు కుంటున్నాయి. అలాగాక స్వార్థపూరిత రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా రూపకల్పన జరిగితే బాలల హక్కులు హరించడమే కాదు, మన భావితర వినాశనాన్ని మనమే చేజేతులారా కొని తెచ్చుకోవడం అవుతుంది.
- కె. శాంతారావు
సెల్: 9959745723