Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు. చరిత్రలో నీతి తప్పిన వారిని చూస్తే పశ్చిమ దేశాలకు మరొకటేదీ సాటి రాదు. మానవహక్కుల వంటి అంశాలను ఆయుధాలుగా చేసుకొని తమకు లొంగనివారి మీద దాడులు చేస్తుంటాయి. వాటికి భంగం కలిగించటంలో అవే ముందుంటాయి. ఒక నాడు సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను భ్రష్టుడు, అక్కడ మానవహక్కులు లేవు అని ధ్వజమెత్తిన అమెరికా అధినేత జో బైడెన్ ఇప్పుడు అతగాడినే కౌగలించుకున్నాడు. సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీని సల్మానే టర్కీలో హత్య చేయించినట్లు చెప్పిన అమెరికా 2018 తరువాత ఆ దేశంతో దౌత్య సంబంధాలను కూడా తెంచుకుంది. తరువాత సౌదీ గానీ, రాజుగానీ మారిందేమీ లేదు. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో 2018 అక్టోబరు రెండున ప్రవేశించిన ఖషోగ్గీని అక్కడే హత్య చేయటం వెనుక సౌదీ రాజు హస్తం ఉందని సీఐఏ ఒక నివేదికను బైడెన్‌కు అందచేసింది. జోబైడెన్ సౌదీ పర్యటనపై అమెరికా డెమోక్రటిక్ సోషలిస్టు బెర్నీశాండర్స్ మాట్లాడుతూ ''చూడండి, వందబిలియన్ డాలర్ల ఆస్తికలిగిన కుటుంబమది, అది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంది, మహిళలను మూడో తరగతి పౌరులుగా చూస్తుంది. తన ప్రత్యర్ధులను జైలుపాలు చేస్తుంది, మట్టుపెట్టిస్తుంది.'' అలాంటి దేశాన్ని సందర్శించి పాలకుడితో చెట్టపట్టాలు వేసుకుంటారా అని విమర్శించాడు. నాలుగు రోజుల మధ్య ప్రాచ్య పర్యటనలో జో బైడెన్ సాధించిందేమిటి అన్నది ఒక అంశమైతే తమకు అవసరమైతే గతంలో చెప్పిన మాటలను దిగమింగుతాడని స్పష్టమైంది. ఇదంతా ఎందుకు అంటే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే.
అమెరికాలో ఇంథన ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం నాలుగుదశాబ్దాల గరిష్టాన్ని తాకింది. అవి పెరిగే కొద్దీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికారపార్టీకి ఆమేరకు ఓట్లు తగ్గేందుకు సెగతగలనుందనే వార్తలు. మరోవైపున పశ్చిమాసియాలో రష్యాకు మద్దతుదారుగా ఉన్న ఇరాన్‌ను కట్టడి చేసేందుకు, చమురు ఉత్పత్తి, సరఫరాలను పెంచి రష్యాను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు బైడెన్ విఫల పరటన చేశాడని, ఖాళీ చేతులతో వెళ్లాడని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడున్నదాని కంటే అదనపు ఉత్పత్తికి ఎలాంటి హమీ లేదని, ఇప్పటికే రోజుకు పదమూడు మిలియన్ పీపాలకు పైగా ఉత్పత్తి చేస్తున్నట్లు సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పాడు. అమెరికోసం చైనానో చైనా కోసం అమెరికానో వదులు కోవటం తమ విధానం కాదని, ప్రజలతో వారధి నిర్మిస్తామని సౌదీ విదేశాంగమంత్రి అదెల్ అల్ జుబైర్ చెప్పాడు. బైడెన్ పర్యటన తరువాత రష్యా అధినేత పుతిన్ ఇరాన్ వెళుతున్నాడు. బైడెన్‌తో భేటీ తరువాత సౌదీ రాజు సల్మాన్ మాట్లాడుతూ తమ భేటీలో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య ప్రస్తావన గురించి చెబుతూ... ''జరిగింది విచారకరం, అలాంటివి పునరావృతం కాకుండా చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ప్రపంచంలో అలాంటి ఉదంతాలు ఎక్కడైనా జరగవచ్చు. ఇరాక్‌లోని అబూ గ్రాయిబ్ జైల్లో ఖైదీలపై చిత్రహింసల వంటి అనేక తప్పిదాలకు అమెరికా పాల్పడలేదా'' అని ఎదురు ప్రశ్నించాడు.
అమెరికా పథకంలో భాగంగా రష్యాతో వైరం పెంచుకున్న ఐరోపా దేశాలకు ఇంథన సరఫరాలు తగ్గాయి. వేసవి తరువాత చలికాలంలో వెచ్చదనానికి అవసరమైన చమురును ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అని ఐరోపా చూస్తోంది. ఈ క్రమంలో ఐరోపా సమాఖ్య కూడా ప్రాణ, విత్త, మానభంగములందు ఆడితప్పవచ్చు అన్నట్లుగా మానవహక్కులను ఇంథనం కోసం కొంతకాలం పక్కన పెట్టేందుకు పూనుకుంది. ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు మృగ్యం అని ఏ దేశాల గురించైతే చెప్పారో ఇప్పుడు ఇంథనం కోసం వాటినే ఆశ్రయిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలకుల నిరంకుశ చర్యల గురించి తెలిసిందే. అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నిహయన్ పారిస్ పర్యటనకు వెళితే రాచమర్యాదలు జరిపారు. ఇంథన పధకాల్లో పెట్టుబడుల గురించి వారు చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ముఖ్యమైన మిలిటరీ, వ్యూహాత్మకంగా గట్టి బంధం ఉందనేందుకు ఇది నిదర్శనమని, మానవహక్కుల సమస్యల కంటే ఇంథన భద్రతకు ఫ్రాన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలన్నీ సిరియాపై అమలు జరుపుతున్న ఆంక్షలన్నింటినీ ఎమిరేట్స్ వ్యతిరేకించటమే కాదు, వాటిని ఎత్తివేయాలని కోరుతున్నా, అదేమీ తెలియనట్లు ఫ్రాన్స్ ఉంది.
తాము నిరంకుశ పాలకుడిగా వర్ణిస్తున్న అజర్బైజాన్ అధ్యక్షుడు ఇలహమ్ అలియెవుతో ఐరోపా సమాఖ్య (ఇయు) అధ్యక్షురాలు ఉర్సులా వాండెన్ లెయన్, ఇంథన కమిషనర్ కద్రి సిమ్సన్ అజర్బైజాన్ రాజధాని బాకులో చర్చలు జరిపారు. ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. సహకార మండలిని ఏర్పాటు చేశారు. వాటి ప్రకారం ఏటా 20బిలియన్ ఘనపుటడుగుల గాస్‌ను సరఫరా చేస్తారు. ఇప్పుడున్న సహజవాయు సరఫరా 2021లో 8.1బిసిఎంలను ఈ ఏడాది ఆఖరుకు 12బిసిఎంలకు పెంచుతారు. ఈ సంప్రదింపుల సందర్భంగా గతంలో ఇయు లేవనెత్తిన మానవహక్కుల అంశం ఏమైందని విలేకర్లు అడగ్గా తగు సమయంలో వాటిని లేవనెత్తుతామని, ఇప్పుడు కేవలం ఇంథన సహకారంపైనే కేంద్రీకరించినట్లు ఇయు అధికారులు సమర్థించుకున్నారు. తమ గురించి మంచిగా చెప్పేందుకు ఐరోపా రాజకీయవేత్తలకు అజర్బైజాన్ అక్రమంగా ఐరోపా బాంకుల ద్వారా మూడుబిలియన్ డాలర్లు చెల్లించినట్లు జర్నలిస్టుల బృందం వెల్లడించింది.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి రష్యా, చైనాలు మినహా ఇతర దేశాల గురించి గతంలో పశ్చిమ దేశాలు గతంలో ప్రస్తావించిన మానవహక్కుల అంశాలను పక్కన పెట్టేశారు. ప్రపంచ వ్యాపితంగా ప్రజాస్వామ్యం, మానవహక్కుల ఉల్లంఘనల గురించి 2020-24 కార్యాచరణ ప్రణాళికను ఐరోపా సమాఖ్య ప్రకటించింది. నూతన ఇంథన విధానంలో వాటి ప్రస్తావన లేకుండా చేశారు. ఇది ఐరాస నిరంతర అభివృద్ధి లక్ష్యాలకు లోబడి రూపొందించిన న్యాయమైన, సమగ్ర ఇంథన విధానం అని సమర్థించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి నిత్యం కబుర్లు చెప్పే ఐరోపా అగ్రదేశాలు ఇప్పుడు దానికి హాని కలిగించే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తికి పూనుకున్నాయి. దానికి రష్యాను దోషిగా చూపుతున్నాయి. రష్యా కోరుతున్నట్లుగా దాని భద్రతకు హామీ కల్పిస్తే ఉక్రెయిన్‌పై మరుక్షణమే దాడులు ఆగుతాయి, ఐరోపాకు అవసరమైన ఇంథనం రష్యా నుంచి లభిస్తుంది. కానీ వాటికి కావాల్సింది అది కాదు, ఆధిపత్యం. అందుకోసం మానవహక్కులు మంటగలిసినా, పర్యావరణానికి భంగం కలిగినా అమెరికా కూటమి దేశాలకు పట్టదు. గాస్ సరఫరాలో ఆటంకాల కారణంగా జర్మనీలో కూడా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి మరోసారి పెరుగుతోందని జర్మన్ ఛాన్సలర్ షఉల్జ్ చెప్పాడు.
ఒకవైపు రష్యాను దెబ్బతీసేందుకు తమతో సహకరించాలని జో బైడెన్ గతవారంలో సౌదీ అరేబియాను కోరాడు. కానీ అదే సౌదీ తన విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన(డీజిలుకు దీనికి కొద్ది తేడా ఉంటుంది) ఇంథనాన్ని రష్యా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకొంటోంది. దీనిలో కొంత భాగం తన రేవులకు వచ్చే ఓడలకు ఇంథనంగా కూడా ఆమ్ముతోంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్ వివాదం తరువాత దిగుమతులు పెరిగాయి. గతేడాది ఏప్రిల్-జూన్ మాసాల్లో 3,20,000 టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 6,47,000 టన్నులకు పెరిగింది. గతేడాది మొత్తంగా పదిలక్షల 50 వేల టన్నులు దిగుమతి చేసుకుంది. దీని వలన చమురును శుద్ది చేసే ఖర్చు తగ్గుతుంది. తన చమురును అధిక ధరకు ఎగుమతి చేసుకోవచ్చు.మరో వైపు అమెరికా పెత్తనం చెల్లదు అనే సందేశాన్ని పంపవచ్చు. చమురు ఉత్పత్తిలో ఒపెక్, ఇతర దేశాల్లోని రష్యాతో ఇప్పటి వరకు సౌదీకి మంచి సంబంధాలే ఉన్నాయి.
ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నదనే సాకుతో తనపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా కొన్ని ప్రతిచర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దానిలో కాస్పియన్ పైప్‌లైన్ కన్సార్టియ(సిపిసి) పైప్‌లైన్ మూసివేత ఒకటి. కజకస్తాన్ నుంచి రష్యా మీదుగా (నోవోరోస్సిక్ రేవు) నల్లసముద్రం వరకు ఈ లైన్ ఉంది. దీనిలో పశ్చిమ దేశాలు, ఆసియా, రష్యాకు చెందిన కంపెనీలు భాగస్వాములు. వివాదం తలెత్తిన తరువాత ఈ పైప్‌లైన్‌లో ఒక భాగస్వామి కజకస్తాన్ ఐరోపా దేశాలకు చమురు సరఫరాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.దీంతో జూలై ఆరు నుంచి 30రోజులపాటు కజకస్తాన్ చమురు సరఫరా నిలిపివేస్తామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. మార్చినెలలో సంభవించిన తుపాను వలన ఏర్పడిన చమురు తెట్టు కారణాన్ని చూపినప్పటికీ ఐరోపా దేశాలను దెబ్బతీయాలన్నదే దీని వెనుక అసలు కారణం. ఈ లైన్ ద్వారా రోజుకు పదిలక్షల పీపాల సరఫరా జరుగుతోంది. దీనిపై ఆధారపడిన చెవరాన్, ఎక్సాన్ మోబిల్, షెల్, ఎని అనే పశ్చిమ దేశాల కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోతే అవి ప్రభుత్వాల మీద వత్తిడి పెంచుతాయి. ఇవి కజకస్తాన్‌లో చమురు వెలికితీస్తున్నాయి. ఉక్రెయిన్ వివాదం తరువాత ఈ కంపెనీలు కొన్ని రష్యాలో తవ్వకాలను నిలిపివేశాయి. ఒకనాడు భ్రష్టుడన్న సౌదీ రాజు సల్మాన్‌తో జో బైడెన్ దిగిన ఫొటో ఒక చర్చగా మారింది. మానవహక్కుల గురించి అమెరికా వంచనకు ఇది పక్కా నిదర్శనమని, వారికి అవసరం అనుకుంటే విలువల వలువలను నిస్సిగ్గుగా విప్పి పక్కన పెడతారంటూ వ్యాఖ్యలు వెలువడ్డాయి.ఐరోపా దేశా లూ దీనిలో తక్కువేమీ కాదు !
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288