Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలతో రైతులు అవస్థలు పడుతున్నారు. ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ''కోటి యాభై అయిదు లక్షల'' ఎకరాల వ్యవసాయ భూమి సమస్య పరిష్కారం చేస్తామని, 63లక్షల రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా, తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరగకుండా, పది నిమిషాల్లో ఈపాస్ బుక్ యజమాని చేతికి వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేడ్చల్‌జిల్లా, మూడు చింతలపల్లి మండలంలో ధరణి పోర్టల్ ప్రారంభిస్తూ... వారసత్వ భూములు గిఫ్ట్ భూములే కాదు, కొనుగోలు దారులు కూడా 10నిమిషాల్లో పట్టా పుస్తకాన్ని జేబుల్లో పెట్టుకుని వెళ్లిపోవచ్చని చెప్పారు. కానీ రెండేండ్లు గడుస్తున్నా సమస్యలు తీరకపోవడంతో, రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని అయోమయ స్థితిలో బాధపడుతున్నారు. రైతు బంధు కోసం, రైతు బీమా కోసం పట్టా బుక్కులు రాక కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోతున్నారు. ధరణి పోర్టల్‌లో పారదర్శకత గానీ, భూమి రిజిస్ట్రేషన్ బదిలీలో జవాబుదారితనం గానీ, ఆన్లైన్లో ఏమి కనబడకపోగా, ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల మీద వచ్చే ఆదాయం కోసం ఉపయోగపడే విధంగా కొనసాగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరణిలో మిస్సింగ్ సర్వే నంబర్లు, మిస్సింగ్ పాస్ బుక్కులు, ల్యాండ్ మార్కులు లేకుండా అనేక తప్పులు ఉన్నాయని రైతులు ఇబ్బంది పడుతున్నారు. అనర్హులు భూమి పట్టాలతో సంతోషిస్తుండగా, అర్హులైన రైతులు మాత్రం పట్టాలు రాక ఇబ్బందులకు గురి అవుతున్నారు. కొత్త మాడ్యుల్ ద్వారా 12రోజుల్లో సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పిన ప్రభుత్వం, కేవలం 12రోజుల్లో వివిధ సమస్యలపై వచ్చిన 11,975 దరఖాస్తుల ద్వారా కోటి 20 లక్షల రూపాయలు వసూలు చేసింది తప్ప, పరిష్కరించిందేమీ లేదు. ఇవి కాకుండా మీ సేవా కేంద్రాల్లో వెయ్యి నుంచి రెండువేలు వసూలు చేశారు.
ఇప్పటికీ 15లక్షల ఎకరాలకి పాసుబుక్కులు రాలేదు. భూమిలేనటువంటి వాళ్ళకి లక్షకుపైగా పాసుబుక్కులు ఇచ్చారు. రాష్ట్రం మొత్తం 14లక్షల లావణ్య పట్టా భూములు పెండింగ్‌లో పెట్టారు. ఏజెన్సీలో కూడా పట్టా చేయకుండా లాక్ ఉందని చెపుతున్నారు. ఇన్ని అవకతవకలు ఉన్న ధరణిలో రైతులది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం 94శాతం భూమి సమస్య పరిష్కారం అయ్యిందని చెబుతుండగా, గ్రామాల్లో మాత్రం 30 నుంచి 40శాతం సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. ధరణి పోర్టల్ పట్టాలకు హద్దులు లేవు, సర్వేతోపాటు మ్యాపులు లేవు, సర్వేయర్స్ లేరు, డిజైన్ చేసే అధికారులు లేరు, చివరికి దరఖాస్తులు తీసుకునే వారేలేరు. కలెక్టర్ లాగిన్‌లో కూడా భూమి ఉన్నా పట్టా ఇచ్చే అధికారం లేకుండా పోయింది. భూసమగ్ర సర్వే చేపడుతున్నామని, బడ్జెట్లో 600కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం 2021-2022లో 400కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో జవాబుతారితనం ఉంటుందనీ, భూపరిపాలనా వ్యవస్థ, రెవెన్యూ పాలనా వ్యవస్థ ఇక ధరణి పోర్టల్ ద్వారా పరుగులు తీస్తుందనీ ముఖ్యమంత్రి చెప్పిన మాట బుట్టదాఖలయింది.
ధరణి నిర్వాకం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు, తిరిగి తిరిగి అలసిపోయి ఆశలు వదులుకున్న అభాగ్యులు ఎందరో...! కానీ అనర్హులు అనేకులకు పట్టా పాస్బుక్లొచ్చాయి. వారు రైతుబంధు తీసుకుంటున్నారు, బ్యాంకు రుణాలూ పొందుతున్నారు. అర్హులైన రైతులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రెవెన్యూ పట్టా భూమి ఉన్నా లావణ్య పట్టా పేరుతో ఆప్షన్లేదని భూములను సరిచేయడం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ లాక్‌లో ఉందని అధికారులు బాధితులను వెనక్కి పంపుతున్నారు. అన్నకు రావలసిన భూమి తమ్మునికి, తమ్మునికి రావాల్సిన భూమి మరొకరికి... ఇలా అనేకం తప్పుల తడకలుగా ఉన్నాయి. ఎవరికి బడితే వాళ్ళకి తప్పుడు పేర్లతో తప్పుడు పాస్‌బుక్ పట్టాలు ఇచ్చేసి చివరకు అర్హులైన వారిని ఆవేదనకు గురిచేస్తున్నారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు అధ్యక్షతన కమిటీ వేసి 36రకాల సమస్యలు గుర్తించారు. వాటిలో 20సమస్యలు తక్షణమే పరిష్కారం చేయవచ్చనీ, నెల రోజుల్లో పూర్తి చేస్తామనీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా అది అమలుకు నోచలేదు. సిసిఎల్ఏ కార్యాలయానికి ఏ సమస్య తీసుకెళ్లినా ప్రభుత్వం దృష్టిలో ఉంది, పరిష్కారం అవుతాయని చెబుతూ కాలయాపన చేయడం తప్ప పరిష్కరించేదేమీ లేదు. ర్రాష్ట్ర ప్రభుత్వ ఈ చర్య కేవలం రియల్ ఎస్టేట్ దళారులకు అవకాశం కల్పించే విధంగా ఉందనీ, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరుగా మాత్రమే చూస్తున్నదనీ, ఇందులో దళారుల పాత్ర కూడా గణనీయంగా ఉన్నదనీ ప్రజలు బాహటంగానే మాట్లాడు కుంటున్నారు. ఈ విమర్శ నుంచి బయటపడాలంటే ప్రభుత్వం తక్షణమే ధరణి పోర్టల్‌లో సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలి.
- ఎం. ధర్మనాయక్
సెల్: 9490098685