Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూలై 18వ తేదీన భారతదేశం తన నూతన రాష్ట్రపతిని ఎన్నుకోబోతుంది. నూతన రాష్ట్రపతి జూలై 25వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే, నేడు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఒక రాజకీయ విన్యాసంగా మారింది. దీనిలో చాలా లోతైన రాజకీయపరమైన లెక్కలు ఉంటాయి. ఈ కారణంగానే నేడు పాలక పార్టీ చేపట్టిన ఎంపిక పట్ల దేశం మొత్తం ఆశ్చర్యానికి లోనవుతుంది. కానీ ఒకసారి రాష్ట్రపతి ఎన్నికయిన తరువాత ఈ భావోద్వేగాలు మాయమవుతాయి. ఆ తరువాత ఐదు సంవత్సరాల వరకు రాష్ట్రపతి భవన్పైన ఎవరూ దృష్టి సారించరు.
ప్రాముఖ్యత గల అంశం
అయినప్పటికీ, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో, భారతదేశానికి ఎటువంటి రాష్ట్రపతి అవసరం అనేటువంటి ప్రశ్నకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత పాలక పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థే రాష్ట్రపతిగా ఎన్నికవనున్నారనేది వాస్తవం. అయినా, ఒక దేశం నూతన రాష్ట్రపతిని ఎన్నుకునే సందర్భంలో సమర్థత ఆధారంగా అభ్యర్థికున్న గౌరవం, నైతికత, ఆ అభ్యర్థి పట్ల ప్రజలకున్న అంగీకారం మొదలైన అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది.
ముందుగా రాజ్యాంగం ద్వారా ఏర్పడిన రాష్ట్రపతి పదవిని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. రాజ్యాంగ పరిషత్తులో రాష్ట్రపతి పదవిపై చాలా చర్చ జరిగింది. భారతదేశానికి ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రపతి అవసరమా? లేక పరోక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రపతి అవసరమా? అనేది ప్రధానమైన అంశంగా చర్చ జరిగింది. రాజ్యాంగ పరిషత్, రాష్ట్రపతి పరోక్షంగా ఎన్నుకోబడే విధానానికే మొగ్గు చూపింది. ప్రొఫెసర్ కే.టీ.షా లాంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాష్ట్రపతిని ప్రత్యక్షంగానే ఎన్నుకోవాలని వాదించారు. ప్రధానమంత్రికి, గ్రామ్ ఫోన్ లాంటి రాష్ట్రపతి కావాలని రాజ్యాంగ పరిషత్ కోరుకుంటుందా అని, వాక్చాతుర్యంతో కూడిన ఒక ప్రశ్నను షా అడిగాడు. ''మన రాష్ట్రపతి ఎటువంటి అధికారం లేకుండా కేవలం నామమాత్రంగా ఉండే దేశంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి. ఆయన/ఆమెకు ఏ విధమైన విచక్షణ అధికారాలు ఉండవు, పాలనాపరమైన అధికారాలేమీ ఉండవని'' డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు.
కానీ, భారత రాష్ట్రపతి ఎటువంటి అధికారం లేకుండా కేవలం నామమాత్రంగా ఉండే దేశంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించే వ్యక్తేనా? ''కేంద్రం యొక్క కార్యనిర్వహక అధికారం రాష్ట్రపతికి చెందుతుంది, ఆయన ప్రత్యక్షంగా లేదా ఆయనకు లోబడి పనిచేసే అధికారుల ద్వారా ఆ అధికారాన్ని రాజ్యాంగం ప్రకారం ఉపయోగిస్తారని'' భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 తెలియజేస్తుంది. అంటే రాష్ట్రపతి ఈ అధికారాలను కేంద్ర మంత్రిమండలి సలహాతో అమలు చేస్తాడని అర్థం. ఇది, మంత్రి మండలి గీసిన గీతకు లోబడి సంతకం చేసే రాష్ట్రపతి మనకెందుకు అనే భావనను ప్రజలలో కలిగిస్తుంది. గతంలో కొంతమంది రాష్ట్రపతులు పని చేసిన విధానం ప్రజల యొక్క ఈ భావనకు ఊతమిచ్చే విధంగా ఉంది. కానీ, కొంతమంది మన రాష్ట్రపతులు భారత రిపబ్లిక్లోని రాష్ట్రపతి పదవిలో ఉన్న చిక్కులను చాకచక్యంగా పరిష్కరించడంలో అంచనాలకు తగ్గట్టుగా పని చేశారనే విషయాన్ని కూడా మనం మరచిపోకూడదు.
ఎన్నిక విధానం, ప్రజల పాత్ర
ముందుగా రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే... ఇది పరోక్ష ఎన్నిక. అంటే... రాష్ట్రపతిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోరని అర్థం. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం, ఎలెక్టోరల్ కాలేజీలో సభ్యులైన, పార్లమెంట్ ఉభయసభలకు ఎన్నుకోబడిన ఎంపీలు, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నుకోబడిన ఎంఎల్ఏలు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ ఓటు విలువ, దానిని లెక్కించే విధానానికి ప్రాధాన్యత ఉంటుంది. ఒక ఎంఎల్ఏ ఓటుకు కొంత విలువ ఉంటుంది. 1971 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాను, మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య చేత విభజిస్తే వచ్చిన భాగ ఫలాన్ని తరువాత వెయ్యి చేత భాగించడం ద్వారా ఎంఎల్ఏ ఓటును లెక్కిస్తారు. ఉదాహరణకు, ఈ రకంగా లెక్కించడం ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంఎల్ఏ ఓటు విలువ 208.
ఈ ఓటు విలువను లెక్కించడంలో రాష్ట్ర జనాభాకు చాలా ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, రాష్ట్రపతి ఎన్నికలో దేశ జనాభా చాలా కీలకమైన అంశంగా ఉంటుంది, అంటే రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో ప్రజల పాత్ర ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రాష్ట్రపతికి విస్తృతమైన పునాదిని ఏర్పరచడంతో పాటు రాష్ట్రపతికి ఒక గొప్ప నైతిక అధికారాన్నిస్తుంది. కాబట్టి భారత రాష్ట్రపతి కేవలం ఒక రబ్బర్ స్టాంప్ కాదు, కాలేరు. ఆయన/ఆమె ప్రత్యక్షంగా కేంద్ర కార్యనిర్వహక అధికారాలను ఉపయోగించరు కానీ, కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలతో విభేదించవచ్చు, వారిని హెచ్చరించవచ్చు, వారికి సలహా ఇవ్వవచ్చు. మంత్రిమండలి చేసిన నిర్ణయాలను రాష్ట్రపతి పునఃపరిశీలన చేయమని కోరవచ్చు. పునఃపరిశీలన చేసిన తరువాత ఒకవేళ మంత్రి మండలి ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకుండా అవే ప్రతిపాదనలను తిరిగి పంపిస్తే, అది వేరే సంగతి. రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ప్రభుత్వంలోని కేబినెట్ వ్యవస్థలో ప్రభుత్వ నిర్ణయాలకు బాధ్యత వహించాల్సింది మంత్రి మండలి. రాష్ట్రపతి తాను ఆమోదం తెలిపిన నిర్ణయాలకు వ్యక్తిగతంగా ఎంత మాత్రం బాధ్యత వహించరు.
కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, రాష్ట్రపతి మంత్రి మండలి నిర్ణయాలతో విభేదించవచ్చు, వాటిని పునఃపరిశీలన చేయమని కోరవచ్చు. భారత రాజ్యాంగం, రాష్ట్రపతి జాగరూకుడై ఉండాలని, ప్రతిస్పందన కలిగి ఉండాలని కోరుకుంటూ, కార్యనిర్వహకుల సంకుచిత రాజకీయ ప్రభావం లేకుండా చేయడంలో అతడు/ఆమెకు స్వేచ్ఛను ఇస్తుంది.
ఈ విషయం, రాష్ట్రపతి తన పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో చేసే ప్రమాణాన్ని పరిశీలిస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ''రాజ్యాంగాన్ని కాపాడతానని, భారత దేశ ప్రజల శ్రేయస్సుకు, సేవలకు అంకితమై పని చేస్తాన''నే రెండు వాగ్దానాలు రాష్ట్రపతి ప్రమాణంలో ఉంటాయి. ప్రధానమంత్రికి, రాష్ట్రపతి ఒక గ్రామ్ ఫోన్ అనే ప్రొఫెసర్ కే.టీ. షా వ్యాఖ్యల ప్రకారం పైన చెప్పిన విధంగా ప్రమాణం చేసిన రాష్ట్రపతి తన బాధ్యతలను నిర్వహించలేరు. కానీ, రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడతాడు? ఇది చాలా కష్టతరమైన విషయం. కార్యనిర్వాహక వర్గం దేశంలోని పౌరుల స్వేచ్ఛను, హక్కులను కాలరాస్తున్న సందర్భంలో మన రాష్ట్రపతులు సాధారణంగా తాము ప్రమాణంలో చేసిన వాగ్దానాల గురించి ఆలోచించడం లేదు. భారతదేశంలో వలే అధికారాన్ని కేంద్రీకరించే కార్యనిర్వహక వర్గాలున్న ప్రజా స్వామిక దేశాలు ప్రపంచంలో కొన్నే ఉన్నాయి. ఈ రకమైన ధోరణి 1970లలో మొదలై, సంవత్సరాల కాలం గడిచే కొద్దీ కార్యనిర్వహక వర్గం ఓ పెద్ద బలమైన వ్యవస్థగా పెరిగింది.
దృష్టి కోణం
కాబట్టి, సర్వశక్తివంతమైన కార్యనిర్వహక వర్గం దేశ పౌరుల స్వేచ్ఛను, హక్కులను కాలరాసేందుకు పూనుకున్నపుడు, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన రాష్ట్రపతిని కలవాలని ప్రజలు సాధారణంగా ఆలోచించరు. దానికి ప్రధానమైన కారణం ఏమంటే, దేశ పౌరులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హామీలు, సమన్యాయం మితిమీరిన ఉల్లంఘనకు గురైన సందర్భంలో కూడా దుఃఖంలో ఉన్న ప్రజల తరఫున రాష్ట్రపతులు సాధారణంగా జోక్యం చేసుకోరు. అయితే కొన్ని ప్రభుత్వ విధాన నిర్ణయాలను బహిరంగంగా విభేదించి, ప్రభుత్వా లపై తీవ్రమైన ప్రభావం చూపిన రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకష్ణన్ లాంటి కొందరు రాష్ట్రపతులు కూడా మనకు ఉన్నారు. ఆ విధంగా ప్రభుత్వంతో విభేదించి, క్రూరమైన పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున జోక్యం చేసుకుని, ప్రభుత్వం తప్పుడు మార్గాలను విడనాడాలని నచ్చజెప్పడం రాష్ట్రపతికే సాధ్యపడుతుంది. వారు చేసిన ప్రమాణం, వారితో అలా చేయించాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తులు మాత్రమే రాష్ట్రపతి స్థాయికి ఎదగగలరు. మిగిలిన వారు కేవలం రాష్ట్రపతి కార్యాలయ నిర్వాహకులు మాత్రమే. భారతదేశానికి రాష్ట్రపతులు అవసరం గానీ, రాష్ట్రపతి కార్యాలయ నిర్వాహకులు కాదు.
- పీ.డీ.టీ ఆచారి
(వ్యాసరచయిత లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్)
(''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451