Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివక్షల్లో వివక్ష లింగ వివక్ష. ఇది సర్వంతర్యామిలా మానవ ప్రపంచం అంతటా పాతుకుని ఉన్నది. ఏకొద్ది మూలవాస గిరిజన తెగల్లోనో మాతృస్వామిక వ్యవస్థ ఉన్న చోటు మాత్రమే ఇందుకు మినాహాయింపు. భారతదేశంలో పురుషాధిక్యత మరింతగా బుసలు కొడుతున్నది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టింది. 146 దేశాల స్త్రీ-పురుష సమానత్వ సూచికలో భారత్ 135వ స్థానానికి పరిమితం కావడం 'జాతికే సిగ్గుచేటు' అని పలువురు మేధావులతోపాటు పత్రికలు సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.
'ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది' అని వందేండ్ల క్రితమే మహాకవి గురజాడ తలపోసినా, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ సమానత్వం, స్త్రీ సాధికారత వంటి అత్యున్నత ఆశయాల సాధన ఆమడల దూరంలో నిలచిపోవడం విషాదమే. అసలు 'మహిళా హక్కులంటేనే మానవహక్కులు' అనే సోయి చాలామంది పాలకులకు లేకుండా పోతున్నది. స్త్రీకి సముచిత గౌరవం ఇస్తున్న చిన్న చిన్న దేశాలు ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, న్యూజిలాండ్, రువాండా మొదలైనవి మహిళాభ్యున్నతిలో అగ్రభాగాన నిలుస్తున్నాయి.
కాగా, మన ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు చివరకు శ్రీలంక కూడా మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. మనకంటే దిగువన మత ఛాందస పురుషాధిక్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, కాంగో వంటి దారిద్య్రదేశాలు ఉన్నాయి. వ్యభిచార నెపంపై స్త్రీలను బహిరంగంగా కొరడాలతో శిక్షించడం, పర్యాటక ప్రాంతాల్లో స్త్రీల విహారాన్ని నిషేధించడం, చదువులకు స్త్రీలను దూరం చేయడం వంటివి ఆయా దేశాల్లో ఇప్పటికీ నడుస్తుంటాయి.
అసలే పతనం. ఈ పతనం శరవేగంతో దిగజారడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఈ అంతర్జాతీయ సూచికలను సాపేక్ష పద్ధతుల్లో కొలుస్తారు గనుక కొట్టిపారేయడానికి వీల్లేదు. నాలుగు ప్రధాన జీవన ప్రమాణాల ప్రాతిపదికన ఈ సూచికను రూపొందిస్తారు. 1. వివక్ష 2. ఆరోగ్యం 3. విద్య 4. రాజకీయం. మహిళారోగ్య సూచికలో ఇంకా కిందకు పడిపోయాం. 146వ స్థానంలో ఉన్నాం. రక్తహీనతతో రోగగ్రస్తంతో మన భారత మహిళ ఎంత బలహీనస్థితిలో ఉన్నదో ఇది కండ్లకు కడుతున్నది. విద్యా సముపార్జన అంశంలో 107వ స్థానంలో ఉంటే, రాజకీయ భాగస్వామ్య విషయంలో 48వ స్థానంలో ఉన్నాం.
మనదేశంలో 66కోట్లకు మందికిపైగా మహిళలు ఉన్నారు. వ్యవసాయం, చేతివృత్తులు, అసంఘటిత శ్రామిక రంగాల్లో 63శాతంకుపైగా శ్రమ-స్త్రీలు, పిల్లలే చేస్తున్నట్టు లెక్కలు తెలుపుతున్నాయి. ఒక విధంగా భారత ఉత్పాదక శక్తికి ఆర్థికవృద్ధికి జీవగర్రగా ఉన్న మన భారత మహిళ ఇంత అదఃపాతాళానికి పడిపోవడం మానవతా వాదులను నివ్వెర పరుస్తున్నది.
'భేటీ పడావో, భేటీ బచావో' వంటి పాలకుల మాటలు పసలేని మాటలుగా అర్థమైపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయిన లింగవివక్ష కూకటివేళ్ళతో సహా పెకిలించాలంటే మరో 132ఏండ్లు పడుతుందని వేదిక అంచనా వేయడం మరింత భయపెడుతున్నది. కరోనా కాలంలో యావత్ ఉత్పాతదక శక్తిసామర్థ్యాలు సన్నగిల్లిన వేళ లింగవివక్ష ఘోరంగా తాండవించినట్టు తెలిపింది. అంటే ఈ భూగోళంపై ఏ ఉపద్రవాలు సంభవించినా అంతిమంగా అది మహిళ లపై పెనుభారం మోపుతుందన్న వాస్తవాన్ని చెప్పకనే చెబుతున్నది.
మహిళా వివక్షపైనా, ఆరోగ్యంపైనా, విద్యపైనా, ఉపాధి కల్పనపైనా అత్యంత ప్రణాళికాయుతమైన ప్రత్యేక శ్రద్దపెడితే తప్ప ఈ కడగండ్ల నుండి గట్టెక్కలేమన్న సత్యం అర్థమవుతూనే ఉన్నది. మనందరికి కనువిప్పు కలిగేలా ఈ నివేదిక మనల్ని హెచ్చరిస్తున్నది.
2016లో లింగ సమానత్వ సూచిలో మనం 87వస్థానంలో ఉన్నాం. మరి ఈ ఆరేండ్లలోనే ఎందుకింత ఘోరంగా దిగజారాం? రాజకీయ భాగస్వామ్యం స్థాయి తొమ్మిది నుండి 48కి పడిపోయింది. అంటే అప్పటినుండి ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేవు. ప్రాప్తకాలజ్ఞతకు వదిలేయడమే కాదు, సరికదా నిర్లజ్జగా పురుషాధిక్యతను బలపరిచే విధానాలే కొనసాగుతున్నాయన్న మాట.
బాబా సాహెబ్ అంబేద్కర్ సారధ్యాన వీరోచితమైన మన భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు - విధులు, ఆదేశిక సూత్రాలు అన్నింటా స్త్రీ-పురుష సమానత్వానికి పెద్దపీట వేసింది. స్త్రీల పట్ల సకల వివక్షతలను సమూలంగా పరిమార్చాలన్న అంతర్జాతీయ ఒడంబడిక (1993)కు కట్టుబడి ఉంటామన్న లక్ష్యానికి మన పాలకులు తిలోదకాలు ఇచ్చిన ఫలితమే ఈ పతనం.
'యత్ర నార్యంతు పూజితే తత్ర దేవతా! రమింతు!' వంటి శ్లోకాల మాటున కపట అణచివేతను ఎన్నాళ్ళని ఎవరైనా దాచగలరు. మంత్రాలకు చింతకాయలు రాలవు కదా! మహిళల విషయంలో నేడు భారత్ పరువు పోతున్నది. భరింపనలవిగాని వేదనను మిగులిస్తున్నది. ఉద్యమాలే శరణ్యం అనే భావన అనివార్య మవుతున్నది.
దాదాపు శతాబ్దం క్రిందట 1907లో నడిచిన హౌంరూల్ (స్వపరిపాలన) ఉద్యమంలో భారత మహిళలు తొలిసారిగా వేలాది మందిగా తమపైనున్న ఆంక్షల పరదాలు తొలగించుకుని పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అప్పటి నుండి ఆ సత్సంప్రదాయం ఇటీవల జరిగిన కిసాన్, షాహిన్భాగ్ ఉద్యమాల్లో కూడా ఉరకలేసిన విషయం తెలిసిందే. భారత నారీ పతనంపై ఇక ఉవ్వెత్తున ఉద్యమ రణభేరి మ్రోగాల్సిందే. సమరశీలశక్తితో జనులంతా సమైక్యంగా పాల్గొనాల్సిందే!
- కె శాంతారావు
సెల్:9959745723