Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హస్తిన నుండి రారాజు వస్తాడు, ఎన్నో వరాలిస్తాడు, అదీగాక రెండురోజులిక్కడే ఉంటాడు అని అందరూ సంబరపడిపోయారు. ''అడగక ముందే అన్నీ ఇచ్చే నిన్నే పేరున పిలవాలి'' అని మహాకవి రాసిన పాట గుర్తుకొచ్చి అందరి మనసులు ఆహ్లాదంగా ఎదురు చూశాయి. ''వస్తాడు నా రాజు ఈరోజు'' అని అల్లూరి సీతారామరాజులోని సినారె పాట కూడా పాడుకున్నారు కొందరు. కానీ రాజులెప్పుడూ ప్రజలనుకున్నది చేయరు. తాం ప్రజలకు ఎప్పుడు ఏది చేయాలనుకుంటారో అప్పుడు అదే చేస్తారు. వ్యాపారశాస్త్రం బాగా చదివినోళ్ళే రాజులవుతారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పూర్వం యువరాజా వారిని గురువు దగ్గర విద్య నేర్చుకొమ్మని పంపేవాళ్ళు. అక్కడ రాజకీయాలతో పాటు వ్యాపారం గురించి కూడా చెప్పే ఉంటారేమో. రాజు వచ్చాడు తన మొండి చేతులను చూపించిపోయాడు.
రాజులెప్పుడూ ఇంతే అనిపిస్తుంది. మోసం చేయడం వారి సహజ లక్షణమేమో అనిపిస్తుంది. శకుంతలకు రాజు దుష్యంతుడు అన్యాయం చేద్దామనుకుంటాడు. అయితే ఆయనను రక్షించేందుకు కాళిదాసు ఒక మతిమరపు ఎపిసోడ్ సృష్టించి చేప ద్వారా వచ్చిన ఉంగరాన్ని చూసి తెలుగు జానపద సినిమాలో లాగా అంతా గుర్తొచ్చింది అని పాత్రలో బాగా జీవించి మంచివాడుగా మార్కులు కొట్టేస్తాడు. ఇంకో రాజు ఒక్కో పద్యానికీ ఒక్కో బంగారు నాణెం ఇస్తానంటాడు కవి ఫిరదౌసితో. బిడ్డ పెళ్ళి పెట్టుకున్న కవి కష్టపడి పద్యాలు రాస్తాడు. ఆ రాజు తన సహజ గుణంతో ఆలోచించి నేను ఒక్కో పద్యానికి ఒక్కో వెండి నాణెం ఇస్తాను అంటాడు. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే. అదేకోవలో ఇప్పటి యువరాజొకాయన దుల్హన్ తోఫా ఆపేస్తున్నాను నాదగ్గర నిధులు లేవు అంటాడు. ఇలా ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు రాజులు మోసం చేస్తూనే ఉంటారు. అది వారి సహజ గుణం అని మా మిత్రుడు అంటూ ఉంటాడు.
సరే రాజు వచ్చాడు పోయాడు ఖాళీ చేతులు చూపించి మరీ తన పరిస్థితి వివరించాడు. ఇక్కడ అధికారంలోకి వస్తే మాత్రం ఆ సంగతే వేరుగా ఉంటుంది, అస్సలు నా రెండు చేతులూ చాలవు మీకిచ్చే తోఫాలతో అన్నాడు. మీకు చాలా విషయాల్లో 'విమోచన' కలిగిస్తానన్నాడు. దేని నుండి అంటే అటు పైన, ఇటు ఇక్కడ కుటుంబ పాలనకు రోజులు చెల్లాయన్నాడు. మరి పరివార్ అంటే ఏమిటని అడిగితే అది వేరేనన్నాడు. లేదు సార్ గూగుల్లో డిక్షనరీ అర్థం పరివార్ అంటే కుటుంబం అనే ఉంది అంటే కూడా ఒప్పుకోడు. అసలు కుటుంబాలను విడగొట్టడమే మా పని, కావలిస్తే మహారాష్ట్రలో చూడండి అనీ అంటాడు. ఆయన రాజు కాబట్టి ఏమైనా మాట్లాడతాడు. ''నేను ఇంద్రుణ్ణి కదా, ఏమన్నా చేస్తాను'' అని అహల్య నాటకంలో బ్రహ్మానందం డైలాగ్ గుర్తుకొచ్చేలాగ. తరువాత బ్రహ్మానందానికి అందరూ కలిసి పూజ చేసి 'అత్తారింటికి' పంపుతారు. అదీ సినిమానే. చరిత అయినా, వర్తమానమైనా, భవిష్యత్తైనా, సినిమా అయినా, రాజులంతా ఒక్కటే అని మనం నిర్థారణకు రావచ్చు.
రాజు వచ్చినా వరాల వర్షం కురవలేదని అనుకున్నాయేమో మేఘాలు, ఒకటే కురిశాయి. అటు నదులూ తమ ప్రతాపం చూపాయి. ఇక ఇక్కడి రాజు అంతఃపురంలో నుండే తన ప్రయత్నాలేవో తాను చేస్తున్నాడు. ఇది రాజు కాగోరే గాఢ విజరు పట్టుకున్నాడు. ఇంట్లోనుండే వరదల గురించి, వరద సహాయం గురించి మాట్లాడుతున్నాడు, కనీసం హెలికాప్టర్లో కూడా పోయి చూడలేదన్నాడు. నిజమే, ఆయన చెప్పే మాటల్లో కూడా నిజముంది. వినదగునెవ్వరు చెప్పిన అనుకుంటూ అందరి మాటలూ వింటుండాలి మనం. ఇంకా నయం మా రారాజు వచ్చిపోగానే వర్షాలొచ్చాయి, వరదలొచ్చాయి అదంతా మా గొప్ప అనలేదు, లేక అనే ఉంటాడేమో. తమాషా ఏమిటంటే అందరూ ఇంట్లోనుండి మాట్లాడటం. గట్టు మీద కూచొని ఈత ఇలా కొట్టండి అలా కొట్టండి అని కోచింగ్ ఎవరైనా ఇవ్వచ్చు. అసలు మీ రాష్ట్రంలో వరదలొస్తే మీరెంతవరకు చూసొచ్చారని ఎదురు ప్రశ్న కూడా వేయొచ్చు. ఈ వరదల్ని కూడా వదలక రాజకీయం చేస్తారా అని ప్రజలు అనుకోవచ్చు కూడా.
మాటల్లో ఎన్నైనా చెప్పొచ్చు. చేతల్లో ఏమి చేస్తున్నారన్నది ప్రజలు చూస్తూనే ఉంటారు. కేరళలో తుపాను బీబత్సం జరిగినప్పుడు, కరోనా కాలంలో ఎలా చెసిందీ, ఎంత బాగా చేసిందీ అందరికీ తెలుసు. అయితే ఎవ్వరూ చెప్పరు. పెద్ద పెద్ద న్యూస్ పేపర్లలో, టీవీల్లో అస్సలు రానే రావు ఆ విషయాలు. అయినా వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు, తమ పనేదో తాము చేసుకుంటూ పోతారు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తిట్టుకోకుండా అందరూ కలిసి అక్కడ పనిచేయడం చూడాలి. అక్కడి నాయకుడు ప్రతినాయకులను కూడా కలుపుకుపోతాడు ప్రజలకు సంబంధించిన విషయాల్లో.
ఇక ఈ వరద రాజులు తమ మాటల, వరాల వరదలతో ఎప్పుడూ ముంచెత్తుతారు అని పైన చెప్పుకున్నాం. తమకు ఓట్లు వరదలా పడతాయా లేదా అని రూఢ చేసుకున్నాకనే చెయ్యి విదిలిస్తారు. తమ మిత్రులెవరు, మిత్రులు కానివారెవరు అని బాగా స్టడీ చేస్తారు వీళ్ళు. రిపోర్టులు తెప్పించుకుంటారు, ప్రత్యేకంగా మనుషులను పెట్టుకుంటారు తమకు సహాయంగా. వాటిల్లో తమకు అనుకూలంగా మంచి ఫలితాలొస్తాయి అని తెలిస్తేనే వరద మొదలవుతుంది. అయితే నిజంగా వరదరాదు కదా పల్స్ పోలియో చుక్కల లాగ సాయం చిన్న చిన్నగా చేస్తూ పోతారు. బిందెడు నీళ్ళు పోస్తారనుకున్న చోట ఒక గ్లాసెడు నీళ్ళు కూడా రావు. ప్రకటనల్లో చూపించినట్లు వస్తువులు ఇంటికొచ్చాక పనిచేయవు. అదెంతో ఇదీ అంతే.
రాజధాని నిర్మాణానికి మట్టినిచ్చిపోయారని నిధులు ఇవ్వడంలేదని కొన్నిచోట్ల వాపోతుంటారు. పైవాణ్ణి ఏమీ అనలేక తమలో తాము చిన్నరాజులు, ప్రతిపక్ష నాయకులు పోట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడ ఎలాంటి గాలాలు వేయాలి, వోట్ల వరద ఎలా చేసుకోవాలి, లేదా నోట్ల వరద సాయం తీసుకోవాలా అని ఆలోచించే రాజులనుండి మనకు విమోచన లేదా అని ప్రజలు అనుకుంటూనే ఉంటారు. ఆ 'విమోచన' ద్వారానే మేమిక్కడ వోట్లు సంపాదించు కుంటామని రాజులు ధీమాగా ఉంటారు. ఎవరు ఎవరి విమోచన పొందుతారో వేచి చూడాలి. రాజకీయ వాతావరణం గురించి తెలిపే విభాగం ఇంకా మన వాతావరణ విభాగమంత నైపుణ్యాన్ని అందిపుచ్చుకోలేదు. అందుకే రాజకీయ మబ్బులు ఎప్పుడు పడతాయో, వర్షాలు ఎప్పుడు కురుస్తాయో, వరదలు ఎప్పుడు వస్తాయో ఆ సమయానికే తెలిసేది.
- జె. రఘుబాబు
సెల్:9849753298