Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలోని బీసీ గురుకులాల పేరులో నుంచి మహాత్మ జ్యోతిరావు ఫూలే పేరును తొలగించాలనే వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కష్ణయ్య డిమాండ్ అర్ధరహితం. ఈ తరహాలో ఆయన మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమే కాకుండా, ఆయనలో బీసీ ఉద్యమ చైతన్యం లోపించడాన్ని సైతం ఇది సూచిస్తున్నది. మొన్న హైదరాబాద్లో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలోని బీసీ గురుకులాలకు మహాత్మ ఫూలే పేరు పెట్టడం అంటే బీసీల అస్తిత్వానికి, ఉనికికి వ్యతిరేకమంటూ ఆయన వ్యాఖ్యానించాడు. బీసీ నాయకుడిగా చెప్పుకుంటున్న ఒక నాయకుడి నోటినుంచి ఈ మాటలు రావడం తెలుగు రాష్ట్రాలలోని బీసీ వర్గాలతోపాటు ప్రజాస్వామిక వాదులందరినీ విస్మయపరిచింది.
ఆధునిక భారత చరిత్రలో బీసీల ఆత్మాభిమాన చైతన్యానికి పునాది వేసిన మహాత్మ ఫూలే నామస్మరణతో బీసీల అస్తిత్వం వెలుగులీనుతుంది తప్ప దిగజారి పోదు. నిజానికి మహాత్మ ఫూలే లేకపోతే బీసీల అస్తిత్వం ఎక్కడీ బీసీల ఆత్మాభిమానం ఎక్కడీ వెనుకబడిన తరగతులంటే తమకు తాము వెనుకబడిన వర్గాల వారు కాదు. వెనక్కి నెట్టి వేయబడ్డ వారు. మెజారిటీ వర్గాలను అలా వెనక్కి నెట్టి వేయడం వెనుక జరిగిన స్వార్ధశక్తుల కుతంత్రమేమిటో, ఆ మనువాద కుత్సితమేమిటో, ఆ మనువాదాన్ని ఎలా ప్రతిఘటిం చాలో, దాన్ని సమూలంగా నిర్మూలించి కులరహిత నవ సమాజ నిర్మాణం ఎలా చేయగలమో, భారతజాతికి నేర్పిన తొలి గురువు, మహనీయుడు, మహాత్ముడూ జ్యోతిరావు ఫూలే. తన ''గులాంగిరీ'' పుస్తకం ద్వారా బీసీలు అనుభవిస్తున్న బానిసత్వానికి కారకులెవరో, ఆ బానిసత్వం నుండి బయట పడడానికి బీసీలు నడవాల్సిన తోవేమిటో వివరించిన క్రాంతిదర్శి మహాత్మ ఫూలే. నాటి కాలపు కులదురహంకార మనువాదులు పూనేలో నివసిస్తున్న ఫూలేను హత్య చేయడానికి కిరాయి మనుషులను పంపించినా ఏమాత్రం వెరవకుండా, ప్రాణాలకు తెగించి బీసీ బిడ్డల చైతన్యం కోసం తన పోరాటాలని కొనసాగించిన త్యాగశీలి ఆయన. నిజానికి ఆయన ఏనాడూ పేరు కోసం పాకులాడలేదు నేటి కాలంలో బీసీ నాయకులమంటూ చెప్పుకుంటున్న వారిలాగా పదవుల కోసం సైతం వెంపర్లాడ లేదు. అయితే ఆయన పేరు పెట్టుకోవడం, ఆయన నామస్మరణ చేయడం ఆయన పట్ల కృతజ్ఞతా సూచనే కాకుండా... బీసీలు నేడు సంతరించు కుంటున్న చైతన్యానికి ప్రతీకగా కూడా నిలుస్తుంది. పురాణకాలం నాటి శంభూకుడు, ఆధునిక కాలపు ఫూలే. భారతదేశ జనావళిలో 85శాతం వరకు ఉన్న బడుగువర్గాల ఆత్మాభిమాన ప్రతీకలుగా నిలిచారు. నేటికాలపు పదవుల వెంట పరుగెత్తే నాయకులకు అర్థం కాని ముచ్చటిది. ఆ మహనీయులని కాదంటే బహుజన ప్రతిఘటనా చరిత్రని విస్మరించడమే అవుతుంది. మహాత్మ ఫూలే తన జీవితం ద్వారా, తాను నడిపిన పోరాటాల ద్వారా, తన రచనల ద్వారా అందించిన బహుజన చైతన్యాన్ని అందిపుచ్చుకోనివాడు, బీసీ వర్గాల్లో పుట్టినా మనువాదిగానే మిగులుతాడు. మనువాద భావజాలం నేడు అంతగా విస్తరించింది. వేలయేళ్ల ఈ దేశపు వెనుకబాటుకు కారణమైన మనువాదాన్ని నిర్మూలించగలిగే మహత్తర సాధనం... మహాత్మ ఫూలే అందించిన మహౌన్నత చైతన్యం! మనువాదులు మహాత్మ ఫూలేను గుర్తించ నిరాకరించడం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. బీసీ ఉద్యమ నాయకులుగా చెప్పుకునే వారికి ఇది ఏ మాత్రమూ సమంజసం కాదు. వైయస్సార్సీసీపీ ఎంపీగా పదవులు అనుభవిస్తున్న కృష్ణయ్య... సంస్థలూ, పథకాల నుండి నాయకుల పేర్లు తొలగించాలనే డిమాండు చేయదలుచుకుంటే, ఒకసారి ఆంధ్రప్రదేశ్లో కొనసాగు తున్న పథకాల వైపు దృష్టి సారిస్తే బాగుంటుంది. ''జగన్ అన్న ఇది'', ''జగన్ అన్న అది'' అనే పథకాల నుంచి జగన్ పేరును తొలగించమని డిమాండ్ చేయమనండి. అధికారంలో ఉన్నంత మాత్రాన తమ పేరుతోనే పథకాలు ఉండాలనే నాయకుల జబర్దస్తీ కృష్ణయ్యకి సమంజసంగానే కనబడుతున్నట్లుందిగానీ, కోట్లాది మంది బడుగువర్గాల సంక్షేమం కోసం జీవితాంతం ఉద్యమించిన మహాత్మ ఫూలే పేరులో మాత్రం అభ్యంతరం కనపడుతుందా? మహాత్మ పూలేను కించపరచడం ద్వారా దేశంలోని వెనుకబడిన వర్గాలను కష్ణయ్య అవమానించారు. ఇప్పటికైన తన తప్పును సరిదిద్దుకుని.. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
-ఆర్. రాజేశమ్
సెల్: 9440443183