Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేరం, దుర్వినియోగాలపై దోషిగా నిర్ణయించిన వారిని విచారించేందుకు, ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనప్పుడు, కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం కంగారూ కోర్టుని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలు, ప్రజల చట్టబద్ద హక్కులు, రాజ్యాంగాన్ని కంగారూ కోర్టు పట్టించుకోదు. విచారించకనే దోషిని నిర్థారించి, శిక్ష నిర్ణయిస్తుంది. ఉద్దేశపూర్వకంగా బాధ్యతలను మరిచే చట్టసమ్మత కోర్టులూ కంగారూ కోర్టులే. న్యాయవ్యవస్థ నిర్మాణనిర్వహణలు క్షీణించినప్పుడు నాసిరకం తీర్పుల కంగారూ కోర్టులు తయారవుతాయి.. పోటీనిర్వహణలో తటస్థంగా ఉండాల్సిన రెఫరి తొండి టీంలో ప్రధాన ఆటగానిగా మారితే శక్తిసామర్థ్యాల ప్రతిపక్షం కూడా గెలవలేదు. న్యాయవ్యవస్థలో పాలకవర్గ ప్రమేయం ఇలాంటి స్థితినే కల్పించింది.
కంగారూ కోర్టు ఆస్ట్రేలియా పదమని కొందరు అంటారు. కానీ ఈ పదజాల మూలం 1853 నాటి అమెరికాలో ఉందని ఆక్స్ఫÛర్డ్ ఆంగ్ల నిఘంటువు పేర్కొంది. లూసియానా రాష్ట్రంలో 1841లోనే దీని ప్రస్తావన ఉంది. 1848 జనవరిలో జేమ్స్ మార్షల్ కాలిఫోర్నియాలో బంగారు కనుగొన్నాడు. కాలిఫోర్నియాలో అప్పుడు అమలులో ఉన్న మెక్సికన్ చట్టాల ప్రకారం ఖనిజాలను కనుగొన్నవారికే ఆ గనులపై అధికారం ఇవ్వబడింది. 1849లో ఈ గనుల యాజమాన్యంపై హడావిడి విచారణ జరిగింది. సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా దాటేసి ప్రతివాదుల అనుకూల తీర్పు చెప్పారు. ఇందులో ఆస్ట్రేలియా ప్రవాస గని కార్మికులు వాదులు. న్యాయం కంగారూ గంతులు వేసిందని ప్రచారం జరిగింది. ఈ కోర్టులు తమ అవసర అంశాలను వెంటనే విచారిస్తాయి. ప్రజా సమస్యలను, కంగారూ ఎగిరినట్లు, దాటేస్తాయి. కంగారూ పొట్ట సంచి లాంటి తమ జేబులో ఎవరో న్యాయవ్యవస్థను పెట్టుకున్నారన్న అర్థంలో నేటి కోర్టులను కంగారూ కోర్టులని వ్యాఖ్యానించి ఉండవచ్చు. కంగారూ కోర్టు క్రూర హాస్య ప్రతీకలైన కాలమాజు, బూగర్ హౌలెల నుండి పుట్టిందని శబ్దలక్షణ శాస్త్రజ్ఞుడు ఫీలొలోగోస్ వాదన. కాలమాజు అమెరికా మిచిగాన్ రాష్ట్రంలో ఒక నగరం. అమెరికా ఆదివాసులు నీటి మడుగులను సులభంగా దాటడానికి అనువైన ఈ ప్రదేశంలో మొదటగా ఇల్లు కట్టుకున్నారు. వీరు ఘోర హత్యలకు గురయ్యారు. అయినా ఎవరికీ శిక్షలు పడలేదు. బూగర్ హౌలె సౌత్ వర్జీనియా రాష్ట్రంలో గుర్తింపులేని తెగ. 1917లో ఈ తెగపై డజన్లకొద్దీ హత్యలు జరిగాయి. విచారణకు స్పెషల్ గ్రాండ్ జ్యూరీని నియమించారు. ఒక ఘటనపై న్యాయ విచారణ జరపాలా వద్దా అని సలహాచెప్పే ''న్యాయస్థానం'' గ్రాండ్ జ్యూరీ. ఇక్కడ న్యాయం ఎవరికి జరుగుతుందో ఊహించవచ్చు. 1951లోనే అమెరికన్ జడ్జ్ విలియం డౌగ్లాస్ తన తీర్పులో ఇలా వ్యాఖ్యా నించారు... ''పోలీసులు నిందితులను హింసించి నేరాన్ని ఒప్పించేచోట నిందితుల హక్కులు నిరాకరించబడతాయి. కంగారూ కోర్టులో కాక చట్టబద్ద కోర్టులో విచారించబడటం నిందితుని హక్కు..''
బొహేమియన్ నవలాకారుడు ఫ్రాంజ్ కాఫ్కా 1914లో తన జర్మన్ నవల 'విచారణ (ట్రైల్)'లో పాలకులు నేరమే తెలపకుండా తమ వ్యతిరేకులను ఎలా బంధించి ఉరిశిక్ష విధిస్తారో వర్ణించారు. 1933-45 మధ్య జర్మనీ నియంత ప్రజాకోర్టుల పేరుతో కంగారూ కోర్టులు నడిపాడు. 20.7.1944న హిట్లర్ హత్యా ప్రయత్న అభాండంతో ప్రగతిశీల పోరాట యోధులందరికీ ఈ కోర్టులు ఉరిశిక్ష వేశాయి. మన కోరేగావ్ అరెస్టులు ఈ కోవలోవే. పాలకవర్గ, అధికారుల ప్రోత్సాహిత హత్యలు, అఘాయిత్యాల్లో కంగారూ కోర్టులు దోషులను శిక్షించవు. దీనికి గోధ్రా, బాబ్రి మసీదులు ఉదాహరణలు. ప్రజా పక్షపాత రాజకీయవేత్తలు, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, అసహాయుల కోసం పోరాడేవారిని శిక్షిస్తారు. సామాజిక న్యాయం పట్టని మతపక్షపాత న్యాయరంగ వృత్తికారులు చట్టవిరుద్ధ వ్యాజ్యాలకు పాల్పడతారు. స్వయంప్రకటిత అప్రమత్త బృందాల మతోన్మాద మూకహత్యలు కంగారూ కోర్టు ప్రేరేపిత చర్యలే. భారత దేశంలో పూర్వం రాజులు సమస్యలు పరిష్కరించేవారు. తర్వాత వలసవాద శిక్షాస్మృతి ఆంగ్ల పక్షపాత కంగారూ కోర్టులు వచ్చాయి. ప్రాచీన హీన సంస్మృతి పంచాయతీ కంగారూ కోర్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి గోహత్యల నుంచి కులమతాంతర వివాహాల వరకు ఏకపక్ష తీర్పులు అమలుచేస్తూనే ఉన్నాయి.
నేటి పాలకులు తమ వైదిక ఆధిపత్య తాత్వికతకు వలసవాదాన్ని జోడించారు. పశ్చిమ బంగ బీర్ భూమ్ జిల్లా సుబల్పుర్లో 2014 జనవరిలో 20ఏండ్ల యువతిపై 12 మృగాలు సామూహిక అత్యాచారం చేశాయి. ఇది ఆమె శీలరాహిత్య నేరానికి గ్రామ కంగారూ కోర్టు వేసిన శిక్ష. స్త్రీలతో సహా మొత్తం గ్రామం ఈ తీర్పును సమర్థించింది. ఉత్తర భారత ఖాప్ పంచాయతీలు, దక్షిణ భారత కుల దురహంకార గుంపులు కంగారూ కోర్టులే. ఇవి అగ్రకుల నేరస్తులను కొద్ది జరిమానాతో వదిలేస్తాయి. తక్కువ కులాల బాధితులను ఆర్థిక ప్రలోభాలతో తృప్తిపరుస్తాయి. మానభంగాల నిందితులను పోలీసులు చంపటం కంగారూ కోర్టు తీర్పులే. ఉత్తరప్రదేశ్ కంగారూ కోర్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాలను సుప్రీంకోర్టు మందలించింది.
పాలకులు న్యాయమూర్తులను రాజ్యాంగ పదవులతో ప్రలోభపెడతారు. కొందరిని పాత సంఘటనలతో బెదిరిస్తారు. కొందరిని వారి పాత తీర్పులతో నోర్లు మూయిస్తారు. ఫలితమే కంగారూ కోర్టులు. ఇటీవలి కాలంలో అధిక శాతం తీర్పులు పాలకపక్ష అనుకూలమే. కీలకతీర్పుల్లో కూడా అసమ్మతి నోట్లేదు. పాలకవర్గ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కేసులు వెంటనే విచారణకు వచ్చాయి. కొన్ని ఆలస్యమయాయి. కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణకే నోచుకోలేదు.
రాముని కట్టుకథతో కుర్చీ ఎక్కిన సంఫ్‌ు పాలకులు రాజ్యాంగాన్ని చట్టపర కట్టుకథగా మార్చారు. సుప్రీంకోర్టు సంఫ్‌ు పాలకులకు సహకరించింది. పాలకపక్షేతర మతస్తుల ఆశలు వమ్ముచేసింది. పాలకపక్ష నేరస్తులు విముక్తులయ్యారు. తాత్విక అసమ్మతీయులు ఉగ్రవాదులుగా ఉపచట్టం కింద ఉరిశిక్షకు దగ్గరయారు. పౌరసమాజం నలిపివేయబడింది. ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు, విధ్వంసం, మానభంగాలు, హత్యలకు కారణమైనవారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పవిత్ర రాజ్యాంగం అమలుకావాలని ఆశించిన మేధావులు, ప్రగతిశీల యువకులు ఉగ్రవాదులుగా చిత్రీకరించబడి జైళ్ళలో ఉన్నారు. వీరి జీవితాలు నాశనమయ్యాయి. రాజ్యం, పాలకపక్ష మాధ్యమాలు కలిసి భారత భవిష్యత్తును హత్యచేశాయి. దేశప్రేమికులు మాట్లాడ డానికే భయపడుతున్నారు. కంగారూ కోర్టుల్లో చట్టం తనపని తాను చేయడంలేదు. రాజ్యం సైద్ధాంతిక, భౌతిక బెదిరింపులను సాధనాలుగా వాడుకుంటోంది. రాజ్యాంగ విలువల పతన ప్రక్రియకు కంగారూ కోర్టులు కవచంగా మారాయి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్: 9490204545