Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెమెరా ఓ దృశ్యాన్ని బంధిస్తుంది. ఆ దృశ్యం అందమైనది కావచ్చు, ఆకట్టుకునేది అవచ్చు, దుఃఖపరిచేది కావచ్చు... కానీ, గుండెల్లో తడి ఉన్న ప్రతి హృదయాన్ని కన్నీరు పెట్టించే దృశ్యాలు మాత్రం అరుదుగానే ఉంటాయి. అవి ఆ సమాజపు స్థితి గతులను కూడా ప్రతిబింభిస్తాయి. అలాంటి దృశ్యం ఒకటి ఇటీవల న్యూస్ ఛానల్లలో, వార్త పత్రికల్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నిజంగా రచయిత అన్నవాడు ఆ దృశ్యం చూసి ప్రశాంతంగా ఉండలేడు. ఇంకేముంది కలం పట్టుకుంటే వణుకుతున్న చేతులు, ఉబికి వస్తున్న ఉద్వేగంతో అక్షరధార... రక్తలేమితో బాధపడుతూ చనిపోయిన ఓ రెండేళ్ల బాలుడుది ఆ దృశ్యం ఇది. ఈ విశాల భూగోళంలో ఓ మారుమూల ప్రాంతంలో చిన్న సంఘటనే కావచ్చు గాక... కానీ, 75 సంవత్సరాల సంతంత్య్ర భారతావనిలో ఆహారభద్రతను, ప్రజా రోగ్యాన్ని ప్రశ్నిస్తుంది. హారభద్రత, ప్రజారోగ్యం ప్రజలకు అందకుండా ఓ నీటి మూటగా, కలగా ఎలా మిగిలి పోయాయో ప్రపంచానికి తెలియజేసింది.
నాగరికతను నిలువెల్లా నింపుకున్న ఈ ఆధునిక సమాజంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. అంబా జిల్లాలోని బాద్ గ్రామానికి చెందిన ఓ రెండేండ్ల బాలుడు రాజా అనారోగ్యంతో ఉంటే, తండ్రి మారేనా జిల్లా ఆసుపత్రిలో చేర్చాడు. పూజారామ్ (తండ్రి) చేతిలో చిల్లి గవ్వలేదు. మరోకొడుకు గుల్హన్ను తమ్ముడికి కాపలావుంచి, విలవిలలాడుతూ తండ్రి డబ్బుకోసం తిరిగి ఇంటికి పరుగు తీసాడు. ఈలోపు రక్తహీనత, కడుపునొప్పితో బాధపడుతూ ఆ బాలుడు చనిపోయాడు. తమ్ముడి శవంతో గుల్హన్ అక్కడే తండ్రి రాక కోసం ఎదురుచూస్తూ, అతడొచ్చేవరకు బిక్కుబిక్కుమంటూ కూర్చొన్నాడు. తమ్ముడి మృతదేహంపై తెల్లని గుడ్డ కప్పి, ఈగలు వాలకుండా చూసుకుంటూ అలాగే ఉండి పోయాడు. నిన్నటి వరకు తనతో కలసి ఆడుకున్న తమ్ముడు ఇక లేడని ఏడుస్తున్న గుల్హన్ను చూసి జనం గుమిగూడారు. బాలుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆ దృశ్యాన్ని స్థానిక జర్నలిస్టు ఒకరు ఫొటోలు తీసాడు. ఆ సమాచారం పోలీసులకు తెలిసింది. పోలీసు అధికారి యోగేంద్రసింగ్ ఆసుపత్రి అధికారులతో మాట్లాడి వాహనం ఏర్పాటు చేశారు. బాధితులను వారి స్వగ్రామానికి పంపించారు. ఈ కర్మభూమిలో ఓ పసిబిడ్డ చావుకు లభించిన విలువ ఇది.
ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఏదేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ దేశమైనా అభివృద్ధి చెందటం అసాధ్యం. పేదరికానికి, అనారోగ్యానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ దేశంలో పోషకాహార లోపం వల్ల వచ్చే రోగాలే అధికమని సర్వేలు చెబుతున్నాయి. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల్లో 67శాతం పోషకాహార లోపంతో, 90శాతం గర్భిణీలు రక్త హీనతతో బాధపడుతున్నారు. ప్రతి వెయ్యిమంది పిల్లల్లో సంవత్సరంలోపు చనిపోతున్నవారి సంఖ్య 74. దేశం మొత్తంలో బాల్య దశలో మరణాల సంఖ్యను పరిశీలిస్తే ఐదో వంతు మంది పిల్లలు చిన్న తనంలోనే చనిపోతున్నారు. పట్టణ ప్రాంతాల కన్నా పల్లె ప్రాంతాలలో శిశు మరణాల రేటు ఎక్కువ. శిశు మరణాలకు ప్రాధమిక కారణం పోషక ఆహారం లభించకపోవటం. ఈ లోపం వలన తల్లులకు బరువు తక్కువ పిల్లలు పుడుతున్నారు. ఫలితంగా పచ్చకామర్లు, డయేరియా, రక్త హీనత, నిమోనియా వంటి వ్యాధులతో పిల్లలు చనిపోతున్నారు. భావితరాలైన పిల్లల మరణాలు మానవ వనరుల విధ్వంసానికి ప్రతీక. భవిష్యత్ సామాజిక ఉత్పత్తికి విఘాతం. మానవ వికాసానికి పెద్ద ఆటంకం. మానవ సమాజాన్ని పీడిస్తున్న పేదరికం, దారిద్రానికి నిదర్శనం. పాలకుల బూటకపు ప్రజారోగ్య సంక్షేమానికీ, జీవించే హక్కు నిరాకరణకు నిలువెత్తు సాక్ష్యం.
గోరు ముద్దలు పెట్టి పాలు తాపించిన మాతృమూర్తి కలలు కల్లలు అవుతున్న వేళ... కన్న తల్లి ఒడి చేరకముందే కాటికి చేరుతున్న పసికందుల మరణఘోష ఇది. ఈ విషాద పరిణామాలకు అంతమెక్కడా...? ఈ పసికందుల మరణాలకు మూలం లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాలు కాదా..?
కరోనా తర్వాత పేదల స్థితి గతులు మరింత దిగజారి పోయాయి. పోషకాహారం కరువైపోయింది. మరోవైపు పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. పెరుగుతున్న ధరలతో, రిటైల్ ద్రవ్యోల్బణం గత ఎనిమిదేండ్లలో గరిష్టస్థాయి 7.79శాతానికి చేరుకుంది. ఒక వంట గ్యాసు ధరే తీసుకుంటే 2014లో ఒక సిలిండర్ ధర రూ.400లు. ఇది ఇప్పుడు (2022) రూ.1155లు. ఇలా ఈ ఎనిమిదేండ్లలో నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరుకున్న ఫలితంగా ప్రజలు కనీస పోషక ఆహారం కూడా కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక-2022 ప్రకారం 71శాతం మంది భారతీయులు ఆరోగ్యకరమైన భోజనాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు. అంటే పండ్లు, కూరగాయలు, గింజ ధ్యాన్యాలు, మాంసకృత్తులు, మొదలైనవి పొందలేకపోతున్నారు. ఫలితంగా పోషకాహార లోపంతో భారతదేశంలో ప్రతి ఏటా 17లక్షల మంది చనిపోతున్నారని నివేదిక వెల్లడించింది. సమతుల ఆహారం కొనుగోలు చేయలేనివారు ప్రపంచంలో 42శాతం మంది ఉంటే, భారత్లో ఆ సంఖ్య 71శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆకలి సూచిలో మనం అత్యంత దిగువ స్థాయిలో ఉన్నాం. 116 దేశాలలో సర్వే జరపగా భారతదేశం 103వ స్థానంలో ఉంది. ఇది సిగ్గుచేటు. ఈ పరిస్థితుల మూలంగా ప్రజలు వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు నాణ్యమైన వైద్యమూ ప్రజలకు దూరమై పోయింది. 1991లో మొదలైన ప్రపంచీకరణ విధానాల కారణంగా విద్యా, వైద్యం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు వైదొలిగాయి. పైగా ఆరోగ్యశ్రీ పథకాల పేరుతో ప్రభుత్వాలు ప్రజాధనాన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెడుతున్నాయి. నిధులన్నీ అటుపోగా, ప్రభుత్వాసుపత్రులు కనీస సౌకర్యాలులేక కునారిల్లుతున్నాయి. బాధ్యతలేని అసమర్థ పాలకుల వలన సామాన్య ప్రజలు ముఖ్యంగా పసిపిల్లలు కన్నుమూస్తున్నారు. దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితి ఇది. ఏ సమాజంలోనైనా ఆరోగ్యంగా జీవించటం అన్నింటికంటే ప్రథమం. అందుకు ప్రాధమిక అవసరాలైన మంచినీరు, పోషకాహారం, విద్య, పరిశుభ్రత, మంచి పర్యావరణ వాతావరణం ఉండాలి. ప్రతి మనిషి మానసికంగా, శారీరకంగా, సామాజికంగా బాగుండాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పగలం. ఇది ఒక సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలోనే సాధ్యమవుతుందని నిరూపించిన దేశం క్యూబా. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రపంచానికే క్యూబా ఆదర్శమని ప్రపంచ ఆరోగ్య సంస్థే ప్రకటించింది. కాబట్టి, అలాంటి ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే ఇప్పుడు ఈ దేశ ప్రజల తక్షణ కర్తవ్యం.
- షేక్ కరిముల్లా
సెల్: 9705450705