Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి అందాలతో ఎప్పుడు ఆహ్లదంగా జీవించే ఆదివాసీ అదే ప్రకృతి విలయతాండవంలో విలవిల లాడుతున్నాడు! మరి ఈ పాపం ఎవరిది? దాదాపు 32ఏండ్ల తరువాత మళ్ళీ 70అడుగులు దాటి వరదలు రావడనికి కారణలు ఏమిటి? గతంలో ఇంతకంటే ఎక్కువ వర్షాలు కురినప్పటికీ, ఈ స్థాయిలో రాని వరదలు గత రెండు మూడు సంవత్సరాల నుండి చిన్న చిన్న వర్షాలకు కూడా భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయికి చేరుకున్నాయి. ఈసారి ఏకంగా 70అడుగులకు తట్టడం వెనుక అసలు కారణం పోలవరమే! ఇది కాదనలేని సత్యం. పాలకులు తమ రాజకీయ అవసరాలు కోసం అవకాశంగా ఎంచుకున్న పోలవరం ప్రాజెక్టు వలన, నేడు లక్షలాది ప్రజలు ప్రతి ఏటా వరదలకు నరకయాతన అనుభవిస్తున్నారు.
గతంలో ఆదివాసీలు పోలవరం ప్రాజెక్టు వద్దని, దాని వలన లక్షల మంది ఆదివాసీలు జలసమాధి అవుతారనీ, కొన్ని వేల హెక్టార్ల ఆదివాసీ భూభాగం జలమయం అవుతుందనీ, ఎన్నో వన్యప్రాణులు, ఎన్నో జీవ జాతులు అంతరించి పోయే ప్రమాదం ఉందని ఉద్యమాలు చేశారు. ఎంతో మంది మేధావులు, ఇంజనీర్లు ఈ ఉద్యమానికి మద్దత్తు తెలిపి ఉన్నారు. అయినప్పటికీ ఆదివాసీ ప్రజా ఉద్యమాన్ని ఈ పాలకులు తుపాకీతో అణిచివేసి మొత్తానికి పోలవరం నిర్మాణం చేపట్టారు. కానీ నిర్వాసితులను గాలికి వదిలేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన దోబూచులాటలో చివరికి ఆదివాసీలు సమిధులయ్యారు.
ఎక్కడ పునరావాసం ప్యాకేజి?
ప్రభుత్వాలు మేమంటే మేము అని ఒక ప్రభుత్వం తరువాత ఒక ప్రభుత్వం పోటాపోటీగా ప్రాజెక్టుని పూర్తి చేస్తూ వచ్చాయి. కానీ ఏ ప్రభుత్వమూ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ముందు నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు పూర్తి చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడకి చేర్చాలని ఆలోచన చేయలేదు సరికదా, ఆదివాసీ ఆర్తనాదాలపై ప్రాజెక్టుని ఆఘమేఘాలపై నిర్మిస్తూవచ్చారు. ప్రజలకు నిలవనీడలేకుండానే, వాళ్ళని బలవంతంగా బయటకు గెంటేస్తూ ప్రాజెక్టుని పూర్తి చేస్తున్నారు. సరైన పునరావాసం లేక ఆదివాసీలు ముంపు ప్రాంతంలోనే తమ జీవనాన్ని బిక్కుబిక్కు మంటూ కొనసాగిస్తున్నారు. సర్వేలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ప్యాకేజి ఊసేలేదు. 18 సంవత్సరాలు నిండిన వారికి రావలసిన ఐదులక్షల పరిహారం పూర్తిగా పక్కదోవ పట్టింది. సర్వేలు జరిగిన సమయంలో ఎంతో మందికి 18సంవత్సరాలు నిండలేదు, ఇప్పుడు దానికి డబుల్‌గా 18ఏండ్లు నిండిన యువత ఉంది, గతంలో 18నిండిన వారికి ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు కొంతమందికి పెళ్లిళ్లు అయిపోయాయి. ఇలాంటి గందరగోళంలో ప్యాకేజి అందేది ఎంతమందికి? అంతేకాక ఎన్నో గ్రామాలు ముంపులో లేనట్లు ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరదల్లో అధికారుల డొల్లతనం బయట పడింది. మరి అయా ముంపు గ్రామాలను కూడా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా గుర్తించి తమకు న్యాయం చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు, వారి గోడును ప్రభుత్వాలు పట్టించు కుంటాయో లేదో అనుమానమే. మరోపక్క నిర్వాసితులకు నిర్మించిన పునరావాస కేంద్రాలు చాలా దారుణంగా ఉన్నాయి. సరైయిన మౌలిక వసతులులేక అక్కడ ప్రజల ఎన్నో అవస్థలు పడుతున్నారు.
ఇంకా ఎన్నాళ్లు ఈ వరద బాధలు
ప్రతి సంవత్సరం వచ్చే వరదల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పోలవరం ముంపు గ్రామాల పరిస్థితి మరీ దయనీయం. ప్రస్తుతం వచ్చిన వరదల కారణంగా సుమారు వారం రోజుల నుండి కంటి మీద కునుకు లేకుండా ప్రజలు పస్తులతో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే తాత్కాలిక సదుపాయాలు కొంతమందికే అందుతున్నాయి. గుట్టల్లో అడవుల్లో తలదాచుకున్న వారి పరిస్థితి మరి దయనీయం. కానీ ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లుగా వ్యవహరి స్తున్నాయి. ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి పరిస్థితిలు ఎన్ని ఎదురుకోవాల్సి వస్తుందో. దీనికి శాశ్వతం పరిస్కారం చూపాలని ప్రజల కోరుతున్నారు. పాలకులు నిర్లక్ష్యానికీ, వారి రాజకీయ స్వార్ధ ప్రయోజనాలకూ అమాయక ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించి, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
వరదలు నేర్పిన గుణపాఠం
ప్రస్తుతం వచ్చిన వరదలు కేవలం మచ్చుకు మాత్రమే పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తరువాత. ప్రాజెక్టులో నీటి నిల్వ కారణంగా ప్రతి చిన్న వర్షానికి, ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదలకి బ్యాక్ వాటర్ వలన లోతట్టు ప్రాంతాలు తరుచూ ముంపుకి గురి అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక సంక్షోభంలో నిర్వాసితులను ఆదుకోవడం అంటే అనుమానమే! ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న శ్రద్ధ, నిర్వాసిత ప్రజల కష్టాలు తీర్చడంలో లేకపోవడం విచారకరం.
వరదలు తగ్గిన తరువాత వచ్చే సమస్యలపై దృష్టిపెట్టాలి
వరదలు తగ్గిన తరువాత ఇండ్లలో, గ్రామంలో బురద పేరుకు పోతుంది. దీనికి తోడుగా పాములు, విష పురుగులు తిష్ట వేస్తాయి. అసలుకే వర్షాకాలం... కనుక సీజనల్ వ్యాదులు భయంకరంగా విజృభించే ప్రమాదం ఉంది. ఏజెన్సీలో అరకోర వైద్య సదుపాయాలే అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వాలు శానిటేషన్, ఎమర్జెన్సీ వైద్యం అందేలా చర్యలు తీసుకోకుంటే ప్రజలు విషజ్వరాలు బారిన పడే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కండ్లు తెరిచి ముంపు ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి.
- కుంజా శ్రీను,
సెల్ : 7995036822