Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖ్యమంత్రిగారు అసెంబ్లీ సాక్షిగా ''విఆర్ఎలకు పేస్కేల్, వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇస్తామ''ని ప్రకటించి రెండేండ్లు కావస్తున్నది. ఈ హామీని అమలు చేయాలని అనేక సార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, రెవెన్యూ ఉన్నత అధికారులకు దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టినా పెడచెవిన పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దఫ దఫాలుగా నిరసనలు తెలిపితే పోలీసులతో అరెస్టులు చేయించి, నిర్బంధించారు. అనేకమంది వీఆర్ఏ లను గాయపరిచారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా, ఆందోళనలను సైతం పట్టించుకోకపోవడంతో ఈనెల 25 నుండి వీఆర్ఏలు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు.
విఆర్ఏలు నిర్వహిస్తున్న విధులు
రాష్ట్రవ్యాప్తంగా 23వేల మంది వీఆర్ఎలు ఉన్నారు. వీరిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మూడు వేల మందిని నియమించినారు. ఇందులో 50శాతం మహిళలు, దివ్యాంగులున్నారు. ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సమగ్ర కుటుంబ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లు, కళ్యాణ లక్మి,, షాదీముబారక్ మొదలుకొని నేటి రైతుబంధు, దళిత బంధు వరకు అనేక సర్వేలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు పోవడంలో వీఆర్ఏలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. రేయింబవళ్ళు చాకిరి చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కానీ, శ్రమకు తగ్గ ఫలితం, కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు కల్పించాలనే చిత్తశుద్ధిగానీ పాలకులకు లేకపోవడం విచారకరం.
సీఎం మాటకు విలువేది?
2020 సెప్టెంబర్ 9న శాసనసభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ... ''వీఆర్ఓ వ్యవస్థను రద్దుచేసి, విఆర్ఎలను కొనసాగిస్తాం, వీఆర్ఎలు తరతరాలుగా అతి తక్కువ వేతనంతో వెట్టిచాకిరి చేస్తున్నారు, నూటికి 95శాతం మంది ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా ఉన్నారు, వీరంత సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళిత వర్గారే, వారికీ న్యాయం చేస్తాం... వీఆర్ఎలంతా తలెత్తుకొని జీవించేటట్లు వారందరికీ పేస్కేల్ ఇస్తాం, వయస్సు పైబడిన తండ్రుల స్థానంలో వారి వారసులకు (పిల్లలకు) ఉద్యోగాలు ఇస్తాం, చదువుకున్న వారికి విద్యార్హత లను బట్టి ప్రమోషన్లు కల్పిస్తామ''ని స్వయానా ముఖ్యమంత్రే నిండు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ నేటికి రెండు సంవత్సరాలు అవుతున్నా అమలుకు నోచుకోలేదు. పేస్కేలు వస్తే బతుకులు మారుతాయి, జీతం పెరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వస్తుంది, ఉద్యోగులాగా అన్ని సౌకర్యాలు వస్తాయని ఆశించి ఎదురు చూస్తున్న వీఆర్ఎలకు నిరాశే మిగిలింది. హామీలు ఇచ్చి అమలు చెయ్యకుండా బడుగు జీవులైన వీఆర్ఏలను మోసం చేయడం ఈ ప్రభుత్వానికి తగదు.
హామీల అమలు కోసం అనేక ఆందోళనలు
ఫిబ్రవరి 7న తాసిల్దార్ కార్యాలయాల వద్ద, ఫిబ్రవరి 10న కలెక్టరేట్ కార్యాలయాల వద్ద, ఫిబ్రవరి 22న వేలాదిమంది వీఆర్ఏలు చలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించి, నిరసనలు తెలిపిన ఫలితంగా రెండవసారి అసెంబ్లీలో సీఎం వీఆర్ఎల గురించి మాట్లాడుతూ... ఇచ్చిన హామీలకు కట్టబడి ఉన్నామని చెప్పి కూడా నాలుగు నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఫైలు కూడా కదలలేదు. డిపార్టుమెంట్ ఫైలు తయారుచేసి ప్రభుత్వానికి పంపలేదు.
2017 ఫిబ్రవరి 24న శివరాత్రి సందర్భంగా ప్రగతి భవన్లో విఆర్ఎ సంఘాల నాయకుల సమక్షంలో వీఆర్ఎలందరికీ సొంత గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని, అర్హత కలిగిన వీఆర్ఏలందరికీ వీఆర్వో, అటెండర్, వాచ్చిమెన్, జీపు డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, తదితర ఖాళీలలో ప్రమోషన్లు కల్పిస్తామని. ప్రతి నెల ఒకటవ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా జీతాలు చెల్లిస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఐదేండ్లు దాటుతున్నా.... దానికీ అతీగతీ లేదు. అంతెందుకు, జూలై నెల ముగుస్తున్నా జూన్ నెల జీతం ఇప్పటికీ ఇవ్వకపోతే ఏమి తిని బతకాలి? కుటుంబాలను ఎలా పోషించుకోవాలి?.
ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీ ప్రకటించిన రోజున... ప్రజా ప్రతినిధులకు స్కీమ్ వర్కర్లకు, హౌంగార్డులకు, వీఆర్ఎలకు కూడా పీఆర్సీ వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన అన్ని రంగాల వారికి జీవోలు ఇచ్చి అమలు చేస్తున్న ప్రభుత్వం... వీఆర్ఎలకు మాత్రమే ఎందుకు అమలుచేయటంలేదు? స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలకే దిక్కులేకపోతే ఇక ఎవరికి చెప్పుకోవాలి? వీఆర్ఏలంతా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళితవర్గాల వారే అనే వివక్షనా? లేక వీరంతా నోరులేని అమాయక బడుగుజీవులన్న నిర్లక్ష్యమా? ఇచ్చినంత తీసుకుంటారు కడుపు మాడ్చుకొని పడుకుంటారు తప్ప ఎదురు మాట్లాడలేరూ, ఐక్యంగా పోరాడలేరనే ధీమానా?
హామీలు తప్ప అమలులేది!
అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన నాడే పేస్కేల్ జీవో ఇచ్చి ఉంటే, పీఆర్సీ బిశ్వాస్ కమిటీ రికమండేషన్ ప్రకారం క్రింది స్థాయి ఉద్యోగికి నెలకు రూ.19000 వేతనం, దానికి 30శాతం పీఆర్సీ కలిపి ఇస్తే ఒక్కో వీఆర్ఎకు నేడు వస్తున్న నెలకు రూ.10,500 కాకుండా నెలకు రూ.25 వేలు జీతం వచ్చి ఉండేది. అంటే ఒక్కో విఆర్ఎ రూ.15వేల జీతం ప్రతినెల కోల్పోతున్నాడు. ఈ నష్టానికి కారణం ప్రభుత్వం జీవో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడమే కదా! అసెంబ్లీలో అదనంగా 250 కోట్లు ఖర్చయినా, ప్రభుత్వానికి భారమైనా పేస్కేల్ అమలు చేస్తామని చెప్పి, మాట తప్పడం ముఖ్యమంత్రి గారికి తగునా? ఈ రెండు సంవత్సరాలుగా పెరుగుతున్న నిత్యా వసర వస్తువుల ధరలకు... వచ్చే అత్యల్పవేతనాలు చాలక, కుటుంబ అవసరాలు తీరకల, పే స్కేల్ వస్తుందీ జీతం పెరుగు తుందన్న భరోసాతో, ముఖ్యమంత్రి మాట మీద నమ్మకంతో అప్పులు చేసి, వడ్డీలు పెరిగి, అవి తీర్చలేక అనేకమంది ఆత్మహత్యలు చేసుకొని జీవితాలు చాలిస్తున్నారు. ఆ కుటుంబాలు వీధిన పడు తున్నాయి. వారిని ఆదుకునే దిక్కేవరు?
వీఆర్ఏల గోడు పట్టదా?
రెవెన్యూ వ్యవస్థకు క్షేత్ర స్థాయిలో వీఆర్ఎ ఉంటే పై స్థాయిలో ప్రధాన భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) ఉంటాడు. మధ్యలో వీఆర్వో, ఆర్ఐ, తాసిల్దార్, ఆర్డీవో, డిఆర్ఓ, జెసి, కలెక్టర్లు ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుండి సమస్యలు చెప్పుకోవడానికి సిసిఎల్ఏ లేడు. రెవిన్యూ శాఖకు మంత్రి లేడు, ప్రిన్సిపాల్ సెక్రటరీ లేడు. ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా ముఖ్యమంత్రి గారేమో అపాయిమెంట్ కూడా ఇవ్వరు! క్రింది స్థాయిఉద్యోగులు సమస్యలు చెప్పుకుందామంటే వినే నాథుడే లేడు. పైగా 10 జిల్లాలను 33 జిల్లాలుగా పెంచారు. 74 రెవెన్యూ డివిజన్లు, 594 మండలాలను ఏర్పాటు చేశారు. కానీ పెంచినదానికి అనుగుణంగా సిబ్బందిని మాత్రం పెంచలేదు. ఉన్న విఆర్వో వ్యవస్థని రద్దుచేసారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న సిబ్బందికి ప్రమోషన్లు లేవు. ఉన్న సిబ్బంది పై విపరీతమైన పని భారాన్ని పెంచారు. కొందరయితే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ స్థితికి కారకులెవ్వరు? ఫలితంగా ఈ పనిభారం మొత్తాన్ని మోస్తున్నదెవ్వరు? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బేషాజాలకు పోకుండా విఆర్ఎల జెఏసితో చర్చలు జరిపి, హామీలు అమలు చేస్తూ జీవోలు జారీ చేయాలి. విఆర్ఎల సమ్మె పోరాటం విరమింప చేయాలి.
- వంగూరు రాములు
సెల్:9490098247