Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కర్రపట్టుకొని పోలీసులకు ఎదురుగా గుడిసెకడ్డంగా నిలబడిన ఆదివాసీ మహిళల'' ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు, వీడియోలు గమనించిన ప్రతి ఒక్కరికీ తమలో అచేతనంగా ఉన్న చైతన్యాన్ని తట్టి లేపుతున్న భావం కలుగకమానదు. వారిని చూస్తుంటే ఈ గడ్డ మీద ఐలమ్మలు ఇంకా బతికే ఉన్నారని, కష్టపడి కట్టుకున్న గుడిసె జోలికొస్తే, కొట్టుకున్న పోడుని ముట్టు కుంటే తిరగబడితారని రుజువవుతున్నది.
తెలంగాణ మాగాణంలో చేను, చెలక అందులోని పంట, ఆ పంటల రక్షణకై తిరుగుబాటుకు ప్రతీక ఐలమ్మ. తెలుగునేల ఏ మూలన భూమికోసం, భుక్తికోసం ఎవరూ పోరు సలిపినా తెలంగాణ సాయుధ పోరాటం గుర్తుకొస్తది. అందులో ఐలమ్మ యాదికొస్తది. మరి ఆనాటి ఐలమ్మ పోరాటానికి నాటి నైజాం, భూస్వాములు, రజాకార్లు కారణమైతే, ఈనాటి ఈ ఐలమ్మల పోరాటానికి కారణమెవ్వరూ?
ఎండనక వాననక తరతరాలుగా అడవినే ఆధారం చేసుకొని బతుకుతున్న జీవులు ఆదివాసీలు. ఉండడానికి ఇంత గుడిసె, పొట్టకింత బువ్వ కోసం ఏ పుటకాపూట వెతుకులాట తప్ప ఇంకో బతుకుదెరువులేని అమాయకులు వాళ్లు. అలాంటి జీవితాల్లోకి, అడవిలోకి రాజ్యాల పెత్తనాలు జొరబడ్డాయి. వారి జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. వారు దశాబ్దాల తరబడి మనుగడ సాగించిన నేల వారిది కాదని, ఇప్పుడు తమదేనని రాజ్యపు అంగాలు వచ్చి ధూం ధాం చేస్తున్నాయి. పైగా అక్కడినుంచి తరిమేస్తే ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ తలదాచు కోవాలో దిక్కు తోచని స్థితిని అడవి బిడ్డలపై రుద్దుతున్నాయి. నేడే కాదు, ఈ రాజ్యం ఏర్పడిన నాటి నుంచీ గిరిజన జాతులు దాడులకు గురవుతూనే ఉన్నాయి.
ఈ దేశ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ మొత్తం గిరిజన తెగలు, ప్రాంతాలు ఆ ప్రజల హక్కుల గురించే నొక్కి చెపుతోంది. ''విద్య, ఆర్థిక పురోగతికై కృషి చేయాలి. వారిని అన్ని రకాల అన్యాయలనుండి, దోపిడీల నుండి రక్షించాలని'' రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ఆదేశిస్తోంది. అది ఆదేశమే అయ్యింది తప్పితే, ఆచరణ 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందంగా మారింది. పైగా భారత ప్రభుత్వం తెచ్చిన 1980 అటవీ చట్టం గిరిజనులను పెనం మీద నుంచి పొయ్యిలో పడేసింది. వారు నివశించే ప్రాంతాల్లోనే పరాయివారుగా, శత్రువులుగా పరిగణించబడు తున్నారు. గ్రామసభలకే అధికారాలు కట్టబెట్టిన పీసా చట్టం, వామపక్షాల చొరవతో వచ్చిన అటవీ చట్టం 2006 సాంత్వన కలిగిస్తాయి అనుకుంటే అమలుపరిచే నాధుడే లేడు. 2006 అటవీ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు అడవుల్లో జీవించే వారికి హక్కు పత్రాలు పట్టాలు ఇవ్వాలి. కానీ అది సక్రమంగా జరగలేదు. దేశ వ్యాప్తంగా నలభై లక్షల దరఖాస్తులు వస్తే పద్దెనిమిది లక్షల దరఖాస్తులను ఆమోదించి మిగతా వాటిని హౌల్డ్‌లో పెట్టారు. పదిలక్షల దరఖాస్తులను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో సరైన కారణాలు లేవు. గిరిజనులు తాము ఇక్కడి వాళ్ళమే అని పత్రాలు ఏడినుండి పట్టుక రాగలరు. ఇలాంటి కొర్రీలు ఎన్నో ఈ చట్టంలో కూడా యేలికలు మెలిపెట్టారు. ఇక వీటిని పరిష్కరించేగుణం ఎట్లాగూ ఇప్పటి నరేంద్రమోడీ బీజేపీ ప్రభుత్వానికి లేదు. పట్టాలు ఇచ్చే ఉద్దేశ్యం అసలే లేదు. మోడీ తన దోస్తులైన అంబానీ అదానీలకు ఏదైనా చేయగలడు. ఎంతైనా చేయగలడు. పోర్టులను అప్పచెప్పగలడు, రైల్వే కోచ్‌లను అప్పగించగలడు. యురేనియం గనుల తవ్వకాల కోసం చెంచుఆవాసమైన, పచ్చని నల్లమల అడవిని మల్టీ నేషనల్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర ఎట్లాగూ సాగుతూనే ఉంది.
పైన మోడీ రాజ్ తీరు అలా ఉంటే, కింద కేసీఆర్ తీరు కూడా 'అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న' అన్నట్లుంది. 2019 జూలై 19న అసెంబ్లీ సాక్షిగా జిల్లాల వారీగా పర్యటించి, అక్కడే కుర్చి వేసుకొని కూర్చోని మరీ పోడు సమస్యను పరిష్కరిస్తానని మహాగొప్పగా చెప్పాడు. మూడేండ్లయినా ఆ ముచ్చట ఎటుపాయనో తెలువదు!
ఆయన మాటలు నమ్మి ఆదివాసీలు ఇతర అడవి బిడ్డలు పొలోమని దరఖాస్తులు చేసుకున్నరు. 28జిల్లాల్లో 37మండలాల్లో 3041 పంచాయతీల పరిధిలో 12.60లక్షల ఎకరాలలో సాగుచేసుకుంటున్న పోడురైతులు 3.95లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సంవత్సరం గడుస్తున్నా ముఖ్యమంత్రి చడీచప్పుడు లేదు. మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు గూడాల మొఖం చూడలేదు. కానీ, ఎప్పటోల్గనే మళ్ళీ అటవీ అధికారులు, పోలీసులు పోడు భూములపై పడ్డరు. చట్టం పేరుతో వేసుకొన్న పంటపై, కట్టుకున్న గుడిసెపై పడి కనికరం లేకుండా కూల్చడం, పీకడం చేస్తూనే ఉన్నారు. అడ్డుకున్నందుకు 12మంది ఆదివాసీ మహిళలను చంటిపిల్ల తల్లులని కూడా చూడకుండా జైల్లోకి పంపిన కసాయి రాజ్యం ఇది. ఇప్పుడు మళ్ళీ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయ పోష గూడెం పోడుపై, గుడిసెలపై పోలీస్‌లు దాడి చేస్తున్నరు. నల్లగొండ సాగర్ ఎర్రచెర్వు తండా పోడు భూముల్లో పోలీసులు మొక్కలు నాటుతున్నరు. ఇలా నాగర్ కర్నూల్ నల్లమలలో, అదిలా బాద్, ఆసిఫాబాద్ అడవుల్లో, భద్రాచలం కొండల్లో, ఏటూరు నాగారం కోనల్లో అలజడి రేగుతూనే ఉంది. గూడు, పోడు కోసం మట్టి బిడ్డలు కర్రలు ఏత్తుతూనే ఉన్నరు. గిరిజన గుండెల్లో గుణపాలు దించి, నిలువ నీడ లేకుండా చేసి, ఫామ్‌హౌస్ నీడలల్లా ముఖ్యమంత్రి, మంత్రులు సల్లగ పండుకున్నరు. పైన ఉన్న ప్రధాన మంత్రికి ఎట్లాగూ ఇది వినబడదూ కనబడదూ. ఆయనకు కనిపించేదల్లా అదానీలూ అంబానీలే. లోకల్ బీజేపీ నాయకులైతే పత్తకు లేరు. ఉత్తుత్తి పనికిరాని పని కోసం రోజూ పంచాయతీలు పెట్టుకొనే బీజేపీ, టీఆర్ఎస్లు అసలు విషయాల్లో అస్సలు పోట్లాడుకోవు. నడిమిట్ల జనమే పరేషాన్. అడవి మనిషిని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటది. పారిశ్రామిక వేత్తలను, దొంగలను, దోపిడీ దారులను మాత్రం అడవి అడుగుల కింద గనులు ఊరిస్తూ ఉంటాయి. మనిషి మనుగడకే ఎసరు తెచ్చే ఏ వేషాలు ఎవరినీ వేయనీయొద్దు. అడవి అనేక వనరుల బాంఢాగారం. దాన్ని కాపాడుకోవాలి. అది అందరికీ పచ్చని బతుకును హామీ ఇస్తుంది. ప్రకృతి ఆనందపరవశుల్ని చేస్తుంది. ఉరుకులు పరుగులు లేవు. రణగొన ధ్వనులు లేవు. కాలుష్య కాసారం కానరాని కారడవి కమ్మగ కనిపిస్తది. ఎన్నో జీవులకు, జంతుజాలానికి అడవి అమ్మ వొడిలా తల్లి పేగు బంధంలా ఉంటది. అలా అడవిని అమ్మలాగ భావించే బందుజనం గిరిజనం. ఆ అడవి బిడ్డల పేగు బంధం నేడు ప్రమాదంలో పడ్డది. ఆదివాసీలు అడవి మల్లె పువ్వులు. అలా వాళ్ళ మానాన వాళ్ళను ఉండనిస్తే పువ్వుల నుంచి వెదజల్లే సువాసనల్లాగా వికసిస్తారు. తెంపితే ఐలమ్మల్లా తిరగబడుతారు. కొమురం భీముల్లా తుడుం మోగిస్తారు. కోయ గోండు గూడాల్లో తుడుం మోత మోగకముందే ప్రభుత్వాలు మెల్కోవాలి.
- ఎ. విజయ్ కుమార్
సెల్: 9573715656