Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రతిపక్షం అంటే ఇష్టం లేకుండా, నిత్యం అధికారంలో ఉండాలని కోరుకునే ప్రభుత్వం దేశభక్తియుతమైన ప్రభుత్వం కాదు, అది దేశద్రోహ ప్రభుత్వం'' అంటారు రాంనారాయణ సింగ్. కానీ నేడు దేశంలో ఏం జరుగుతోంది... ''కాంగ్రెస్ ముక్త భారత్'' నినాదమిచ్చారు నరేంద్ర మోడీ. ఆ పార్టీని ఓడించడం మాత్రమే కాక దాని నీచ సంస్కృతి నుంచి దేశాన్ని విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. అంటే దానర్థం అవినీతి, అప్రజాస్వామికం, కులతత్వం, దోపిడీ, ఆశ్రిత పక్షపాతం, వారసత్వ రాజకీయాలు, మోసం, ఏకపక్ష విధానాల నుండి విముక్తి అనే కదా..! కానీ జరుగుతున్నదేమిటి? ప్రభుత్వాల అప్రజాస్వామిక కూల్చివేతలతో పాటు, ఎంపిక చేయబడిన ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయించి, అరెస్ట్ చేయించడం ద్వారా మనం ''ప్రతిపక్షమే లేని భారతదేశం'' వైపు పయనిస్తున్నామన్న విషయాన్ని గమనించాలి.
2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చివేసే పనిని మొదలు పెట్టింది బీజేపీ. 2019లో కర్నాటకలో, మార్చి 2020లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీ ఎంఎల్ఏలను ప్రలోభపెట్టడం ద్వారా, బెదిరించడం ద్వారా ప్రభుత్వాల కూల్చివేతలో సఫలీకృతమైంది. తాజాగా శివసేన ఎమ్మెల్యేలలో చీలిక తీసుకొచ్చి ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్నీ అప్రజాస్వామికంగా కూల్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీలు బీజేపీని ఓడించి స్పష్టమైన మెజారిటీతో ఏర్పాటు చేసిన హేమంత్ సోరేన్ నాయకత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలనే దానిపై కేంద్రీకరించింది.
ప్రతిపక్ష పార్టీల ఎంఎల్ఏలను కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసిన ఫార్ములాను 2021 డిసెంబర్లో మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అనుసరించలేదని బీజేపీ ఆంతరంగికులు చెప్పారు. ఆ తరువాత మార్చిన ప్లాన్‌ను మహారాష్ట్రలో అమలు చేసి అనుకున్నది సాధిం చారు. కానీ, అక్రమ పాలనకు, అవినీతి మూలాలకు, అప్రజాస్వామిక ధోరణులకు తాము వ్యతిరేకమని చెప్పిన కమలనాథులు నేడు చేస్తున్నదేమిటి? కాంగ్రెస్ చేస్తే అప్రజాస్వామికమైనది. తాము చేస్తే ప్రజాస్వామిక మవుతుందా? ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మౌలిక లక్షణం. ప్రజాస్వామ్యానికి బలం ప్రతిపక్షం. ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షం విమర్శించడం లేదా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయడం లాంటి చర్యలు చేపడుతుందంటే, రాజ్యాంగం కల్పించిన బాధ్యతను ప్రతిపక్షం సక్రమంగానే నిర్వహిస్తుందనుకోవాలి. బలమైన ప్రతిపక్షం లేకుంటే, ప్రజాస్వామ్యం బలహీనపడి, చట్టసభలు తమ బాధ్యతలను నిర్వహించలేని స్థితిలో పడిపోతాయి.
కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షాలను చాలా అలక్ష్యం చేసింది. ఇది ప్రజాస్వామ్యం పనితీరుపై హానికరమైన ప్రభావాన్ని చూపింది. అయినా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ నేడు కాంగ్రెస్ పార్టీ మార్గాన్నే అంతకంటే దుర్మార్గంగా అనుసరిస్తున్నారు. రానున్న 30-40 సంవత్సరాలు బీజేపీ యుగమని హౌం మంత్రి అమిత్ షా బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అందుకోసం రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీయేతర పార్టీల నుండి ఫిరాయింపులను ప్రోత్సాహించడం, ఆ ప్రభుత్వాలను కూలదోయడమంటే ప్రజాస్వామ్యానికి మరణ మృదంగాన్ని మ్రోగించడమే కదా..!
ఒక పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోటీచేసి, విజయం సాధించిన సభ్యుడు ఆ పార్టీకి విశ్వాసంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 'విప్ సిస్టం' అనేది సభలోని రాజకీయ సంస్థ యొక్క అధికార యంత్రాంగంలో ఒక భాగంగా ఉంటుంది. కానీ ఆ 'విప్ సిస్టం' సభ్యుని హక్కులకు భంగం కలిగించదు. అందుకే, ఒక సభ్యుని ప్రవర్తన నియోజకవర్గంలోని ప్రజల అంచనాలకు దిగువన ఉంటే, అతడు మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళి వారి ఆమోదం పొందడానికి వీలుగా ''థియరీ ఆఫ్ రీకాల్'' అనే సాధనాన్ని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఒక అస్త్రంగా గుర్తించారు. ఒక సభ్యుడు ఏ పార్టీ గుర్తుపై గెలిచి, ఆ పార్టీకి విశ్వాసంగా ఉండక, తన పదవికి రాజీనామా చేయక, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరిస్తే ''థియరీ ఆఫ్ రీకాల్'' ఆయుధం సరియైనది. తాను ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి, తన పదవికి రాజీనామా చేయకుండా, తనకు టికెట్ కేటాయించిన పార్టీ పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించనపుడు, సభలో విశ్వాస పరీక్ష అనే దానికి అర్థం లేదు. అది కేవలం చట్ట విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన, నీతి బాహ్యమైన ఫిరాయింపులను చట్టబద్ధం, రాజ్యాంగబద్దం చేయడం తప్ప మరొకటి కాదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇతర పార్టీల శాసనసభ్యులను ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళి, ఫైవ్ స్టార్ హౌటల్లలో ఉంచిన తీరు కుట్ర జరిగిందనే భావననే కలిగిస్తుంది. అంతేకాక మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే ఎన్నికైన ప్రకటన వెలువడిన వెంటనే రెబెల్ ఎమ్మెల్యేలు, హౌటల్ లోని టేబుళ్ళపైన నృత్యం చేశారు. హౌటల్ యాజమాన్యం అలా చేయవద్దని వారించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆనందాన్ని టేబుళ్ళపైన నృత్యం చేయడం ద్వారా తెలియజేయడం, మన ప్రజాస్వామ్య సంస్కృతి యొక్క అసాధారణ వ్యక్తీకరణ. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో, రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్న గవర్నర్ భగత్‌సింగ్ కొష్యారీ ముఖ్యమంత్రికి మిఠాయిలు తినిపించాడు. అనేక ఉత్సవాల్లో పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తికి మిఠాయిలు తినిపించడం సాధారణం. కానీ మన కొత్త రాజకీయ పరంపరలో గవర్నరే మిఠాయిలు తినిపించే ధోరణి ఓ విపరీతం!
తమ తిరుగులేని అధికారాలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల సభ్యులకు వ్యతిరేకంగా 'ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టాన్ని' మోపడం దేశంలో ఇటీవలి కాలంలో ఒక ధోరణిగా మారింది. చట్టవిరుద్ధమైన చర్యలను ఎవ్వరూ క్షమించరు. నేరానికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అలాంటి వ్యక్తులు కేవలం ప్రతిపక్షంలోనే ఉన్నారా? పాలకపార్టీలో లేరా? 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలక పార్టీకి చెందిన ఏ ఒక్క సభ్యుని పైన అలాంటి కేసులు లేవు. ఏలినవారికి ఇలాంటి అనైతిక చర్యలు కేవలం ప్రతిపక్షంలోనే కనిపిస్తాయా?
ప్రజా జీవితాన్ని చెరిపి వేసే విషయంలో, సమస్యలను చక్కదిద్దే విషయంలో ప్రధానమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ కూడా క్షేత్రస్థాయిలో జరిగే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండి, రాజకీయ ప్రేరేపిత విచారణలను అనుమతించకూడదు. ఇలాంటి విషయాల్లో న్యాయమూర్తులు వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ లేదా ఇతర బెయిల్ మంజూరు చేయాలి. ప్రజాస్వామ్యం విఫలం చెందకుండా రాజకీయ పార్టీలు, న్యాయవ్యవస్థ, పౌరసమాజం చర్యలు చేపట్టాలి. ప్రతిపక్షం పట్ల పాలక పార్టీ సహనం వహించాలి. ఏది ఆరోగ్యకరమైన విమర్శో, ఏది అనారోగ్యకరమైన విమర్శో తేల్చే విషయం అధికారంలో ఉన్న పార్టీకి వదిలేస్తే, ప్రతిపక్షం వారు చేసే ఏ విమర్శనైనా అనారోగ్యకరమైనదిగానే పరిగణిస్తుంది.
రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చల సందర్భంగా, నజీరుద్దీన్ అహ్మద్ ఒక హెచ్చరిక చేశారు...: ''కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావనను సృష్టించాలనే కోరిక మీకు లేకుంటే, మీకు ఒక ప్రతిపక్షాన్ని సృష్టించే అవసరం ఉంటుంది. అవసరమైతే మీలోనే కొందరు సభ్యులు ప్రతిపక్షంలోకి వెళ్ళి, దానిని ఆరోగ్యంగానూ, శక్తివంతంగానూ తయారు చేయాలి'' అంటారు.
అదే సమయంలో ప్రతిపక్షం, విశ్వసనీయమైనదిగా, శక్తివంతమైనదిగా ఉండాలి. నిత్యం ప్రజల నాడిని తెలుసుకోవాలి. ప్రతిపక్షం గౌరవనీయమైనదిగా లేకుండా, గౌరవాన్ని కోరుకోలేదు. ఇది భారతదేశంలో ప్రస్తుతం ఉన్న మరో సవాల్. ప్రతిపక్షం నిర్మాణాత్మక పనికి పూనుకోవాలి. కేవలం ప్రధాన మంత్రి పైన దాడి చేయడం లాంటి చర్యలు మాత్రమే ప్రజాస్వామ్య పటిష్టతకు దోహదం చేయవు. ఒక సార్వభౌమాధికార, ప్రజాస్వామిక రిపబ్లిక్‌ను నెలకొల్పడం రాజ్యాంగపరమైన లక్ష్యం. మరి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదెవరు? భారతదేశం అప్రజాస్వామిక రిపబ్లిక్‌గా మారకుండా హామీ ఇచ్చే బాధ్యతెవరిది?
- బోడపట్ల రవీందర్
సెల్: 9848412451