Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అధ్యక్షా..! వీఆర్ఏలలో ఎక్కువ మంది దళితులు, బీసీలు, గిరిజనులు ఉన్నారు. కాబట్టి తమరి ద్వారా చెప్పేదే మంటే, వారికీ స్కేల్, ఉద్యోగం వస్తది. అధ్యక్షా... దీనివల్ల ప్రభుత్వం మీద సంవత్సరానికి దాదాపు 260కోట్ల దాకా అదనపు భారం పడుతుంది. కానీ, పాపం వాళ్లకు న్యాయం జరుగుతుంది. తరతరాలుగా మసుకూరిగా వేరు వేరు పేర్ల మీద వారు సమాజానికి సేవ చేసిండ్రు. వారి కుటుంబాలు బాగు పడుతాయి, వారి పిల్లలు బాగాపడుతారు అనే ఉద్దేశ్యంతోనే వాళ్లకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తాం అధ్యక్ష...''
ఈ ప్రకటన తేదీ: 20-9-2020 రోజు నిండు శాసనసభలో ముఖ్యంమత్రి గారు చేసినది. దీనితో ఈ రాష్ట్రంలోని 23వేల మంది విఆర్ఏలు, వారి కుటుంబ సభ్యులలో ఆనందం వెల్లివెరిసింది. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకాలు చేసారు. కానీ ముఖ్యమంత్రి గారు ప్రకటించి 22 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి జీఓ రాలేదు. వీఆర్ఏల ఆశలు అడి ఆశలయ్యాయి. ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలపై పని భారం మరింత పెరిగింది. రెవెన్యూలో అటెండర్‌గా, నైట్ వాచ్‌మెన్‌గా, కంప్యూటర్ ఆపరేటర్‌గా, డ్రైవర్‌గా, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా వీఆర్ఏలే ఈ పనులన్నీ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో పనులు కూడా చేస్తున్నారు. తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారు. అయినా వీఆర్ఏలకు ఎలాంటిి గుర్తింపు, ఉద్యోగ భరోసా లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాపితంగా ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో ఎటువంటి స్పందనలేదు. అందుకే న్యాయమైన డిమాండ్ల సాధనకు ఐక్య పోరాటాలు నిర్వహించాలని జేఏసీ ఆవిర్భవించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం పీఆర్సీ ఇచ్చారు. వీఆర్ఏలకు మాత్రం ఈ పీఆర్సీ అమలు కాలేదు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు అయిన తరువాత వీఆర్ఏ నుండి వీఆర్ఓ ప్రమోషన్ పద్ధతి పోయింది. వేతనాలు పెరగలేదు. పనిభారం మాత్రం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వీఆర్ఏ జేఏసీ సమ్మె నోటీసు అందించింది. డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించింది.
సమ్మెకు సన్నాహాలు: సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా సదస్సులు, ఈ నెల 20, 21, 22 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు జరిగాయి. వర్షాలను సైతం లెక్కచేయకుండా వీఆర్ఏలు మొక్కవోనిదీక్షతో పాల్గొన్నారు. అయినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. దీంతో నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయాల పికెటింగ్ జరుగుతోంది. పికెటింగ్ తరువాత కూడా సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ నెల 25 నుండి సమ్మె తప్పదు. ప్రభుత్వం బేషాజాలకు పోకుండా వీఆర్ఏలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి, సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రజాసంఘాలు, ప్రజలు, రాజకీయ పార్టీలు అండగా నిలవాలి.
- ఎస్.కె.దాదేమియా
సెల్:9848132061