Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు అయింది. దేశ స్వాతంత్రం కోసం అనేక మంది వివిధ రూపాల్లో పోరాడారు. 1857లో తొలిసారిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు తిరుగుబాటు చేశారు. దీనినే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అని అంటారు. అయితే ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనలేదు. ''ది గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా''గా పేరు పొందిన దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ వారు భారత దేశాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో వివరంగా తెలిపారు. బాల గంగాధర్ తిలక్, మోతిలాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవ్య వంటి ఆనాటి నాయకులు స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపారు. 1915 తర్వాత దేశంలో గాంధీ శకం మొదలైంది. జలియన్ వాలబాగ్ ఉదంతం అనంతరం, రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదలైన అతి పెద్ద ఉద్యమం ఇదే. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. చౌరీచౌరాలో జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో గాంధీ ఈ ఉద్యమాన్ని ఆపివేశారు. అప్పుడే భగత్ సింగ్ వంటి ఆనాటి యువ కిశోరాలు దేశ స్వాతంత్రం కోసం విప్లవబాట పట్టారు. దేశ వ్యాప్తంగా చంద్రశేఖర్ ఆజాద్, సూర్య సేన్, సుభాష్ చంద్రబోస్, ఉద్దాం సింగ్, అల్లూరి సీతారామ రాజు వంటి వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దేశం కోసం పోరాడిన యోధులని స్మరించుకోవాల్సిన సమయ మిది. కానీ, వీరు చేసిన త్యాగాలను స్వాతంత్య్ర ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేనివారు తమ ఖాతాలో వేసుకొని రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు. పూలే, అంబేద్కర్ వంటి మహనీయులు దేశంలో తరతరాలుగా హక్కులు కోల్పోయిన నిమ్న వర్గాల ప్రజల కోసం పోరాడితే, సుభాస్ చంద్రబోస్, భగత్‌సింగ్ వంటి నాయకులు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలని త్యాగం చేశారు. నాటి పోరాట యోధులను, విప్లవకారు లను సముచిత రీతిలో గౌరవించుకోవాల్సిన తరుణమిది.
- ఎం. రాంప్రదీప్,
సెల్:9492712836