Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పైత్యం పీక్ స్టేజ్‌కు వెళ్తే మాటలే కాదు... చేతలు కూడా చెయ్యిదాటి పోతుంటారు... దానవ్వ భడవ... ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేతలు కూడా ఇలాగే తిట్ల దండకం అందుకుంటున్నారు. ఒకానొక దుర్దశలో ప్రాస పొల్లుపోకుండా ఎదుటి వాళ్ల అసలు పేర్లు కూడా మర్చిపోయి, తిట్ల ముద్దు పేర్లతోనే పిలుచుకొనేంతగా వాగ్ధాటిని ప్రదర్శిస్తూ రక్తి కట్టిస్తున్నారు. గుండుగాడు... బండగాడు... తంబాకు నమిలేటోడు... అనగానే కండ్లముందు ఆ నాయకుడి ఫోటో ఛటుక్కున మెరిసి, పెదవులపై మనకు తెలీకుండానే చిరుధరహాసం ప్రత్యక్షమవుతుంది. యువరాజు, 420, డ్రగ్టిస్టు వంటి మాటలు వినగానే ఆ నేత ఎవరో అప్రయత్నంగానే అర్థమైపోతుంది. నోటుకి ఓటుగాడు, పొట్టోడు, కొత్త బిచ్చగాడు వంటి పదాలు వినగానే ఆ...ఆ... ఆయనే... అయనే... అని గుర్తుపట్టేంతగా ఈ ముద్దుపేర్లు ప్రాచుర్యంలోకి వచ్చేశాయి. నేరుగా తిట్టుకుంటే ప్రత్యర్థులు పరువునష్టం కేసులు వేస్తున్నారని ఎవరికి వారు ఇలా 'ముద్దు' పేర్లతో మురికి మాటలు మాట్లాడుతూ మనల్ని కూడా వాటికి అలవాటు చేసేస్తున్నారు... బద్మాష్‌గాళ్లు... ఓ సారీ... సారీ... వాళ్ల డైలాగులు వినీ వినీ అవే మాటలు అన్యాపదేశంగా వచ్చేస్తున్నారు... ఏమనుకోకండే...! అయితే ఒకటి మాత్రం నిజం. ఈ మురికి మాటల్లో పొరుగురాష్ట్రం నేతలకంటే మనోళ్లు కాస్తంత సంస్కారంగానే 'తిట్టు'కుంటున్నట్టు కనిపిస్తోంది. ఏంటో పోనూ పోనూ పోరగాళ్ల జీకే పరీక్షల్లో ఈ తిట్లనే చెప్పి... అంటే ఎవరు? అని అడిగినా ఆశ్చర్యం లేదనుకుంటా...!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి