Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదిహేనవ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును సహజంగానే అన్ని పార్టీల నేతలూ అభినందించారు. బలపర్చిన వారంతా ఆదివాసీ మహిళగా తొలిసారి ఆ పదవిలోకి రావడం చారిత్రాత్మకమని అభివర్ణించారు. ప్రతిపక్షాల నేతలు ఆమె రాజ్యాంగ విలువలు కాపాడే విధంగా వ్యవహరిస్తారనే ఆశాభావం వెలిబుచ్చుతూ ఆమె కర్తవ్యం గుర్తుచేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ మొదటిసారిగా ఆదివాసీ మహిళ అత్యున్నత రాజ్యాంగపదవి చేపట్టడం సామాజిక న్యాయం అని ఎంతగా కీర్తించినా, ఆ స్వాతంత్రాన్ని సంరక్షించు కునేలా రాజ్యాంగ న్యాయం చేయడం కీలకం. ఉదాహరణకు ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ దళతవర్గానికి చెందిన వారైనప్పటికీ వారికి చేసిన న్యాయమేమీ లేదు. రాజ్యాంగ కోణంలోనూ ఒక్కటంటే ఒక్క అంశంలో తన అభిప్రాయం చెప్పిందిగానీ ప్రత్యేక ముద్ర వేసిందీ గాని లేదు. వాస్తవానికి ఆయన దళిత ప్రతినిధిగా కంటే ఆరెస్సెస్ పరివార్ సభ్యుడుగా తనను తాను నిరూపించుకోవడానికే పాకులాడారు. సుప్రీం కోర్టు చెప్పిన మేరకైనా తన చేతుల్లో ఉన్న అధికారం వినియోగించుకోలేదు. ఒక్కనిర్ణయాన్నయినా ప్రశ్నించిందీ తిప్పిపంపిందీ లేదు. ఇదే దళితవర్గం తరపున దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికైన కెఆర్ నారాయణన్ రాజ్యాంగం యాభయ్యవ వార్షికోత్సవ సందర్భంలో దాని సారాంశం చాటడానికి, అందుకు భిన్నమైనచర్యలు చట్టాలు నిరాకరించడానికి వెనుకాడలేదు. మెజార్టిలేని ప్రభుత్వాలను ఆదరాబాదరాగా ప్రమాణస్వీకారం చేయిస్తే, శాసనసభలను రద్దు చేస్తే అభ్యంతరం చెప్పారు. అమెరికా అధ్యక్షుని సమక్షంలో దేశాల సమానత్వాన్ని చాటారు. డా.శంకర దయాళ్‌శర్మ బాబరీ మసీదు విధ్వంసాన్ని మొదటగా ఖండించి, ప్రధానిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచక్షణాధికారం శాసనాలపై సంతకం చేసేముందు రెండుసార్లు వెనక్కు పంపే అధికారం ఉన్న రాష్ట్రపతి స్థానంలో ఎవరున్నారనేది చాలా ప్రాధాన్యత గల అంశమే.
సామాజిక వాదన సారాంశం
నారాయణన్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా చూపేవారు ఇప్పుడు ద్రౌపది ముర్మును మాత్రం పార్టీలకు అతీతమైన ఆదివాసీ మహిళగానే చిత్రించేందుకు ప్రయత్నించడం వెనక బలమైన రాజకీయ కారణాలున్నాయి. మతతత్వంలో అస్తిత్వ రాజకీయాలను జొప్పించే మోడీ వ్యూహం ప్రతిపక్షాల ఐక్యతకు గండిపెట్టిందనీ, బీజేపీ ఆధిక్యత సాధించందని అతిగా ప్రశంసలు గుప్పిస్తున్న వారు వాటిని విస్మరిస్తున్నారు. బీజేపీ హయాంలో గతంలో మైనార్టీ ముద్రతో ఎన్నికైన ఆబ్దుల్ కలాం సంఫ్‌ుపరివార్ కోరుకునే ఆదర్శ ముస్లిం మాత్రమే గాని మతసామరస్యాన్ని, లౌకిక తత్వాన్నిచాటింది లేదు. ఆయన హయాంలోనే గుజరాత్ మారణకాండ జరగినా గట్టిగా స్పందించింది లేదు. మోడీ స్వయానా బీసీ అయినా వారికోసం చేసింది లేదు. కనుక ఏ తరగతికి చెందిన వారనేదానితో పాటు ఎవరితరపున నిలిచారనేది కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది. ఆ కోణంలో చూసినపుడు ద్రౌపది ముర్ము ఆదివాసిగా పుట్టడం తప్ప వారిహక్కుల కోసం ప్రత్యేకంగా చేసింది పూజ్యం. సీనియార్టీలోనూ మోడీ వంటివారికంటే జూనియర్‌గానే ఉన్నారు. కాబట్టి రామ్‌నాథ్ కోవింద్ కన్నా మరింతగా ఆమె సర్కారు గీతల్లో పనిచేస్తారు. ఎన్నికల ముందు తర్వాత కూడా సామాజిక కోణంలో ఆమె ఎన్నిక గొప్ప సంచలనంగా చెప్పేవారికివేవీ పట్టవు. వారికి కావలసిందల్లా మోడీకి వత్తాసుపలకడమే.
ఓటింగులో విశేషాలు.. విపరీతాలు
ఓట్లపరంగా చూస్తే ద్రౌపది ముర్ముకు 6,76,803 ఓట్లు అంటే దాదాపు 66శాతంవస్తే ప్రతిపక్ష అభర్థి యశ్వంత్ సిన్హాకు 3,80,177ఓట్లు అంటే 34శాతం వచ్చాయి. దేశంలో మోడీకి తిరుగులేదనే ప్రచారం సాగుతున్న సమయంలో అనేక అవరోధాలు దాటుకుని సిన్హాకు ఇన్ని ఓట్లు రావడం విశేషమే. ఎన్డీయేతర పార్టీలలో అనేకం ముర్ముకు ఓటు వేసి వుండకపోతే ఈ సంఖ్య మరింత హెచ్చుగా ఉండేది. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీ రెండూ ముర్ముకు ఓటేయడంతో మొత్తం ఓట్లు ఆమెకు వచ్చినట్టయింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఆమెకు సంఖ్య రీత్యా ఎక్కువ ఓట్లువచ్చాయి. ఎన్డీఏలోలేని బీజేడీ, శివసేన, జెఎంఎం, బిఎస్పి వంటిపార్టీలు పూర్తిగా ముర్ముకే ఓటేశాయి. త్వరలో ఎన్నికలు జరగాల్సిన గుజరాత్‌లోనూ పదిమంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు క్రాస్‌ఓటింగ్ చేయడం బీజేపీకి మరీ సంతోషం కలిగిస్తుంది. ఇద్దరు టిఎంసి వారూ అటే మొగ్గారు. ఇక చెల్లకుండాపోయిన వాటిలో 15 మంది ఎంపిలు, 38మంది ఎంఎల్ఎలు ఉన్నారు. ఈ వివరాలన్నీ పరిశీలించినప్పుడు రాష్ట్రాల స్థాయిలో బీజేపీయేతర పార్టీలకు గట్టి పట్టు ఉన్నట్టు స్పష్టమవుతుంది. అయితే ప్రాంతీయ పార్టీల నాయకుల ఊగిసలాటలు, అవకాశవాదాల వల్ల అక్కడ కూడా బీజేపీ ఓట్లు తెచ్చుకోగలిగింది. కేరళలో మాత్రమే ముర్ముకు అతి తక్కువగా 0.7శాతం, తెలంగాణలో 2.6శాతం పడ్డాయి. ఇదే విధంగా పైన చెప్పిన పార్టీలు రాష్ట్రాలు కూడా నిలబడివుంటే యశ్వంత్ సిన్హాకు మరో లక్షన్నరపైనే ఓట్లు వచ్చేవి. జార్ఖండ్‌లోనైతే పోలింగ్ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కుమారుడిని ఈడీ అరెస్టుచేసి లోబర్చుకుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఏకపక్షంగా సమావేశం నిర్వహించి విమర్శల పాలైన బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత మమతా బెనర్జీనే అభ్యర్థిగా కేంద్రం ముందే ముర్మును ప్రకటించి సంప్రదింపుల జరిపివుంటే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉండేదని ఊగిసలాట ప్రదర్శించారు. బెంగాల్లో సంతాల్ గిరిజనులు ఎక్కువగా ఉంటారు గనక వారి ఓట్ల కోసమే ఆమె ఇలా మాట్లాడారని పరిశీలకులు వ్యాఖ్యానించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో పిల్లిమెగ్గలు
ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఎన్డీఏ తరపున ఎంపిక చేసిన జగదీప్ ధంకర్ మూర్తీభవించిన పరివార్ వాది. ముర్ము విషయంలో సామాజిక న్యాయం చెప్పిన మోడీ ఈ స్థానానికి రాజస్థాన్ జాట్ నాయకుణ్ని ఎంపికచేయడంలోని ద్వంద్వ నీతి చెప్పనవసరం లేదు. పైగా ఆయనను కిసాన్‌పుత్ర అని అభివర్ణించారు. సుదీర్ఘ రైతాంగ ఉద్యమ నేపథ్యంలో దూరమైన జాట్లను, సామాన్య రైతు బాహుళ్యాన్ని ఆకట్టుకోవడానికి చేసిన ఎంపిక ఇది. పైగా జగదీప్ ధంకర్ బెంగాల్ గవర్నర్‌గా రాష్ట్రప్రభుత్వంతో తగాదాలను పరాకాష్టకు చేర్చారు. ప్రభుత్వానికి తెలియకుండానే ట్విటర్ ద్వారా శాసనసభను సమావేశపర్చాలని ఆదేశించిన ఘనత ఆయన స్వంతం. ముఖ్యమంత్రి మమత పాలనపై, దౌర్జన్యాలపై బహిరంగంగా దాడి చేస్తూ బీజేపీతో దాదాపు కుమ్మక్కయ్యారు. అయితే మమతా బెనర్జీ కూడా ఏకపక్ష పోకడలు దాడులు చేసిన దృష్ట్యా ఆయనపై సూత్రరీత్యా పెద్దగా పోరాడలేకపోయింది. అలాంటి గవర్నర్‌ను ఉపరాష్ట్రపతిగా మోడీ నిర్ణయించడం వెనక తృణమూల్ మ్యాచ్‌ఫిక్సింగ్ ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ మేరకు మమత, గవర్నర్ ధంకర్, అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వాస్ శర్మ కొంతకాలం కిందట డార్జిలింగ్‌లో సమావేశమయ్యారు. అది మర్యాద పూర్వకమేనని ప్రభుత్వం అంటుంటే ఇవన్నీ చర్చించి ఒప్పందానికి వచ్చారని ఆరోపణలున్నాయి. దానికి తగినట్టే ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించడానికి ఏర్పాటైన ప్రతిపక్ష సమావేశానికి టిఎంసి హాజరుకాలేదు. ప్రతిపక్ష అభ్యర్థిగా మార్గరెట్ అల్వా నిర్ణయమైనాక తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని, తాము తటస్థంగా ఉంటామని ప్రకటించింది. నిజానికి ఆల్వా ఆమెకు మంచిస్నేహితురాలు కూడా. అయనా ఇలా చేస్తున్నారంటే బలమైన కారణాలుండాలి. దేశంలో ప్రతిపక్ష సమీకరణ తానే చేస్తానని హడావుడి పడిన మమత ఇంతలోనే ఇంతగా మారిపోయారంటే ముందు ముందు ఏం జరిగేది చూడాల్సిందే. ఏమైనా ఉపరాష్ట్రపతిని ఎంపిలు మాత్రమే ఎన్నుకుంటారు గనక ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యతవుంటుంది. ఆపైన వైసీపీ, టీడీపీ, బీజేడీ వంటిపార్టీలూ ఉంటాయి. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా ఉంటారు గనక అక్కడ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా గట్టిగా తొక్కిపట్టగలరని కూడా బీజేపీ వ్యూహంగా ఉంది.
మోడీ ఆయుధాలు, లౌకిక పార్టీల కర్తవ్యం
ఈపరిణామాలన్ని చెప్పేదొకటే... మోడీ నాయకత్వం, బీజేపీ ప్రాబల్యం తిరుగులేనివని ప్రచారం చేసుకుంటున్నా, రాష్ట్రాలలో బలమైన బీజేపీయేతర పార్టీలున్నాయి. అయితే వాటిలో అనేకం మతతత్వ రాజకీయాలను, కేంద్రం నిరంకుశత్వాన్ని గట్టిగా ఎదురించేందుకు నికరంగా ముందుకు రావడం లేదు. మరికొన్ని మోడీకే వంతపాడుతున్నాయి. ఆర్థిక విధానాల విషయంలోనూ వాటికి అసలే పేచీలేదు. సమాఖ్య మూలాలపైనే దాడి చేస్తూ వనరులకు ఎసరు పెడుతున్నా, నిధులు దిగ్గోస్తున్నా, ఆఖరుకు రాష్ట్రాల ఉనికినే నిరాకరిస్తున్నా తాము గెలిస్తే చాలునన్నట్టుంది వాటి పరిస్థితి. దానికి తోడు సిబిఐ, ఇడ,ి ఎన్ఐఎ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి వారిని లొంగదీసుకోవడం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, టీఆర్ఎస్, శివసేన, ఆర్ఎస్పి, డిఎంకె, ఎండిఎంకె, నేషనల్ కాన్ఫరెన్స్, విఎంసి, ఐయుఎంఎల్, ఆర్జేడి వంటి పలుపార్టీలు ఈ విషయమై నిరసన తెల్పుతూ ఒక సంయుక్త ప్రకటనే చేశాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీని ఈడీ గంటలతరబడి విచారిస్తున్న రోజునే ఈ ప్రకటన వెలువడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇడి సిబిఐ విచారణ ఎదుర్కోక తప్పదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు ఈ సమయంలోనే బెదిరిస్తున్నారంటే ప్రతిపక్షాల నిరసన ఎంత వాస్తవమో అర్థమవుతుంది. కేరళలోనూ కేంద్రం కుట్రలు తీవ్రంగానే సాగుతున్నాయి. కనకనే సరైన గుణపాఠాలు తీసుకుని రాష్ట్రాల హక్కుల కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం లౌకిక శక్తులు ఒక్కతాటిమీదకు రావాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి. మోడీకి పునాదిపీఠం లాంటి గుజరాత్, దేశానికే కీలకమైన జమ్మూకాశ్మీర్, హిమచల్ ప్రదేశ్లలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాలలో గిరిజన జనాభా కూడా గణనీయంగా ఉంది. చాలాకాలంగా ఆరెస్సెస్ వనవాసి కళ్యాణపరిషత్ వంటి సంస్థల ద్వారా గిరిజనుల్లో చొరబడే ప్రయత్నం చేస్తూనే ఉంది. వారిలో క్రైస్తవీకరణ గురించి రభస చేయడమే గాక గ్రహంస్టెయిన్ వంటివారి హత్యలు కూడా జరిగాయి. గుజరాత్‌లోని డాంగ్స్ అదవులలో మొదలుపెట్టిన ఈ వ్యూహం ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలోనూ పాచికైంది. కానీ, గిరిజనుల అటవీ హక్కులచట్టం, అడవులలలో అపార ఖనిజసంపద కార్పొరేట్ల పరంచేయడం, పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడం. వారి సంక్షేమ పథకాలను కోత కోయడం జరిగిపోతూనే ఉంది. దేశంలో 8.7శాతంగా ఉన్న ఈ అభాగ్యుల హక్కుల రక్షణ కోసం జరగాల్సిన పోరాటం చాలా ఉంది మోడీ సామాజిక న్యాయ వ్యూహం వాటన్నిటిని మటుమాయం చేయడం జరిగేపనికాదు. పదవులకు కొందరు ఎన్నికైనంత మాత్రాన పరిస్థితులు మారిపోవు.
- తెలకపల్లి రవి