Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కృషి... పట్టుదల... నిబద్ధత... అంకితభావం...' వివిధ సన్మాన, సత్కార కార్యక్రమాలు, విజయోత్సవ సభల్లో ఒక వ్యక్తి లేదా సంస్థ గొప్పతనాన్ని వివరించేటప్పుడు ఈ పదాలు వక్తల నోటి వెంట ఆనవాయితీగా దొర్లుతుంటాయి. రాజకీయ నాయకుల వేదికలు, సినిమా ఫంక్షన్లలో ఈ తతంగం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. 'అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టు...' సొంత మనుషులను పట్టించుకోని మహానుభావులు సైతం వేదికల మీద ఇలాంటి ఉపన్యాసాలనే దంచికొడుతుండటం రివాజు. ఈ క్రమంలో అంకిత భావం, నిబద్ధత అనే పదాలకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. వాటిని వాడటం వల్ల ఒక్కోసారి ఎంత గంభీరమైన వాతావరణం నెలకొంటుందో... ఇంకొన్నిసార్లు అదే గంభీరమైన వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోతూ ఉంటుంది. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో ఓ ఇష్టాగోష్టిలో మాట్లాడుతున్నప్పుడు ఇదే రకమైన సంభాషణ కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు బస్తీలు, కాలనీల్లోకి వరద నీరు పోటెత్తింది. అటువంటి భీకర పరిస్థితుల్లోనూ ఘనత వహించిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎమ్సీ) సిబ్బంది... ట్యాంకర్ల ద్వారా నగరంలోని రోడ్ డివైడర్ల మధ్యలోనున్న మొక్కలకు నీరు పోయటం భాగ్యనగర వాసులను 'దిగ్భ్రాంతికి' గురి చేసింది. ఈ వార్త 'దావానంలా' వ్యాపించిన క్రమంలో... చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించగా అక్కడి వాతావరణం మొత్తం గంభీరంగా మారిపోయింది. పాత్రికేయు లందరూ మంత్రి ఏం సమాధానం చెబుతారోనని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఒక్క క్షణం మౌనం దాల్చారు. అంతలోనే తేరుకుని... 'భారీ వర్షంలోనూ మా వాళ్లు (జీహెచ్ఎమ్సీ సిబ్బంది) మొక్కలకు నీరు పోస్తున్నా రంటే అది పనిపట్ల వారికున్న కమిట్మెంట్ (అంకితభావం)కు నిదర్శనం...' అంటూ వ్యాఖ్యానించటంతో అక్క డున్న వారందరూ ఘొల్లుమన్నారు.
-బి.వి.యన్.పద్మరాజు