Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 80లక్షల మంది పేదలున్నారు. వీరిలో అనేకులు సొంత ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. పాలకులు మాత్రం పేదల ఇంటి నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో పేదల సొంత ఇంటి కల కలగనే మిగిలిపోతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల లోపే డబల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి కేటాయిస్తామనీ, లేనిపక్షంలో ఓట్లే అడగమని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్ నేటికీ అమలు చేసిన పాపానపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా రూ.19వేలకోట్లతో 2,91,000 ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేయగా, నేటికి రూ.10వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. దీంతో ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. నిధులు సక్రమంగా రిలీజ్ చేయకపోవడంతో నిర్మాణ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఇండ్ల నిర్మాణం అక్కడక్కడ పూర్తి అయినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఇండ్లు కూడా శిధిలావస్థకు చేరాయి. తలుపులు, కిటికీలు మొత్తం చెదలు పట్టి విరిగిపోతున్నాయి. వివిధ జిల్లాల్లో లబ్ధిదారుల నుండి దరఖాస్తులు తీసుకున్న అధికారులు, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల వివరాలను సేకరించి విచారణ చేసి లిస్టులు తయారుచేసినా, స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా నేటికీ లబ్ధిదారులకు ఇండ్లకు నోచుకోలేదు. దీంతో ''అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని'' అన్నట్టుగా తయారైంది లబ్ధిదారుల పరిస్థితి.పేదలకు ఇండ్లు ఇవ్వకపోయినా కనీసం సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే ఆర్థిక సాయం అందించే పథకం కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు. ''త్వరలో ప్రారంభిస్తామ''నే ప్రకటనలు తప్ప అమలు జాడలేదు. గత ప్రభుత్వ హయాంలో రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇండ్ల కింద నిర్మించిన వేలాది ఇండ్లు నిర్మాణం పూర్తి కాకపోవడంతో కోట్లాది రూపాయలు మొండి గోడలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వం వెంటనే గతంలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లకు పెండింగ్ బకాయిలు విడుదల చేస్తే వేలాది కుటుంబాలకు ఊరట కలిగే అవకాశం ఉంది. సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి మొత్తం నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలి. తాము 2018లో రెండవసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇల్లు లేని 22లక్షల కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి 5లక్షల 50వేల రూపాయలు ఇస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. ''ఒంటే పెదవులకు నక్క ఆశపడ్డట్టు'' ఎదురు చూడటం ప్రజల వంతయింది. ఓకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉంటూ జీవనం కొనసాగిస్తున్న పేద, దళితు, బలహీన వర్గాల కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా ఉన్న చిన్నపాటి ఇరుకు ఇండ్లల్లో వారం రోజులపాటు బిక్కు బిక్కు మంటూ పేదలు కాలమెల్లదీశారు. స్వతహాగా ఇల్లు నిర్మించుకోవాలంటే పెరిగిన సిమెంట్, ఇనుము ఇతర భవన నిర్మాణ రంగానికి చెందిన అన్ని రకాల ధరలతో పేదలకు ఆ అవకాశమే లేకుండాపోయింది. నేటికీ రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామా లలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకున్న వారికి బిల్లులు ఇవ్వకపోగా, హౌసింగ్ శాఖను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి పేదల ఇంటి నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిద్దాం...
- మట్టిపల్లి సైదులు
సెల్:8106778287