Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూపాయి కల చెదిరినట్టుంది
కన్నీళ్ళు కార్చే ఓపికా పోయినట్టుంది
కలవరింతల కథలు వెల్లువెత్తుతున్నాయి.
బంగారు బాతుల కోత ఆగలేదు
ఎక్కడా బంగారు గుడ్డు దక్కలేదు
దేశమంతా రక్తం మడుగుల తడే మిగిలింది.
నియంత్రణ తప్పించి
పెట్రో ధరలు పరుగెత్తించారు
సరుకులు తగలబడి
సామాన్యుడిని ధరల బ్రాయిలర్లో వేయించాయి
జేబులన్నిటికీ చిల్లులు పడినట్టున్నాయి
కొని తినే శక్తిపై కత్తివేటు పడింది
కొనే వాళ్ళు కరవైనట్టుంది
పరిశ్రమ చక్రం తిరగలేక ఆగింది.
గోరుచుట్టుపై రోకటి పోటు పడిందేమో
మాంద్యం తుఫానుకు ఉపాధి చెట్టు కూలింది
ఊడిన ఉద్యోగాలు కట్టలు తెంచుకుపడ్డాయి
జీతాల కోత కాంట్రాక్టు పనులయ్యాయి
తట్టుకోలేని పాలక రూపాయి
పరిశ్రమను లేపే ఉద్దీపన చికిత్స చేసింది
తలనొప్పి జబ్బుకు మోకాటికి మందేసింది
అందుకే క్రేన్లు తెచ్చినా ఉపాధి వృక్షం కదల్లేదు
పనులు చూపే పథకాలులేని పాలన
షేర్ మార్కెట్లో పెట్టుబడులకు తప్పిన లాభం
జ్వరం తీవ్రమై చలి జ్వరంగా మారినట్టుంది
ఇప్పుడు లాభమనే వైద్యం కోసం
విదేశాలకు పరుగు పెడుతున్నాయి
ముందు స్వేచ్ఛా రెక్కలున్న
ఎఫ్ఐఐలు ఎగిరి పోతున్నాయి
రేపు పరిశ్రమల్లో పాతుకుపోయిన
ఎఫ్.డి.ఐ.లదీ ఇదే బాట కావచ్చు.
సంక్షోభం చమురు అంటుకోబోతుందా?
జోస్యం చెప్పలేం... అలాగని
దిగజారిన రూపాయి కథను కప్పలేం
విదేశీ నిధుల గళ్ళాపెట్టె ఖాళీ అవుతోంది
దిగుమతులకు నిధులు లేక
విదేశీ సరుకులు దుకాణాల్లో
దోబూచులాడుతున్నాయి
సరుకుల కొరత, ధరల పరుగు
సామాన్యుడి బతుకు ఓటమి
నిత్యం మార్కెట్ కలవరింతైంది
దీనికి మందేసే డాక్టర్ల కొరత ఏర్పడింది.
మూలం బంగారు బాతును కోసి
కార్పొరేట్లకు వడ్డించడం
ఈ కథ జనం గుండెను తాకే వరకే
పాలకుల పాచికలాట చెల్లుబాటవుతుంది.
- ఉన్నం వెంకటేశ్వర్లు