Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరకలోకంలోకి ప్రవేశించిన నారదుడు అక్కడున్న పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయాడు. అంతా గందరగోళంగా ఉంది. ఎక్కడిక్కడ ధర్నాలు హర్తాళ్ళు జరుగుతున్నాయి. రాస్తారోకోలు కూడా చేస్తున్నారు. అప్పుడెప్పుడో ఎన్.టి.రామారావు, ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లో ఇలాంటివి చూసినట్లు గుర్తు! అంతేగాని నిజంగానే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు.
ఏదో విధంగా అన్నింటినీ దాటుకుంటూ యమధర్మరాజు నివాసానికి చేరుకున్నాడు. అక్కడ యమదర్బార్ జరుగుట లేదు. పూర్తిగా పడావుపడి ఉంది.
యమధర్మరాజు చింతాక్రాంతుడై కూర్చున్నాడు. చిత్రగుప్తుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. వారిద్దరికీ యమలోకంలో స్థితిగతులకూ సంబంధం ఉందని నారదుడు గ్రహించాడు.
''ఏమి జరిగింది యమధర్మరాజా!'' నారదుడు ప్రశ్నించాడు.
''ఏమి చెప్పమందువు నారదా! పరిస్థితులు చేయిదాటిపోయినవి'' అన్నాడు యమధర్మరాజు నీరసంగా.
''ఎందువల్ల పరిస్థితులు చేయిదాటిపోయినవి?'' చిత్రగుప్తుడిని ప్రశ్నించాడు నారదుడు.
''ఏమి చెప్పవలెను నారదా! ఈ భూలోకవాసులు కొంతకాలము నుంచి శిక్షలను మార్చవలెనని ఆందోళన చేయుచున్నారు. యమధర్మరాజుగారు కూడా కొన్ని శిక్షలు మార్చుటకై తమ అంగీకారమును తెల్పినారు. అయినా సరే భూలోకవాసులు అంగీకరించకుండా పోరాటానికి దినినారు!'' వివరించాడు చిత్రగుప్తుడు.
''ఏమిటీ...! శిక్షలు మార్చమని భూలోకవాసులు కోరుటjయూ, యముడు అంగీకరించుటయూ జరిగిపోయినదా? మరి మన ధర్మశాస్త్రములు ఘోషించుతున్నదంతా నట్టేట మునిగిపోయినట్లేనా! అయ్యో!'' అన్నాడు నారదుడు.
''శిక్షలు మార్చు ప్రతిపాదనను మాత్రమే భూలోకవాసుల ముందుంచితిమి! అంతేకాని అమలు చేయలేదు!'' అన్నాడు యముడు చిత్రగుప్తుడి వంక ఆగ్రహంగా చూస్తూ.
''వారి డిమాండ్లు ఏమిటీ? అందుకు మీ ప్రతిపాదనలు ఏమిటీ?'' అన్నాడు నారదుడు.
భూలోకంలోని భారత దేశమందు ''మేము చేసిన తప్పులకు మించిన శిక్షలు అనుభవిస్తూనే ఉన్నామని, అందువల్ల నరకంలో శిక్షలు విధించరాదని వారి డిమాండు! అందువల్ల ఒకటి రెండు శిక్షలను పాక్షికంగా మార్చుటకు సిద్ధపడితిమి! అయిననూ ప్రయోజనం లేకపోయింది'' నిట్టూర్చాడు యముడు.
''నాకేమి బోధపడటలేదు! అయినా శిక్షలు మార్చమని కోరుటలో భూలోకవాసుల ఆంతర్యమేమిటో?'' అన్నాడు నారదుడు సాలోచనగా.
''ఇంకేమున్నది భూలోకమునందు ముఖ్యముగా భారతదేశము నందు అనేక అంశాలలో మార్పు వచ్చుచున్నది కదా! ఆ మార్పులకు అనుగుణముగా ఇక్కడ కూడా శిక్షలు మార్చవలెనని వారి డిమాండ్ అని యమధర్మరాజుగారు ముందే తెలిపిరి కదా! మళ్ళీ ఆంతర్యాల గురించి, అంతరార్థాల గురించి ప్రశ్నించుట ఎందుకు?'' అన్నాడు చిత్రగుప్తుడు విసుగ్గా.
''అవును! ఆంతర్యాలు, అంతరార్థాల గోల నాకెందుకు? నేను నిష్క్రమించెదను. మా తాతగారైన విష్ణుమూర్తిని సందర్శించుకోవలెను!'' అంటూ నారదుడు వెళ్ళబోయాడు.
''చిత్రగుప్తుడి మాటలకేమి నారదా! ఇక్కడి సమస్య బహుజటిలమైనది! పరిష్కరించే సలహా చెప్పుము!'' అంటూ యముడు నారదుడి చెయ్యిపట్టుకున్నాడు.
నారదుడు మెత్తబడ్డాడు.
''భూలోకవాసుల కోరికలు న్యాయమో, అన్యాయమో తేల్చుకోలేకపోతున్నాను. వంట నూనెలు, పెట్రోలు, డీజిలు ధరలు విపరీతంగా పెరిగినందున, అవి కొనేందుకు పడే కష్టాలు నరకలోకం శిక్షలను మించి ఉన్నాయని, అందువల్ల సలసలకాగే నూనెలో వేయించటాన్ని రద్దు చేయాలంటున్నారు. బుల్డోజర్లతో తమ ఇళ్ళు కూల్చేస్తుంటే భరించలేని వేదన కలుగుతోందనీ, అందువల్ల మదపుటేనుగులతో తొక్కించే శిక్షలను రద్దుచేయాలంటున్నారు. హైదరాబాద్, ముంబాయి లాంటి నగరాలలో ప్రయాణించే వారికి సూది బెజ్జంలో నుండి బయటకు తీసే శిక్షలు రద్దు చేయాలని, రకరకాల కేసులు పెట్టి బెయిలురాకుండా జెయిల్లో వేస్తున్నందున ఇనుప ముక్కు కాకులతో పొడిపించటం మానివేయాలని, జీఎస్టీ అన్నింటిపైనా వసూలు చేస్తున్నందున, రాకాసి జలగలతో పీల్చే శిక్షను రద్దుచేయాలని, నిరుద్యోగులకు దేశంలో అగ్నిపథ్ అమలు చేస్తున్నందున రాబోయే కాలంలోయ మంటల్లో కాల్చే శిక్షను నిషేధించాలని భూలోకవాసులు డిమాండ్ చేయుచున్నారు నారదా?'' అన్నాడు యముడు భారంగా.
''వారి మాటలలో సత్యమున్నది కదా!'' అన్నాడు సాలోచనగా నారదుడు.
''ఇప్పుడు నీవు అంటున్నది నాకర్థం కావటం లేదు!'' అన్నాడు యముడు అమాయకంగా.
''ఇందులో అర్థం కాకపోవుటకేమి. భూలోకవాసులు కోరుకున్నది న్యాయమే! ఎందుకంటే వారు భూలోకములో శిక్షలను అనుభవించి, మరల ఇక్కడ కూడా శిక్షలు అనుభవించుట వల్ల ఒక తప్పుకు రెండు శిక్షలు అమలు జరుగుతున్నాయి. అందువల్ల వారి కోరిక న్యాయమే!'' అన్నాడు నారదుడు.
''అయ్యో! నాకెందుకీ పరీక్ష! నా ధర్మము నెరవేర్చుటకు ఇన్ని ఆటంకాలు వస్తుంటే ఎలా?'' అని యముడు బాధపడుతుండగా కళ్ళు చెదిరే కాంతివలయం ఆవిష్కృతమైంది. అందులో నుండి త్రిమూర్తులు సాక్షాత్కారించారు.
''త్రిమూర్తులారా పాహిమాం!'' అంటూ అందరూ ప్రణమిల్లారు.
''నాయనా యమధర్మరాజా! నీది ధర్మ సంకటమే. భూలోకవాసులది కూడా ధర్మమే. వారు అడిగిన దాంట్లో ఒక ముఖ్యమైన ధర్మసూక్ష్మం దాగున్నది! ఏ యుగములోనైనా తప్పు ఎంత ఉంటే శిక్ష కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఒక తప్పుకు రెండు శిక్షలు వేయుట అధర్మం! అయితే కలియుగంలో కొంత అటూ ఇటూ అమలు కావటం ఆ యుగధర్మం. కానీ, ఇటీవలి కాలంలో భూలోకవాసులు పడుతున్న బాధలు, ఆ యుగధర్మపు స్థాయిని దాటిపోయాయి. అందువల్ల మేము ఈ సమస్యకు పరిష్కారమును కనుగొనవలసి యున్నది. భూలోకవాసులు చేసినది ఒకే ఒక తప్పు. ఆ ఒక్క తప్పు వారిని ఇన్ని శిక్షలకు గురిచేయుచున్నది. కావున వారు ఆ ఒక్క తప్పుకు భూలోకంలోనే అనేక శిక్షలు అనుభవించు చున్నందున, నరకంలో వేరుగా శిక్షలు విధించవలసిన అవసరం లేదు. ఇది తాత్కాలికమే!'' అన్నారు విష్ణుమూర్తి.
''త్రిమూర్తుల ఆజ్ఞ శిరోధార్యము! శిక్షలు విధించే విధి లేనప్పుడు నేనేమి చేయవలెనో సెలవియ్యండి!'' అన్నాడు యముడు ముకుళిత హస్తాలతో.
శిక్షలు విధించేపని లేని కాలములో నీకు శిక్షణను ఇవ్వాలని నిర్ణయించితిమి. నీవు, నీ సిబ్బందితో సహా ఆర్టీసీలోని అధికారుల వద్ద శిక్షణ గైకొనండి!'' అన్నారు త్రిమూర్తులు.
''చిన్న సందేహం మిగిలింది! నివృత్తి చేయండి ప్రభూ! భూలోకవాసులు చేసిన ఆ చిన్న తప్పుఏమిటో సెలవియ్యండి!'' అన్నాడు చిత్రగుప్తుడు.
''కుల, మత, ప్రాంతీయ ఉన్మాదాలకులోనై, వాటిని రెచ్చగొట్టే పార్టీలకు ఓట్లేసి, వారిని అధికారంలో కూర్చోబెట్టడమే వారు చేసిన తప్పు!'' అని త్రిమూర్తులు అదృశ్యమయ్యారు.
- ఉషాకిరణ్, సెల్:9490403545