Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక మహావిపత్తు మానవాళికి అనివార్యంగా ఎంతో నేర్పింది. కరోనా కల్లోలంతో మనిషి జీవనశైలిలో అపార మార్పులు తెలియకుండానే చోటు చేసుకున్నాయి. వర్క్ ఫ్రమ్ హౌమ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఈ-వ్యాపారాలు, ఈ- వైద్య సేవలు లాంటి అనేక రంగాలను పరిచయం చేయడం జరిగిపోయింది. అనేక నూతన వ్యాపారాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రత్యేకించి గృహ-ఆధార వ్యాపారాలకు ఆదరణ పెరిగి కొనసాగు తున్నాయి. ఇలా ఇంటి నుంచి వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తలను 'ఎంటర్ప్య్రూనర్ ఫ్రమ్ హౌం' లేదా 'హౌంప్య్రూనర్స్'గా చెపుతున్నారు. నేడు దేశవ్యాప్తంగా దాదాపు 80శాతానికి పైగా హౌంప్య్రూనర్స్ మహిళలే కావడం విశేషం. గృహ కేంద్రిత వ్యాపారాల స్థాపన, సమర్థవంతమైన నిర్వహణ, ఆన్లైన్ అమ్మకాలు, నిర్వహణలో ఎదురయ్యే అవరోధాలను పరిష్కరించడానికి మహిళలచే నిర్వహించబడుతున్న 'ఘరోబార్ (ఘర్ సే కారోబార్)' లాంటి సంస్థలను నెలకొల్పడం కూడా ఔత్సాహికులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాయి.
కరోనాతో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలు ఇంటి నుంచే వ్యాపారాలు ధీటుగా నిర్వహి స్తుండటం గమనార్హం. వంటింటి కుందేలని హేళన చేసిన సమాజమే నేడు గృహ-ఆధార వ్యాపారా లను చేస్తున్న మహిళను చూసి ఆశ్చర్యపడుతూ ముక్కున వేలేసుకుంటున్నది. వస్త్రాలంకరణ, వస్త్ర విక్రయ కేంద్రాలు, ఫాషన్ డిజైనింగ్, గృహౌ పకరణాలు, హస్తకళలు, పర్స నాలిటీ డెవలప్ మెంట్, బేకింగ్, కుకింగ్, యోగా, ఫిట్నెస్, హౌమ్ ఫుడ్స్ లాంటి పలు వ్యాపారాలను మహిళ లు ఇంటి నుంచే నిర్వహిస్తుండటం ఓ కొత్త పరిణామం. వీటికి తోడుగా టెక్నాలజీ ఆధారిత స్టార్ట్అప్లు, విలక్షణ అవకాశాలనూ మహిళా మణులు అందిపుచ్చు కుంటూ పురుషులకు ధీటుగా లక్ష్యాలను చేరుకుంటున్నారు. ఇలాంటి గృహ-ఆధార వ్యాపారాలతో నిరుద్యోగం తగ్గడం, మహిళ లకు స్వేచ్ఛ పెరగడం, లింగ అసమానతలు తగ్గడం తో పాటు దేశ ఆర్థికాభివృద్ధికీ ఊతం లభిస్తుంది.
కాబట్టి, గృహ-ఆధార మహిళా వ్యాపారాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, సమాజం ముందు కు రావాలి. మహిళా సాధికారత సాధనకు తోడ్పాటు నివ్వాలి. నేటి అనేక బహుళజాతి కంపెనీలు ప్రారంభంలో గృహాల్లో, ఇంటి గ్యారేజీల్లో ప్రారంభిం చబడినవే అని గుర్తు చేసుకోవాలి. మార్కెట్ సరళిని అధ్యయనం చేసి, డిజిటల్ సాంకేతికతను జోడించి, సృజనకు పెద్ద పీట వేసి గృహ సంబంధ వ్యాపారా లను ప్రారంభించడానికి మహిళలకు అవసరమైన అవకాశా లనూ, తగిన శిక్షణనూ అందుబాటులోకి తేవాలి.
డా: బి.ఎం.రెడ్డి, సెల్:9949700037