Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ వారం రోజుల క్రితం తెలంగాణ ప్రజానీకమంతా వానలు, వరదలతో సతమతమవుతున్న వేళ... హాట్ బ్రేకింగ్ న్యూస్ అంటూ జనగామ నుంచి ఓ వార్త ఆకాశం నుంచి ఊడి పడింది. 'అందరూ గ్యాస్ ధరల గురించి పదేపదే మాట్లాడుకుంటూ ప్రధాని మోడీని తిట్టిపోస్తున్నారు.. కానీ గ్యాస్ బండ ధర పెరిగింది కేవలం రూ.50 మాత్రమే. నాకు ఆ బండ మూణ్నెల్లపాటు వస్తుంది. అంటే నెలకు సగటున కేవలం రూ.17 మాత్రమే భారం పడుతుంది.. ఇది నాకు అస్సలు భారంగా అనిపించటం లేదంటూ' అక్కడి సామాన్యుడొకడు నొక్కి వక్కాణించి, లెక్కలతో సహా పూసగుచ్చి చెప్పినట్టు ఆ వార్తా కథనం సారాంశం. అదే సామాన్యుడు తెలంగాణలో పెరిగిన బస్సు ఛార్జీల గురించి తన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ... 'కేసీఆర్ సర్కారు బస్ ఛార్జీలు పెంచటం వల్ల నాకు నెలకు సగటున అదనంగా రూ.300 భారం పడుతోంది. నా కొడుక్కి బస్ పాస్ రూపంలో ఇప్పుడు రూ.450 ఎక్కవ కట్టాల్సి వస్తోంది... దీని గురించి ఎవరూ మాట్లాడరా..?' అంటూ యావత్ తెలంగాణ సమాజానికి ఓ గురజాడ, ఓ వీరేశలింగం, మరో శ్రీశ్రీ లెవల్లో హితోపదేశం చేశారు. ఆ 'అసామాన ప్రతిభాశాలి...' మేధస్సుకు అచ్చెరువొందిన నెటిజన్లు... 'అయ్యా... సామాన్యా.. అపర మేధావీ... నువ్వు మోడీగారు తాజాగా రూ.50 మేర పెంచిన గ్యాస్ ధరనే చూస్తున్నావు. కానీ, ఆ పెద్దాయన అధికారంలోకి వచ్చిన 2014లో అదే గ్యాస్ బండ ధర రూ.450గా ఉండేది. ఇప్పుడది రూ.1,150కి ఎగబాకింది. అంటే రూ.700 మేర ధర పెరిగింది. ఈ పాపం ఎవ్వరిది..? టీఎస్ ఆర్టీసీ ఛార్జీల గురించి మనం ప్రశ్నించాల్సిందే. వాటిని తగ్గించాలంటూ కేసీఆర్ను డిమాండ్ చేయాల్సిందే. కానీ ఇక్కడో విషయాన్ని మనం గమనించాలి. అసలు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ఇష్టానుసారంగా పెంచటం వల్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై మరిన్ని భారాలు పడ్డాయి కదా..? దాన్ని గట్టెక్కించటం కోసమే అనివార్యంగా ఛార్జీలను పెంచుతున్నామంటూ తెలంగాణ సర్కారు ప్రకటించింది కదా..?' అంటూ ప్రశ్నలతో ఎదురుదాడి చేశారు. సంబంధిత లెక్కలతో దుమ్ము రేగ్గొట్టారు. వారి ప్రశ్నలకు ఆ అసామాన్యుడు ఇప్పటిదాకా నో ఆన్సర్...
-బి.వి.యన్.పద్మరాజు