Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట...'' అని ఓ సామెత. గుమ్మడికాయలు కోసే క్రమంలో, వాటికి ఉన్న బూడిద, కోసిన వాడి బట్టలకి అంటుకోవడం సహజం. అందుకే ''గుమ్మడి కాయలు ఎవరు దొంగిలించారు'' అంటూ నిలదీస్తే, అకస్మాత్తుగా ఒకవ్యక్తి తన భుజాలను తడుముకుంటూ ఏమైనా అంటిందేమోనని సర్దుకున్నాడట. అంతటితో దొంగ ఎవరో అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు బీజేపీ తీరు సరిగ్గా అలానే ఉంది. అందుకని తమను ఎవరూ నిలదీసే అవకాశమేలేకుండా నియంత్రించ చూస్తున్నారు. కొన్ని పదాలను పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఉటంకిస్తేనే ఉలిక్కి పడుతున్నారు. వాటి వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట కలుగుతుందనే నెపంతో ఆ పదాలను నిషేధపు లిస్టులో చేర్చి వాటిని అన్‌పార్లమెంటరీ పదాలుగా ప్రకటించారు. తరువాత రాబోయే చట్టం ఆయా పదాలను ఉపయోగించిన వారిని పార్లమెంటులోకి నిషేదించడమే! దీని బదులు, ప్రభుత్వం ఎన్నుకోబడిన తర్వాత ఐదేండ్ల వరకు ఎవరూ వారిని ప్రశ్నించకూడదు అనే నిబంధనలు చేస్తే సరిపోలా? అయితే ఈ సాహసం ఇప్పుడు నడుస్తున్న పాలన విధానంలో అసాధ్యమని భావించలేం. పార్లమెంటులో అసభ్యత అంటే ఏది? మాట్లాడమా? మౌనంగా ఉండడమా? పార్లమెంటులో ప్రసంగిస్తున్న వారి సంఖ్య కేవలం మొత్తం సభ్యులలో 10శాతం మాత్రమే. 90శాతం మంది పార్లమెంటు సభ్యులు నోరు మెదపడం లేదు. ఈ గణాంకాలు అనేక అసందర్భాల్లో బయటపడ్డాయి కూడా. ఎన్నికైన వారిలో అనేకమంది, నామినేట్ చేయబడిన వారిలో మరింత ఎక్కువమంది అసలు పార్లమెంటుకే హాజరు కావడం లేదు. సచిన్ టెండూల్కర్ మొదలుకొని రంజన్ గొగోరు వరకు రాజ్యసభకు ఎన్నికైన వాళ్లలో కనీసం పార్లమెంటు పని దినాలలో పట్టుమని పది రోజులైనా హాజరు కాలేదు. శాసనాల రూపకల్పనలో నాణ్యత పడిపోవడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. భారత రాష్ట్రపతితో సహా ప్రధానమంత్రి, స్పీకరు ఎవరెవరైతే పార్లమెంటుకు బాధ్యత వహిస్తున్నారో వారందరూ దీనికీ బాధ్యత వహించాలి. పార్లమెంటు సభ్యుల స్థాయి వారివారి పార్టీలకు రబ్బరు స్టాంపులుగా పడిపోయింది. ఓటింగుల సందర్భంగా తప్పితే మళ్ళీ కనిపించని సందర్భాలనేకం. ఒక్కోసారి అనిపిస్తుంది మంత్రివర్గంలో పనిచేస్తున్న మంత్రులు తప్ప మిగతా పార్లమెంట్ సభ్యులకు పని ఏమున్నది? వారు లేకుంటే పరిపాలన సాగదా? వారికై పెట్టే ఖర్చు సంగతేంటి? 243 అనగా, 43శాతం పార్లమెంటు సభులు నేరపూరిత చరిత్ర కలిగిన వారున్నారు. (ఎ.డి.ఆర్ నివేదిక ప్రకారం) ఇందులో 116మంది బీజేపీ నుండి, 29 కాంగ్రెస్, 13 జేడీయూ, 10 డీఎంకె, 9 టి.ఎమ్.సి నుండి ఉన్నారని తెలుస్తున్నది. మహిళా పార్లమెంటు సభ్యుల సంఖ్య గణనీయంగా తక్కువ. ఉన్న వారిపై పెత్తనం ఇతరులదే అనికూడా విధితమవుతుంది. ఇంతటి కఠోరమైన అసమర్థ పార్లమెంటు పని విధానాన్ని సరిదిద్దకుండా అందులో సభ్యులు మాట్లాడే భాషను అసంబద్ధంగా తొలగించడం సబబెలా అవుతుంది? ప్రతిపక్ష సభ్యులు ఎలాగైనా మాట్లాడవచ్చనేది సమర్థించనవసరం లేదు. కానీ ప్రభుత్వ విధానాలపై వారి ఆగ్రహాన్ని కూడా వద్దంటే ఎలా? నిజానికి స్పష్టమైన విమర్శ ప్రభుత్వానికి తమను తాము సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చే ఫీడ్‌బ్యాక్ వంటిది. పార్లమెంటులో ప్రతిపక్షాల తరపున కూడా స్పష్టంగా ప్రసంగించగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారి ప్రసంగాలలోనూ భాషాపరమైన తప్పులు వెతికి ఆ మాత్రం కూడా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించకుండా చేయడం అంటే అది ఒక ఫాసిస్టు విధానం. నిజానికి భాషకన్నా దాని వెనకున్న అంతరార్థానికి సమాధానమివ్వడం అవసరం. ఉపయోగించే పదాల వల్ల తప్పు చేయని ప్రభుత్వానికి నష్టమేమి? తప్పు భాష మాట్లాడితే అది మాట్లాడిన వారికే కళంకం కదా! జుమ్లా బాజీ అనే పదాన్ని నిషేధించారు. అలాంటి పదాన్ని ప్రతిపక్షం ఉపయోగిస్తే ప్రభుత్వం ఎందుకు భుజాలు తడుముకోవాలి? అంటే ఇచ్చిన మాట తప్పుతున్నారా? అసలు అసభ్య పదజాలాన్ని పార్లమెంటులో మాత్రమే నిషేధిస్తే సరిపో తుందా? తమ ఇతర ప్రక్రియలో ఎలాగైనా మాట్లాడవచ్చా? భాష మాత్రం గౌరవంగా ప్రస్తుతిస్తూ భావం ఎంత నీచమైనదైనా ఉండవచ్చా? ఒకచోట ఎన్నికల ర్యాలీలో బీజేపీ నాయకుడు అమిత్ షా ప్రసంగిస్తూ ''ఇక్కడ ఓటు మీటర్ నొక్కితే పాకిస్థాన్‌లో బాంబు పేలాలి'' అని అంటాడు. మరోచోట మరో నాయకుడు ''ప్రజలు వేసుకునే దుస్తులను బట్టి వారి రంగేంటో అర్థం చేసుకోవచ్చు' అంటాడు. ''రంజాన్‌కి మాత్రమే కాదు దీపావళికి కూడా లైట్లు వేస్తాం, కభ్రస్థానే కాదు స్మశాన వాటిక నిర్మిస్తాం'' అంటూ ఘీంకరిస్తారు మరొకరు. ''గోలీమార్ సాలోంకు'' అంటూ ఇంకొకరు ప్రసంగిస్తారు. ఈ మాటలు పార్లమెంటరీ పదా లేనా? వాటి వెనకాల భావం స్పష్టంగా తెలియ టం లేదా? భారత శిక్షాస్మృతి ప్రకారం నేరం చేసిన వారి కన్నా నేరం వైపు ప్రేరేపించిన వాళ్ళకి శిక్ష వేయాలని ఉన్నది. ఇలాంటి నేర ప్రేరేపితు లకు ఎంతమందికి శిక్షలు పడ్డాయి? కనీసం అరెస్టులు ఏమైనా జరిగాయా? దుర్భాషలాడు కుంటుంటే మౌనంగా ఉంటున్న పార్టీల అధినేత లకు సభ్యత గురించి మాట్లాడే అర్హత ఉంటుందా?
పార్లమెంటు ప్రాంగణంలో నిరసనలు కూడా చేయొద్దని మరో అస్త్రాన్ని ప్రతిపక్షాలపై వదిలారు. చట్టాల రూపకల్పన ఎంత పవిత్రమైనదో వాటిని సరిదిద్దే లేదా తిరస్కరించే నిరసనా అంతే పవిత్రమైనది. ముప్పై నలబై ఏండ్ల వరకూ మాదే ప్రభుత్వమని చెప్పిన బీజేపీ నాయకులు ఆ తరువాతైనా ప్రతిపక్షంలో కూర్చునే వారి భావి తరాలకు అన్యాయం చేస్తున్నారేమో చూసుకోవాలి. అసలు ప్రజా స్వామ్యమంటేనే మైనారిటీకి అనగా ప్రతిపక్షాల అభిప్రాయాలకు, విమర్శకు, నిరసనకు గుర్తింపునివ్వటం కదా..!? అది మరిచిన పాలన నేమనాలి?
- జి. తిరుపతయ్యజి. తిరుపతయ్య
సెల్: 9951300016