Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యాంగం ప్రకారం ఈ దేశం రాష్ట్రాల సమాహారం. భిన్న వర్గాలు, భాషలు, అవసరాలు, విభిన్న ఆకాంక్షలతో కూడిన మనదేశం అధికార కేంద్రీకరణ, గుత్తాధిపత్యానికి గురికాకుండా రాజ్యాంగ నిర్మాతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, బాధ్యతలను నిర్ధేశించారు. కానీ వారి ఆశయాలు, ఆకాంక్షలకు విరుద్ధంగా సర్వం కేంద్ర ప్రభుత్వ గుప్పిట (ఆధీనం)లో ఉండాలనే నేటి కేంద్ర పాలకుల విపరీత ధోరణి వివాదాస్పదమవుతోంది. అందువలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ అనిశ్చితి పెరిగిపోయింది. రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్ర జోక్యం పెరిగింది. కేంద్రం ఆలోచనలను బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతోంది. కేంద్రం చట్టాలు చేసే ముందు ముసాయిదా బిల్లు ప్రతిపక్షాలను, రాష్ట్రాలను సంప్రదించాల్సిన సమాఖ్యలోని సహకార స్ఫూర్తికి విఘాతం కల్గిస్తూ తెచ్చిన చట్టాలు విమర్శల పాలైన విధానాలు చూస్తున్నాం. సమాచార హక్కు చట్టం సవరణ, వివాదాస్పద సాగు చట్టాలు, చిన్న ఓడరేవులపై కేంద్ర ఆజమాయిషీ చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, విద్యుత్తు చట్టంలో మార్పులు, రాష్ట్రాల పరిధిలోని పోలీసింగ్ కేంద్ర జోక్యానికి సంబంధించినవి. ఇలా అనేక అంశాల్లో పార్లమెంటరీ సంప్రదాయాలకు రాజ్యాంగ బద్ధ వ్యవస్థల స్వతంత్రతను దెబ్బతీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను హరిస్తున్నట్లుగా భావిస్తున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రాల్లోనూ పాలన సాగిస్తున్నప్పుడు దండిగ నిధులు, మౌలిక వసతులు లభిస్తున్నాయి. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు చిన్నచూపుకు గురవుతున్నవి.
కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రవచించే ''వన్ నేషన్- వన్ టాక్స్'' మాటల్లో ద్వంద్వ(నీతి) విధానాలు దాగి ఉన్నాయి. పేరుకే పన్ను ఒక్కటే మరో రూపంలో సెస్‌లు, సర్‌చార్జీలు రెండింటినీ సుంకాలుగానే వ్యవహరిస్తారు. కానీ ఈ రెండిటి మధ్య మౌలిక తేడా ఉంది. సెస్ అంటే ఒక నిర్ధిష్ట ప్రయోజనం కోసం వసూలు చేసేది. ఆ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాల్సి ఉంది. కానీ సర్ చార్జ్‌కు ఇలాంటి నిర్ధిష్టమైన ప్రయోజనాలు ఉండవు. మన దేశంలో రకరకాల పన్నులు లేకుండా చేయడం కోసమే జీఎస్టీ (వస్తుసేవల పన్ను) అని చెప్పుకుంటున్న సర్కారు సెస్‌లు సర్‌చార్జ్‌ల రూపంలో వసూళ్లు చేయడం అక్రమం. పన్నుల రూపంలో వసూలు చేస్తే అట్టి మొత్తంలో కేంద్ర డివిజబుల్ పూల్ కింద రాష్ట్రాల వాటా పంచాల్సి ఉంటుంది. అదే సర్‌చార్జ్‌లు, సుంకాల పేరిట వసూలు చేస్తే ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచాల్సిన పనిలేదు. అందుకనే వీటిని కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేస్తోంది. అంతేకాదు రాష్ట్రాల జాబితాలోని అంశాల్లోకి కేంద్రం చొరబడుతోందని రాష్ట్రాలు, ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కృషి కళ్యాణ్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్, విద్యా సుంకాలు అలాంటివే. దీని వలన దేశంలో సమాఖ్య స్ఫూర్తికి అర్థం లేకుండా పోతుందనీ రాష్ట్రాలు నిధుల లేమితో ఆందోళన చెందుతున్నాయి. సెస్‌లు, సర్‌చార్జ్‌లు, ట్యాక్స్‌ల రూపంలో వసూలు చేసిన సొమ్మును రాష్ట్రాలతో పంచుకోనప్పుడు సమాఖ్యకు అర్థమేంటనే ప్రశ్న తలెత్తుతుంది. గత ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రాల వాటా 32శాతం ఉండేది. మేము వచ్చాక దాన్ని 42శాతానికి పెంచామని (41శాతమే ఇచ్చేది) గొప్పలు చెప్పుకునే నేటి పాలకులు రాష్ట్రాలకు వాటా పంచాల్సిన అవసరం లేకుండా దొడ్డిదారిలో సెస్‌లు, సర్‌చార్జ్‌ల రూపంలో దండుకుంటున్న ఆదాయం గురించి చెప్పడం లేదు. ఉదాహరణకు: రకరకాల సుంకాల పేరిట ప్రతి లీటరు పెట్రోలుపై రూ.27.90 పైసలు వసూలు చేస్తుంది. అందులో అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చే మొత్తం 60పైసలలోపే మిగతాదంతా కేంద్ర ఖజానాలోకే. దీన్ని బట్టే కేంద్రం రాష్ట్రాల ఆదాయానికి ఈ సుంకాల పేరుతో కొడుతున్న గండి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. గతంలో సెస్‌లు ఎక్సైజ్ డ్యూటీ మీద విధించేవారు. కాని ఇప్పుడు ఆదాయ పన్నుమీద (విద్యా సుంకం), సేవా పన్ను మీద (స్వచ్ఛ భారత్ సుంకం) విధిస్తుండడం గమనార్హం. వీటి ఆదాయాన్ని ఇతర ప్రయోజనాలకు వాడుతున్నట్లు ఆదాయలోటును పూడ్చుకోవడానికి, ప్రభుత్వ ప్రచార, ప్రకటనలకు వాడుకుంటున్నట్లుగా కాగ్ నివేదిక తేల్చింది. చాలా సార్లు (కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) హెచ్చరించడం జరిగింది కూడా.
మనదేశంలో ఆదాయ పన్ను చెల్లించే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, విద్యపై సర్‌చార్జితో సహా ఆరోగ్య, విద్యా సెస్‌ను చెల్లించాల్సిందే. స్వచ్ఛ భారత్ సెస్‌ను 2014లో, కృషి కళ్యాణ్ సెస్‌ను 2016లో ప్రవేశ పెట్టారు. 2017లో జులై-1న స్వచ్ఛ భారత్ రద్దు చేసినప్పటికీ ప్రభత్వం ప్రజల దగ్గర వసూలు చేస్తూనే ఉంది. 2018-19లో కేంద్రం 3శాతం విద్యాసెస్ బదులు 4శాతం ఆరోగ్య, విద్యాసెస్ విధించింది. రెండేండ్లు దాటిన ప్రతి సెస్లోనూ రాష్ట్రాలకు వాటా పంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కేంద్రం గోరంత ఇస్తూ కొండంత నేరుగా రాష్ట్రాలనుండి లాక్కొనే విధానాలు ముమ్మాటికి అప్రజాస్వామ్యమే.
కేంద్ర ప్రభుత్వం వస్తుసేవ పన్ను (జీఎస్టి)ని ముక్కుపిండి నేరుగా వసూలు చేసుకుంటుంది. కానీ రాష్ట్రాలకు తనవంతుగా చెల్లించాల్సిన దాన్ని నొక్కిపడుతోంది. మరోవైపు పెట్రోల్ దాని ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చాల్సిన అంశాన్ని పట్టించుకోవడం లేదు. ''ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు'' అనే సమాఖ్య స్ఫూర్తిలోని సహాకార భావనకు విఘాతం కల్గిస్తున్నారని, జీఎస్టీ పన్ను అమలులోకి వచ్చాక ''ఆకాంక్షలు వేరు అనుభవాలు వేరు'' అని రాష్ట్రాలకూ, ప్రజలకు తెలిసివచ్చింది. భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నట్లు కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు వారి హక్కులను, విధులను కాపాడుకోవాలి. ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ సమన్వయంతో దేశంలో నిజమైన సహకార సమాఖ్య వెలుగొందేలా పాలన సాగించాలి లేదంటే? నష్టపోయేది ప్రజలే. కాబట్టి ఈ మూడంచెల పాలన సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేలా పాలన సాగాలి. కరోనా సృష్టించిన సంక్షోభంలో ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇలాంటి వేళ జనావళికి ఉపాధి, ఉద్యోగాలు, జీవనోపాధికి ఉపయోగపడే విధాన నిర్ణయాలు జరగాలి. ప్రభుత్వాలు ఓ చేత్తో ఇస్తూ ఇంకోచేత్తో లాగేసుకుంటున్న తీరు మారాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా పనిచేయడానికి ఎన్నుకున్నార నేది మరువ రాదు. స్వార్థం వీడి జనా కాంక్షలకు పట్టం కట్టే విధానాలతో సమన్వ యంతో కృషి చేస్తేనే బలమైన ఆదర్శవంత మైన ప్రజాస్వామ్య భారతావని ఆవిష్కృత మౌతుంది. ప్రజల జీవన మనుగడకు భంగం కలిగితే వారు చైతన్య వంతులై తిరగబడక తప్పదు.
- మేకిరి దామోదర్
సెల్: 9573666650