Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు తమ మెదళ్లకు పదును పెడుతున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి నాయకులను ఆకర్షించేందుకు పథక రచన చేస్తున్నారు. తద్వారా ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆయ పార్టీల నాయకులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా చేరికల కమిటీలేశాయి. కాంగ్రెస్‌కు మాజీ మంత్రి కె. జానారెడ్డి, బీజేపీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను చైర్మెన్లుగా నియమించాయి. టీఆర్ఎస్లో అయితే నేరుగా కేసీఆర్, కేటీఆర్‌లే చేరికల వ్యవహారాన్ని చూస్తారు. ఇతరులతో మాట్లాడి పార్టీలోకి రప్పించడం నిత్య కలాపంగా మారింది. ఏ నాయకుడైనా ఒకరి ద్వారా పార్టీలో చేరితే పార్టీలో అతనికో ఇమేజ్ వస్తుంది. అందుకే వరద సాయం చేయడం కంటే వేరే వారితో మాట్లాడటంపైనే నేతలు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. రోజుకోకరిని చేర్పిస్తూ... వాపును బలుపుగా చూపిస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. ప్రలోభాలు, భయపెట్టడం, స్థిరాస్తులు, అప్పులకు గ్యారంటీ ఇవ్వడం, పదవులను కట్టబెడతామని మాట ఇవ్వడం ఇలా ఎన్నో రకాలుగా నాయకులపై ప్రయోగాలు చేస్తున్నారు. ఫామ్‌హౌజులు, స్టార్ హోటళ్లు, రహస్య ప్రదేశాలు ఇందుకు వేదికలౌతున్నాయి. సదరు నాయకుడు ఎక్కడ బలహీనంగా ఉన్నాడో తెలుసుకుని అక్కడ సమ్మెట దెబ్బ వేస్తున్నారు. బాగా కాగిన ఇనుప ముక్కపై సమ్మెట దెబ్బకొడితే ఒంగిపోయినట్టు నేతలు వంగిపోతున్నారు. రాజకీయాల్లో ఇది ఎంత కాలం ఉంటదో వేచి చూడాల్సిందే.
- గుడిగ రఘు