Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశాన్ని పూర్తిగా నవ్వుల పాలు చేసి అధోగతికి చేర్చడమే ఆర్ఎస్ఎస్ ఫాసిస్టుల సాంస్కృతిక అజెండా. ఇటలీ అయినా, జర్మనీ అయినా ఒకటే జెండా అది. ప్రజల్లో ఉద్వేగాలు, విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే. అధికార పీఠాన్ని దక్కించుకుని, దానిని కాపాడుకునేందుకు నిరంతరం అబద్ధాలు ప్రచారం చేయడమే. తమ ఉనికికి ప్రమాదం ఎదురయినప్పుడల్లా దేశభక్తి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడమే. లేదంటే తమ జాతి గొప్పదనే భ్రమలను ప్రజలను కల్పించడమే. హిట్లర్ చేసింది అదే. ముస్సోలిని చేసింది కూడా ఇదే.
ఇప్పుడు మన దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించిన ఆ రక్త పిపాస క్రౌర్య సింహాలు వారి చీకటి అంతరాత్మకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. సింహం బలానికీ, వివేకానికీ, స్థిరచిత్తానికీ ప్రాతినిధ్యం. అది బౌద్ధ సింహమైనా.. హిందువుల సింహమైనా... కానీ ఇప్పుడు కొత్తగా ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని సింహాలు కర్కశత్వానికీ, నిర్దయకీ, రక్తపాతానికీ ప్రతీకలుగా మారనున్నాయి. ప్రాచీన కాలం నుంచీ భారతీయులు మూడు జీవితాదర్శాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. సత్యం, శివం, సుందరం. తాత్విక భేదాలు ఎన్ని ఉన్నా ప్రాచీనులు ఈ విలువలను మాత్రం ఎన్నడూ అగౌరవపరచలేదు. కానీ, సంఫ్‌ుపరివార్, బీజేపీ ఈ మూడింటినీ నాశనం చేసి అసత్యం, అన్యాయం, వికారం అనే కొత్త ఫార్ములా ప్రకారం ఈ సమాజాన్ని పునర్మించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే చరిత్రపై పడింది. సైన్స్‌ను ఎగతాళి చేస్తోంది. పైథాగరస్ సిద్ధాంతం, గురుత్వాకర్షణ థియరీ ఫేక్ అని అంటోంది. ఇప్పుడు జాతీయ చిహ్నాలపై పడింది.
ప్రాచీన యుగంలో అశోకుడు, మధ్య యుగాల్లో అక్బర్, ఆధునిక యుగంలో నెహ్రూ.. వీరు ముగ్గురూ ఒక ఉన్నతమైన దార్శనికతతో పాలించారు. కానీ తన ఫాసిస్టు ఎజెండాను అమలు చేయడంలో భాగంగా దేశ తొలి ప్రధాని నెహ్రూను తక్కువ చేసేందుకు బీజేపీ చేసిన, చేస్తున్న వక్రీకరణలు అన్నీఇన్నీ కావు. మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. చివరకు జాతిపిత మహాత్మాగాంధీపైనా విషం చిమ్ముతున్నారు. గాంధీని చంపిన గాడ్సేను పొగుడు రతున్నారు. బ్రిటిష్ వారి బూట్లు నాకిన సావర్కర్‌ను వీరుడిగా చిత్రిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్‌సింగ్‌ను నాస్తికుడని తెలియడంతో ఆయన అమరత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. తనకు ఉరిశిక్ష రద్దయ్యే చాన్సును కూడా వదులుకున్న భగత్‌సింగ్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు. ఓ క్రమ పద్ధతిలో స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగనిరతిని, దేశ చరిత్రను వక్రీకరిస్తూ వస్తున్న కమలనాథులు ఇప్పుడు చిహ్నాలను కూడా తమ కుటిల నీతికి ప్రతీకగా మారుస్తున్నారు.
ఇకవీరి వక్రీకరణలు ఎలా ఉంటాయంటే.. గుజరాత్లో సాంఘిక శాస్త్రం పుస్తకంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్, అమెరికాపై అణుయుద్ధం ప్రకటించిందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక పాఠ్య గ్రంథంలో స్త్రీలను గాడిదలతో పోల్చారు. సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పాఠ్యపుస్తకం లో మాంసాహారుల వల్ల సమాజంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఉంది. ''మాంసాహారం తీసుకునే వారు అవలీలగా అబద్ధాలు చెబుతారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోరు. అల్లర్లు, అలజడులూ సృష్టిస్తారు. ముఖ్యంగా లైంగిక దాడులకు పాల్పడుతారు. వారికి నిజాయితీ, నిబద్ధత ఉండవు. ఊరికే ఆవేశపడి బూతులు మాట్లాడతారు'' అని ఉంది. ఛత్తీసగఢ్లో అయితే మరీ ఘోరం. అక్కడ బీజేపీ సర్కారు ఉన్నప్పుడు హైస్కూలు విద్యార్థుల పాఠ్య గ్రంథంలో దేశంలో 'నిరుద్యోగ సమస్యకు మూల కారణం-మహిళలు' అని చేర్చారు. ''మహిళలు అన్ని రంగాలలో విజృంభించడం వల్ల, అన్ని రకాల ఉద్యోగాల్లో చేరుతూ ఉండడం వల్ల, పోటీ ఎక్కువైన. ఫలితంగానే నిరుద్యోగ సమస్య పెరిగి పోయింది'' అని పేర్కొన్నారు.
ఇప్పుడు బౌద్ధ మతానికి చెందిన అశోకుడి జ్ఞాపకాలను కూడా ధ్వంసం చేసేందుకు కంకణం కట్టకుంది. బుద్ధుడు ప్రవచించిన అహింస, శాంతి, సమానత్వం ఈ ఆధిపత్య భావజాల మున్న బీజేపీకి నచ్చదు కదా! ప్రజలందరూ సమానమనే భావనను ఒప్పుకోదు కదా! ఆ చిహ్నంలోని నాలుగు సింహాలను గమనిస్తే ఓవైపు రాజదర్పాన్ని, పెద్దరికాన్ని ప్రదర్శిస్తూనే మరోవైపు ఉదారతను చాటుతూ శాంతికి గుర్తుగా ఉంటాయి. ప్రధాని మోడీ ఆవిష్కరించిన ఈ చిహ్నం రాజసం ఉట్టిపడేదిగా కాకుండా క్రూరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.
ఈ దేశాన్ని తొలిసారి ఏకంచేసి పరిపాలించిన మౌర్య చక్రవర్తి అశోకుడి గురించి కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అశోకుడి పాలన ప్రారంభ భాగం వేరు. యుద్ధాలతో, అణిచివేతతో ప్రజలను ఐక్యం చేయడం సాధ్యం కాదని భావించి బుద్ధుని ప్రేమజ్ఞాన ధమ్మాన్ని తన రాజ్య విధానంగా చేసుకుని పరిపాలించాడు. సత్యం, రుజువర్తన సూత్రాలను అనుసరించి రాజ్యపాలన చేసిన పాలకుడు అశోకుడు. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించిన ఘనత బహుశా ప్రపంచంలో అప్పటకీ, ఇప్పటికీ అశోకునిదే అవుతుంది. రాజ్యానికి ఉండే అణచివేత స్వభావాన్ని తుడిచివేసి, హేతుబద్ధమైన నైతిక సమతా సంక్షేమ మార్గానికి రూపకల్పన చేశాడు. ఇంతటి మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన అశోకుడే సారనాథ్‌లో నాలుగు సింహాలను చెక్కించారు. సింహం సాధుజీవి ఏమీ కాదు. తన జీవనం కోసం ఇతర జంతువులను చంపి తింటుంది. అది క్రూర జంతువు అయినా, స్థిరచిత్తానికీ, బలానికీ, వివేకానికీ ప్రతీక. అందుకే రాజదర్పంతో ఉట్టిపడే వాటిని సారనాథ్‌లో బుద్ధుడి నాలుగు బోధనలకు ప్రతీకగా చెక్కించారు. క్రౌర్యంతో.. కోపంతో.. ఊగిపోయే వాడిలో వివేకం తక్కువ. నిబ్బరంగా ఉండేవారిలోనే బుద్ధిబలం ఎక్కువ. ఈ విషయం తెలియని బీజేపీ నాయకులు జాతీయ చిహ్నానికి మార్పులు చేసినట్లుగా కనిపిస్తోంది.
'ప్రతిజ్ఞ'నూ మార్చేస్తారేమో?
మనందరం చిన్నప్పుడు స్కూళ్లలో వరసుల నిలబడి ప్రతిజ్ఞ చేశావారం. 'భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరు నా సహౌదరులు. నేను నా దేశమును ప్రేమించు చున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము. దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయు లను, పెద్దలందరిని గౌరవింతును.. నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను'' అని సాగుతుంది. మన తెలుగువాడైన పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన ఈ ప్రతిజ్ఞ .. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 20కుపైగా అధికారిక భాషల్లో అనువాదమైంది. రోజూ ఉదయం బడుల్లో పిల్లలందరూ దీన్ని గణగణమని చదివేస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దీనిని కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునీ ఈ బీజేపీకి ప్రజలందరూ సమానులంటే గిట్టదు కదా! భారతీయులందరూ సహౌదరులు కాదు కదా! ఇవన్నీ చూస్తుంటే ఒక్క ముందడుగు కాదు, వెయ్యి వెనకడుగులు వేస్తున్నట్టుగా ఉంది. బీజేపీ పాలనలో దేశం అన్నిరంగాల్లో తిరోగమనంలో ఉంది. భవిష్యత్తు చీకటి కాక తప్పదేమోనన్న భయాందోళనలు కలుగుతున్నాయి. జాతీయ చిహ్న స్వరూపాన్ని మార్చేసిన ఈ బీజేపీ ప్రభుత్వం.. రేపటి రోజున రాజ్యాంగం మార్చి దేశ ప్రజల హక్కులను హరించదనే నమ్మకం ఏమిటి?
- బి. అయోధ్యరెడ్డి
సెల్: 9000182333