Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఈ రోజు సంతోషంగా కనిపిస్తున్నారేమిటీ?''
''మొదట్లో రాణుల కడుపుల నుంచి రాజులు పుట్టేవారు. నేనిప్పుడు ప్రజల ఓట్లతో ఓట్ల పెట్టె నుంచి రాజు పుట్టే ఏర్పాటు చేశాను. అందుకే ఈ సంతోషం''
''అయితే మీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు... ఎందుకంటే నీ ప్రజలు పేదలు నిస్సహాయులు, అడుక్కునే వాళ్ళు, అమ్ముడు పోయే వాళ్ళు... మేము వారి ఓట్లను కొని, మా ప్రభుత్వాలను మేం ఏర్పాటు చేస్తాం. అప్పుడు మీరేమీ చేయలేరు.''
''నా ప్రజలు పేదలే నిస్సహాయులే, అడుక్కు తినేవారే కావొచ్చు, మీరు వారి ఓట్లను కొని ప్రభుత్వాలు ఏర్పాటు చేయొచ్చు.. కానీ, ఏరోజైతే నా ప్రజలు తమ ఓటు విలువను సరిగా గుర్తిస్తారో అప్పుడు మీకంటే పెద్ద బిచ్చగాళ్ళు ఎవరూ ఉండరు. గుర్తుంచుకోండి!''
ఇది పార్లమెంట్లో ఒకరికొకరు ఎదురుపడిన అంబేద్కర్, కృపలానీల మధ్య జరిగిన సంభాషణ.
ఓటు అనే ఆయుధంతో పేద, ధనిక అన్న తేడా లేకుండా ఎవరైనా పాలకుడు కావచ్చు. ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఏమైనా కావచ్చు. అది పేదవాడైనా, ధనికుడైనా. ఈ ఉద్దేశంతోనే మన రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్.అంబేద్కర్ దేశ పౌరులందరికీ ''ఓటు'' అనే ఆయుధం ఇచ్చారు. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని, తమలోని ఒకడిని పాలకుడిగా చేసుకోవడానికి అంబేద్కర్ ఈ ఓటు హక్కు కల్పించారు. కానీ, కాలం మారుతోంది. ''మన ఓటు మన ప్రభుత్వం'' అన్న రాజకీయాలు కాస్త ఇప్పుడు రూపుమార్చుకొన్నాయి. ''మీ నోటు - మా ఓటు'' అన్న పరిస్థితి దాపురించింది. ఫలితంగా గెలిచినవారి తీరు ''ఓట్లు కొన్నాం కాబట్టి పాలన నా సొంతం, మీకు కోసం కాదు'' అన్నట్లుగా ఎన్నికల్లో గెలిచిన వారి తీరుగావుంది. మనదేశంలో సాధారణ ఎన్నికల నిర్వాహణలో ప్రభుత్వ ఖర్చు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 1952లో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వ ఖజానాపై కేవలం రూ.10.5 కోట్ల భారం పడింది. అదే 2019 సాధారణ ఎన్నికల విషయానికి వస్తే రూ.10వేల కోట్లకు చేరింది. ఇక ఆయా పార్టీలు ఎన్నికల్లో పెట్టే ఖర్చుకు అంతూపొంతూ లేదు. ఇటీవల సీఎంఎస్ విడుదల చేసిన నివేదికను బట్టి చూస్తే అన్నీ రాజకీయ పార్టీలు 2019 ఎన్నికల్లో సుమారు 60వేల కోట్లు చేశాయని తేల్చి చెప్పింది. అభ్యర్థుల ఖర్చు దీనికి అదనం. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా రూ.70 లక్షల వరకు ఖర్చుచేసేందుకు ఎన్నికల కమిషన్ పరిమితి విధించింది. సీఎంఎస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో అభ్యర్థులందరూ మొత్తంగా రూ.20వేల కోట్ల నుంచి రూ.25వేల కోట్ల వరకు ప్రచారం కోసం ఖర్చు చేస్తే... రూ.12వేల నుంచి రూ.15వేల కోట్ల వరకు నేరుగా ఓటర్లకు డబ్బు రూపంలో పంచిపెట్టారని పేర్కొంది. 2019 ఎన్నికల్లో మొత్తం రూ.3,500 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోగా వాటిలో రూ.1,300 కోట్లు మాదక ద్రవ్యాలు, రూ.839 కోట్ల నగదు, రూ.294 కోట్ల మద్యం, రూ.986 కోట్ల బంగారం, వెండితో పాటు ఇతర విలువైన వస్తువులు రూ.58 కోట్ల వరకూ ఉన్నాయి. పట్టుబడ్డ సొమ్ము ఇంత ఉందంటే... మన నాయకులు ఎన్నికల్లో గెలవడానికి ఖర్చు చేసిన సొమ్ము ఎంత ఉండాలి..?! డబ్బును వెదజల్లి ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు తిరిగి ఆ సొమ్మును ప్రజలపై నుంచే సంపాధిస్తారన్నది వాస్తవం. పాలనలో భాగమైన ప్రజా ప్రతినిధులు తమ సొమ్మును తిరిగి తమ నుంచే తిరిగి ఎలా వసూలు చేస్తారు అన్నది బయటకు కనిపించని ఓ చిక్కుముడి. డబ్బు వెదజల్లి ఎన్నికల్లో గెలిచిన వారు ఏర్పాటు చేసే ప్రభు త్వాలు దళారులు, కార్పొరేట్ వ్యవస్థలకు లాభాలు చేకూర్చే చట్టాలను తీసుకురావడం ద్వారా అంతర్గతంగా లావాదేవీలు సాగుతాయన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఓటు సరుకు కాదు, మన హక్కు అని గుర్తించినప్పుడే మార్పు.
- సయ్యద్ నిసార్ అహ్మద్సెల్:7801019343