Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు, భద్రాచలం భవిష్యత్తుపై అనేక సందేహాలు రేకెత్తించాయి. అసలు భద్రాచలం ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నదా? అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి. 2020 జూలై 15న 71.03 అడుగులకు వరద ప్రవాహం పెరిగింది. 24,35,059 క్యూసెక్కుల నీరు పారింది. ఆరోజు రాత్రి భద్రాచలం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఏ సమయంలో ఏం జరుగు తుందోనని ఆందోళనల చెందారు. కరకట్ట తెగుతుందని వార్తలు గుప్పుమన్నాయి. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఏటపాక వద్ద కరకట్ట పైకి నీరు ఎక్కి సుమారు 2గంటలపాటు పారింది. అధికారులు కరకట్టను అనుకొని ఉన్న ముంపు ప్రాంతవాసులను యుద్ధ ప్రాతి పదికన రాత్రికిరాత్రే ఇండ్లలో నుంచి కట్టుబట్టలతో ఖాళీ చేయించారు. జులై 16 నుండి గోదావరి తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ వరదల వల్ల భద్రాచలం నియోజకవర్గంలో 3 మండలాలు, పినపాక నియోజకవర్గంలో 3 మండలాలు మొత్తం 6 మండలాల పరిధిలో 95 గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.
మునుపెన్నడూ ఇంత వరద రాలేదా?
గోదావరి చరిత్రలోనే 1986 ఆగస్టు 16న భద్రాచలంలో నీటిమట్టం అత్యధికంగా రికార్డుస్థాయిలో 75.6గా నమోదైంది. 1993లో కూడా 72.5 వచ్చినట్టు రికార్డు ఉన్నది. దీని తర్వాత 1990లో 70.8 అడుగులదాకా వచ్చింది. ఈ రికార్డులను దృష్టిలో పెట్టుకొని ఆనాటి స్థానిక శాసనసభ్యులు కుంజా బుజ్జి, ముఖ్యమంత్రి ఎన్.టీ. రామారావు భద్రాచలం కరకట్టకు ఆలోచన చేశారు. ఆ తరువాత సున్నరాజయ్య నేతృత్వంలో 2021లో శంకుస్థాపన చేసి 2002లో పూర్తిచేసిన ఈ కరకట్ట నిర్మాణం, నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. నాటినుండి ఈ కరకట్టే భద్రాచలం ప్రజలను కాపాడుతుందనేది కాదనలేని సత్యం. కరకట్ట నిర్మాణం తరువాత అనేక సందర్భాలలో గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించినా ప్రజలు అంతగా భయపడలేదు.
ఇప్పుడెందుకు ఆందోళన
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర బీజేపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరిం చింది. అందుకు వీలుగా ఆంధ్ర, తెలంగాణ విడిపోయే సమయంలో పోలవరం నిర్మిస్తే ముంపునకు గురయ్యే ఏడు మండలాలను (భద్రాచలం, చింతూరు, కూనవరం, విఆర్‌పురం, వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గం పాడులో కొంత భాగం) ఆంధ్రలో కలుపుతూ, విభజన చట్టంలో పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో తెలంగాణ మాట్లాడకుండా ముందటి కాళ్లకు బంధం వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ పోలవరం డ్యామ్ నిర్మాణమే నేటి ఈ విపత్తులకు ప్రధాన కారణం.
గోదావరిపై నిర్మించిన కరకట్ట తెలంగాణ లో, ఆంధ్రాలో కూడా ఉన్నది. ఇప్పుడు వచ్చిన వరద ప్రమాదం ఆంధ్రాలో ఉన్న కరకట్టపై ఏటపాక సమీపంలో తలెత్తింది. కానీ మునిగేది తెలంగాణలోని ప్రాంతం కాబట్టి ఆంధ్ర పట్టించుకోలేదు, తెలంగాణ మా పరిధిలోది కాదని సంకోచించింది. ఇది పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వలన వస్తున్న సమస్య కాబట్టి, పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. కానీ, ప్రాజెక్టు నిర్మాణంతో తప్ప, పునరావసంతో మాకు సంబంధం లేదని బీజేపీ చెబుతోంది. చివరికి ఈ రాజకీయ క్రీడలో ప్రజలు బలిపశువులవుతున్నారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల దోబుచులాట, చోద్యం చూస్తున్న కేంద్రం ఈ నేపథ్యంలో భద్రాచలం ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందన్న ప్రజల ఆందోళనలతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్చను లేవనెత్తుతోంది. తమ ప్రభుత్వ తప్పేమి లేదనీ, సమస్య పరిష్కారానికి పోలవరం ఎత్తు తగ్గించాలి, లేదా ముంపునకు గురవుతున్న ఏడుమండలాలను, కనీసం భద్రాచలాన్ని అనుకోని ఉన్న ఐదు పంచాయతీ లనైనా (పుచుకలపాడు, కన్నాయి గూడెం, ఏటపాక, గుండాల, పురుషోత్తపట్నం) తిరిగి తెలంగాణకు ఇవ్వాలనీ, అలా కాని పక్షంలో పోలవరం నిర్మాణం పూర్తయితే భద్రాచలం మునుగి పోతుందని వాదిస్తున్నది. ఈ విషయంపై అంధ్ర ప్రభుత్వం స్పందిస్తూ విభజనచట్టంలో అన్ని విషయాలు పొంది పరిచారు, తెలంగాణ అమోదించింది, ఈ ఎనిమిదేండ్ల కాలంలో ఏనాడూ ఒక్క మాట మాట్లాడకుండా ఇప్పుడు రాజకీయ ప్రయో జనాల కోసం మాపై నిందలు వేయడం తగదని వాదిస్తున్నది.
ఈ రెండు ప్రభుత్వాలను సమన్వయం చేసి, వరద విపత్తు నుండి ప్రజలను కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వమేమో ''పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత మాత్రమే మాది, పునరావాసం మీరే చూసు కోవాల''ని బాధ్యతలేని మాటలు చెబుతున్నది. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల వాద ప్రతి వాదనలు ఎలా ఉన్నా, ఎవరి రాజకీయ ప్రయో జనం ఎంత ఉన్నా, సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే.
1. ముంపు ఏడు మండలాలు ఇవ్వకపోయినా భద్రాచలాన్ని అనుకొని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి. 2. కరకట్ట ఎత్తు పెంచాలి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలి. డిజైన్ మార్చాలి. 3. భద్రాచలం వద్ద నిర్మాణమైన కరకట్టను ఎత్తు పెంచి ఇటు చర్ల వరకు అటు ఏటపాక వరకు పొడిగించాలి. 4. దక్షిణ అయోధ్య పేరొందిన భద్రాచలంలో రాముడి గుడి మునగకుండా, దేవస్థానం భూములు కూడా పురుషోత్త పట్నంలో ఉన్నవి కాబట్టి ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపి ప్రజలను, రాముని దేవస్థానం భూములను, రామాలయాన్ని కాపాడాలి. ఈ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఇక నిర్మాణం పూర్తి అయితే పోలవరం బ్యాక్ వాటర్ వలన భద్రాచలం, పినపాక, ములుగు నియోజక వర్గాలలోని సుమారు 500 గ్రామాలు, 10 మండలాలు ముంపుకి గురి అవుతాయనే సందేహాలను కూడా కేంద్రమే పరిష్కరించాలి.
భద్రాచలంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, అన్యాయం
తమ రాజకీయ ప్రయోజనాల కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం భద్రాచలం నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశాయి. నాలుగు మండలాలు ఆంధ్రాలో కలిపి అన్యాయం చేశాయి. దక్షిణ అయోధ్యగా, సాంస్కృతిక కేంద్రంగా, చారిత్రక ప్రాధాన్యత కలిగిన భద్రాచలాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసారు. భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు, భద్రాచలం నియోజకవర్గంలో సూదిమొన మోపెంత భూమిని కూడా ఆంధ్రకు ఇవ్వమని బీరాలు పలికిన నేతలు... కనీసం కరకట్టకు మరమ్మత్తులు కూడా చేయించలేదు. వరదలు వస్తే ముందస్తు ప్రణాళిక లేదు. టెక్నాలజీ ఇంత పెరిగినా స్లూయిజ్ వద్ద లీక్‌లను అరికట్టే మోటార్లు అమర్చాలన్న సోయి కూడా టీఆర్ ఎస్ ప్రభుత్వానికి లేదు. ఫలితంగా వరదలు వచ్చిన ప్రతిసారీ ఇదొక తంతుగా మారింది.
ముఖ్యమంత్రి వాగ్దానంలో విశ్వనియత ఎంత?
ఈ వరదల కారణంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్ల తర్వాత ఎట్టకేలకు భద్రాచలం గడ్డపై అడుగు పెట్టారు. భద్రా చలంతో పాటు పినపాక నియోజక వర్గంలో ఉన్న ముంపు నుండి ప్రజలను కాపాడ టానికి శాశ్వత పరిష్కారం ఆలోచిస్తునట్లు చెప్పారు. అందుకు 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఎనిమిదేండ్లనాడు భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానని చెప్పి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ 1000 కోట్ల వాగ్దానమైనా అమలుకు నోచుకుంటుందా? అన్నప్రశ్నకు తావీయ కుం డా చిత్తశుద్ధితో నిరూపించుకుంటే మంచిది.
ముందే హెచ్చరించిన సీపీఐ(ఎం)
పోలవరం నిర్మాణం జరిగితే జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన సీపీఐ(ఎం) అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ప్రత్యామ్నాయ డిజైన్ చేయాలని, ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని అనేక నిర్మాణాత్మక సూచనలు చేసింది. నాటి ప్రభుత్వం పట్టించు కోలేదు. సరికదా పోరాడుతున్న సీపీఐ(ఎం) ఉద్యమకారులపై నిర్బంధం ప్రయోగించింది. చివరికి పోలీసు కాల్పులకూ తెగబడింది. 87 మందిపై రాజద్రోహం కేసు బనాయించారు. ఉద్యమకారులను వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. నేటికీ ఆ కేసులతో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆనాడు వ్యతిరేకించిన వారందరూ ఈనాడు సీపీఐ(ఎం) చెప్పిన అంశాలను బలపరచడం శుభ పరిణా మం. ఇప్పటికైనా పాలకవర్గాల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఐక్యంగా పోరాడి భద్రాచలంతో పాటు పినపాక, ములుగు జిల్లాలో ఉన్న ముంపు ప్రాంతాలను రక్షించుకోవడం కీలక కర్తవ్యం.
- మచ్చా వెంకటేశ్వర్లు
సెల్: 9490098192