Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత డిసెంబర్లో పార్లమెంటులో ఓ ప్రశ్నకు బదులిస్తూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అనేక కంపెనీలు ఐ.పి.ఓ రూపంలో పబ్లిక్ ఆఫర్‌తో ముందుకు వచ్చాయని, 2021 అక్టోబర్ నాటికి 56 కంపెనీలు దాదాపు రూ. 31,000 కోట్ల మేరకు పెట్టుబడులు సేకరించాయని, గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువని అన్నారు. ఐ.పి.ఓ లు భారీగా ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన కారణంగా మదుపుదారులు నష్టపోయినట్లు భావించలేమని అన్నారు. ఒకసారి వాస్తవ పరిస్థితులను గమనిద్దాం. గత ఆర్థిక సంవత్సరంలో జొమాటో, పేటిఏంలు లక్ష కోట్ల రూపాయల మార్కెట్ కాపిటలైజేషన్ పేరుతో స్టాక్ మార్కెట్లో హల్చల్ చేశాయి.
జొమాటో పబ్లిక్ ఇష్యూ
జొమాటో ఆహారాన్ని చేరవేసే ఒక ఆన్లైన్ సంస్థ. జొమాటో, స్విగ్గీ సంస్థలు ఫుడ్ ఆన్లైన్లో 95శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2021 జులై 23న జొమాటో సంస్థ పబ్లిక్ ఇష్యూకు వెళ్ళింది. దీనిపై విపరీతంగా మీడియాలో ప్రచారం జరిగింది. జొమాటో ప్రారంభ ధరగా షేర్‌కు రూ.76 నిర్ణయించారు. అయితే, దాని షేర్లు 38 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యి, మొదటి రోజు చివరకు దాని షేర్ విలువ రూ.116కు ఎగబాకింది. అంటే 51శాతం పెంపు. దీంతో జొమాటో మార్కెట్ కాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలు అయ్యింది. ఇది స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. నిజానికి జొమాటో ఏమన్నా ఉత్పత్తి చేస్తుందా అంటే లేదు. జొమాటో ఏమన్నా ఆహారాన్ని తయారు చేస్తుందా అంటే, అదీ లేదు. రెస్టారెంట్లు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. జొమాటో దేశవ్యాప్తంగా దాదాపు 1000 నగరాల్లో ఉన్న నాలుగులక్షల పైబడి రెస్టారెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. జొమాటో యాప్‌లో ఎవరైనా నచ్చిన రెస్టారెంట్లో ఆహారాన్ని బుక్‌చేస్తే, ఆ సంస్థకు చెందిన డెలివరీ బోయస్్ ఫుడ్ డెలివరీ చేస్తారు. ప్రతీ నెల సుమారు 3.2 కోట్ల కస్టమర్లు జొమాటో యాప్‌ను ఉపయోగిస్తున్నారని అంచనా !
జొమాటోకు రూ.లక్ష కోట్ల విలువ ఎలా వచ్చింది అంటే ఫుడ్ డెలివరీ సేవల వల్ల విలువ వచ్చింది. అంటే, డెలివరీ సేవలు అందిస్తున్న కుర్రాళ్ల వల్లే!! పోనీ ఈ డెలివరీ కుర్రాళ్లు లాభపడుతున్నారా! అదీ లేదు. ఈ కుర్రాళ్ళు పర్మినెంట్ ఉద్యోగస్తులు కాదు. తాత్కాలికంగా పని చేసే కాంట్రాక్టు కార్మికులు. ఎండనకా, వాననకా 365 రోజులు రోజుకు 12 నుంచి 14 గంటలు పని చేస్తే వారికి రోజుకు రూ.400 నుండి రూ.500 లభిస్తాయి. ఇదిగాక ట్రిప్‌కు ఒక రూ.15 టిప్ రావచ్చు. కార్మికులు దోపిడీకి గురవుతారనేదానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
మరి జొమాటో సంస్థ ఏమన్నా లాభాల్లో ఉందా! అంటే అదీ కాదు. 2018 నుండి 2021 నాటికి రూ.4600 కోట్ల నష్టాల్లో ఉంది. ఈ నష్టాలను బయటి ఇన్వెస్టర్లు సాంకేతికంగా భరించారు. పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలని నిర్ణయిం చారు. జొమాటో విలువను ఒక 'స్వతంత్ర సంస్థ' రూ.60,000 కోట్లుగా లెక్కించింది. దీంతో రూ.9400 కోట్ల ఐపిఓలో కేవలం రూ.400 కోట్లే కంపెనీకు వచ్చింది. మిగతా రూ.9,000 కోట్లు బయటి ఇన్వెస్టర్లు దక్కించు కున్నారు (వారు పెట్టిన పెట్టుబడులపై భారీ లాభాలు దక్కాయి). 2022 మార్చి క్వార్టర్‌కు రూ.1200 కోట్ల నష్టాన్ని మూటకట్టుకుంది. దానికి కారణం 40శాతం సబ్సిడీలు ఇవ్వడమే అని చెపుతున్నారు. 2022 జులై 13 నాటికి జొమాటో షేర్ ధర రూ.58. మార్కెట్ కాపిటలైజేషన్ రూ.46,000 కోట్లకు పడిపోయింది. దీంతో నష్టాలు సామాన్య మదుపుదారులు భరించవలసి వస్తుంది. ఇదే కథ పేటీఎం విషయంలోనూ పునరావృతం అయ్యింది.
పేటీఎం ప్రహసనం
పేటీఎం మాతృ సంస్థ అయిన 'వన్ 97 కమ్యూనికేషన్స్' ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్లను సేకరించింది. నవంబర్ 18న రూ.1.39 లక్షల కోట్ల సంపదతో ఇండియాలో టాప్ 50 కంపెనీలలో పేటీఎం ఉంది. పేటీఎం ఇష్యూ ధర రూ.2,150గా ఉంటే... ప్రస్తుతం ఇది రూ.708 వద్ద ట్రేడవుతోంది. ఇది రూ.500 దిగువకు పడిపోవచ్చని స్టాక్ మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు!! ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్ల నుంచి రూ.45 వేల కోట్లకు దిగొచ్చింది. 'వన్ 97 కమ్యూనికేషన్స్' షేర్లు భారీగా పడిపోతుండటంతో.. ఇష్యూ ధర కంటే 70శాతం వరకు పేటీఎం స్టాక్ దిగొచ్చింది. స్టాక్ మార్కెట్ మాయాజాలన్ని ఈ ఉదాహరణలనుబట్టి అర్థం చేసుకోవాలి. జొమాటో, పేటీఎం లాంటి సంస్థలు ఐపిఓకు వెళ్తుంటే, ఐపిఓ వాల్యుయేషన్ ధరను ఏ ప్రాతిపదికన నిర్ణయించారో, దానిని ఆమోదించిన 'సెబి' (ఎస్ఇబిఐ) జవాబు చెప్పాలి కదా? స్వతంత్ర వాల్యూయర్ స్వతంత్రత ఏ పాటిది?
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ), బడా ఇన్వెస్టర్లు ఆడుతున్న ఈ క్రీడలో అంతిమంగా నష్టపోయేది సామాన్య మదుపు దారులే. సంస్థ ఆస్తులు, టర్న్ ఓవర్, వ్యాపార అవకాశాలు, లాభనష్టాలతో సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ విలువ పెరుగుతోందంటే, అది జూదం అని, కొంతమంది జూదగాళ్ల మాయాజాలమని మనం అర్థం చేసుకోవాలి. ఇదిలా ఉంటే, ప్రభుత్వ రంగ సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యాక వాటి షేర్లకి నిజమైన విలువ లభిస్తోందా? గత అనుభవాలు చూస్తే, అలాంటిది లేదనే చెప్పాలి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సమాచారం ప్రకారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 100 ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 2021 ఏప్రిల్ నుండి 2022 ఫిబ్రవరి దాకా 0.57శాతం (రూ.12,300 కోట్లు) తగ్గిపోయింది. ఒకపక్క స్టాక్ మార్కెట్లో కుబేరుల సంపద అమాంతం పెరుగు తుంటే, ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు మాత్రం ఎందుకు పెరగడం లేదు?
ఈ స్టాక్ మార్కెట్ విన్యాసాలలో సామాన్య రిటైల్ మదుపుదారుల (అంటే రూ.2 లక్షల వరకు మదుపు చేయగల వారు) పాత్ర గమనిస్తే, ఆశ్చర్యపరిచే విషయాలు తెలుస్తాయి. ఐపిఓ ద్వారా లభించిన షేర్లు, ఆ తర్వాత కాలంలో చిన్న మదుపుదారుల చేతుల్లో చాలా తక్కువ శాతం ఉంటున్నాయి? అనేక ప్రభుత్వ రంగ సంస్థల, బ్యాంకుల షేర్ హౌల్డింగ్ వ్యవహారం చూస్తే, సామాన్య మదుపుదారుల వాటా కేవలం 1శాతం, అంటే నామమాత్రం!
మన దేశ బీమా రంగంలో ఇప్పటికే లిస్ట్ అయిన ప్రయివేటు బీమా కంపెనీలు, ఎస్బిఐ లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బీమా కంపెనీలలో షేర్ హౌల్డింగ్ వివరాలు పరిశీలిస్తే ఆయా కంపెనీలలో పబ్లిక్ (సామాన్య, రిటైల్ మదుపుదారుల వాటా) వాటా కేవలం 0.01శాతం. మిగతాదంతా ప్రమోటర్ల, దేశీయ, విదేశీ సంస్థాగత మదుపుదారులదే.
ఆర్థిక వ్యవస్థకు చెందిన ఉత్పాదక రంగాలతో సంబంధం లేకుండా ఫైనాన్స్ పెట్టుబడి ముందుకు సాగుతోంది. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ల ద్వారా భారీ లాభాలు ఆర్జించే స్థితిలో ఫైనాన్స్ పెట్టుబడి ఉంది. అందుకే మన ఆర్థిక వ్యవస్థ ఎంత సంక్షోభంలో ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లో భారీ పెరుగుదల కనపడుతున్నది. నిజ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్లు మాత్రం రోజురోజుకీ పెరగడం మనం చూస్తున్నాం. 2020-21 మధ్య ఆర్థిక వ్యవస్థ దిగజారి ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వినిమయ డిమాండ్ దెబ్బతింది. 55శాతం కుటుంబాల ఆదాయాలు పడిపోయాయి. అయితే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీల నికర లాభం 57.6 శాతం పెరిగి 5.31 లక్షల కోట్లకు చేరుకుంది.
ఇకనైనా ప్రభుత్వం నిజ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలి. ప్రజల కొనుగోలు శక్తి, వినిమయ శక్తి పెంచే ఆర్థిక విధానాలు అమలు చేయాలి. స్టాక్ మార్కెట్లకు మాత్రమే కాకుండా, ప్రజల పొదుపుకు ప్రోత్సాహం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే, సామాన్య మదుపుదారులు స్టాక్ మార్కెట్ విన్యా సాలకు గురవ్వరు.
- పి. సతీష్
సెల్ : 9441797900