Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత 70 సంవత్సరాలుగా పేదలు, వ్యవసాయ కార్మికులు, దళితులు అనుభవిస్తున్న ఇనాం భూములను, గత ప్రభుత్వాలు పేదల కోసం ఇచ్చిన ఇండ్ల స్థలాలను తిరిగి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్న పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు అతి ఉత్సాహంతో భూములను బలవంతంగా లాక్కుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదేమిటి అని ప్రశ్నించిన పేదలపై కేసులు పెడుతున్నారు. తాతలు, ముత్తాతలు, తండ్రుల నుండి వారసత్వంగా వస్తున్న ఇనాం భూములను సైతం ప్రభుత్వ అవసరాల పేరుతో బలవంతంగా తీసుకుంటున్నది. ప్రజలు వ్యతిరేకిస్తే అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారు. దీనికి గ్రామాల్లో ఉన్న అధికార పార్టీ నాయకులు గుడ్డిగా మద్దతు ఇవ్వడంతో పేదలు ఇన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూమిని కోల్పోతున్నారు. మరో పక్క గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 1992 నుండి 2000 సంవత్సరం వరకు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇండ్ల నిర్మాణానికి (బలహీన వర్గాల కాలనీ ఏర్పాటుకై) రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా భూమిని కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. అయితే కొన్ని గ్రామాలలో పేదల ఇండ్ల నిర్మాణం కోసం భూములను కొనుగోలు చేశారు తప్ప, లబ్ధిదారులను గుర్తించి పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇచ్చిన దగ్గర లేఅవుట్ చేయలేదు. పట్టాలు ఇచ్చి లేఅవుట్ చేసిన దగ్గర లబ్ధిదారులకు కేటాయించిన స్థలాన్ని చూపించలేదు. లబ్ధిదారులను గుర్తించి పట్టాలు ఇచ్చి స్థలం చూపించిన దగ్గర ఇండ్లు మంజూరు చెయ్యలేదు. అలాగే మౌలిక సమస్యలైన తాగునీరు, సీసీ రోడ్లు, కరెంటు వంటి వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇండ్లను నిర్మించుకోలేకపోయారు. దీంతో ఆ స్థలాలు సుమారు 30ఏండ్లుగా ఖాళీగా ఉంటున్నాయి. ఇదే అదునుగా భావించిన ప్రభుత్వం, అధికారులు, అధికార పార్టీ నాయకులు కేటాయించిన ఇండ్ల స్థలాలలో ఇండ్లు మంజూరు చేయకపోగా, వాటిని ప్రభుత్వ అవసరాల పేరుతో గుంజుకుంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం లోనైనా తమకు ఇల్లు వస్తుందని ఆశపడిన పేదలకు నిరాశా మిగిలింది. గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల గూడులేక రాష్ట్రంలో 22లక్షల మంది పేదలు ఇబ్బందులు పడుతుంటే, ఆ ఇబ్బందిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం... గతంలో ఇంటి నిర్మాణానికి కేటాయించిన స్థలాలను అభివృద్ధి పేరుతో బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమైన చర్య. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో డబల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మాణం ప్రారంభించి ఎనిమిదేండ్లు అవుతున్నా నేటికీ వివిధ దశలలో ఉన్నాయి తప్ప పూర్తి కాని పరిస్థితి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పటికి పూర్తి అవుతాయో తెలియని స్థితి. దీన్ని బట్టి దళిత, బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. ప్రభుత్వం ఇకనైనా సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని ఆశిద్దాం...
- మట్టిపల్లి సైదులు
సెల్:8106778287